మినీ స్టేడియం నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలి
ABN , First Publish Date - 2020-12-11T04:32:38+05:30 IST
జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్ మైదానంలో మినీ స్టేడియం నిర్మించవద్దని, క్రీడా అధికారి శ్రీకాంత్‌రెడ్డి, అతని అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు గురువారం సంతకాల సేకరణ చేపట్టారు.

ఏసీసీ, డిసెంబరు 10 : జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్ మైదానంలో మినీ స్టేడియం నిర్మించవద్దని, క్రీడా అధికారి శ్రీకాంత్‌రెడ్డి, అతని అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. అఖిలపక్ష కమిటీ నాయకులు తులా మధుసూదన్‌రావు, వంగల దయానంద్ మాట్లాడుతూ పాఠశాల మైదానంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం వేరే ప్రాంతానికి మార్చాలని, అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఎస్‌ఎంసీ చైర్మన్ బాలాజీతో హైకోర్టులో రిట్ వేయగా పనులు నిలిచిపోయాయన్నారు. నిబంధనల ప్రకారం పాఠశాల మైదానంలో ఇతర శాఖల కార్యక్రమాలు, భవనాలు నిర్మించవద్దని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ కలెక్టర్ మొండిగా వ్యవహరిస్తున్నారని, రిట్‌తో హైకోర్టులో విచారణలో ఉండగానే, అదే మైదానంలో ఇంకో సర్వేనెంబర్‌లో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ పైన ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమన్నారు. జిల్లా క్రీడా శాఖాధికారితోపాటు మరికొందరు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ బాలాజీని కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే పాఠశాల ఆవరణలో డీఈఓ కార్యాలయంతోపాటు డీవైఎస్‌ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పాఠశాల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావుకు పాఠశాల భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉంటే వేరే చోట మినీ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంతకాల సేకరణలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు రంగ శ్రీశైలం, బోయిని హరికృష్ణ, ఆప్ పార్టీ నాయకుడు నాగేందర్, బీజేపీ నాయకుడు బానోతు దాస్య, కొసరి రవీంద్రనాథ్, గాజుల ప్రభాకర్, రవీందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.