నేడు బోథ్ మండల సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2020-12-07T06:19:47+05:30 IST
ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సోమవారం జరుగనుంది.

హాజరు కానున్న ఎమ్మెల్యే
నేతలకు ప్రజలు, రైతుల సమస్యలు గుర్తుండవా?
బోథ్, డిసెంబరు 6: ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సోమవారం జరుగనుంది. ఈసారి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు హాజరుకానున్నారు. అయితే, ప్రతీసారి జరిగే మండల సమావేశంలో అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ప్రజలు ఆశించిన రీతిలో చర్చించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి మాత్రం ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీలు రైతు సమస్యలను సమావేశంలో చర్చించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ యేడు అధిక వర్షాల వల్ల మండలంలోని రైతులు సాగు చేసిన పత్తి, సోయాబీన్ పంటల దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయారు. మరోవైపు పంటలకు పెట్టిన పెట్టుబడులు నిండక, చేసిన అప్పులు తీరేదారి లేక పోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఫలితంగా రైతు ఆత్మహత్యల పరంపర మళ్లీ ప్రారంభమైంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నాయకులు సభ దృష్టికి తీసు కురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతుల సమస్యలు చర్చకు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.