మరో ‘గొలుసుకట్టు’ మోసం?

ABN , First Publish Date - 2020-12-06T07:08:48+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో లక్కిలాటరీ ల స్కీంల పేరుతో ప్రజలను కొందరు మోసం చేస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మరి కొందరు గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరో ‘గొలుసుకట్టు’ మోసం?
ఉట్నూర్‌లో సంస్థ కార్యాలయం ఇదే..

జోరుగా సాగుతున్న అంతర్‌ రాష్ట్ర వ్యాపారం 

ఉమ్మడి జిల్లాలోని గిరిజన  ప్రాంతాలలో గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపిన వైనం

ఉట్నూర్‌, డిసెంబరు 2: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో లక్కిలాటరీ ల స్కీంల పేరుతో ప్రజలను కొందరు మోసం చేస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మరి కొందరు గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గిరిజనులను పావులుగా చేసుకోని సాటి అమాయక గిరిజనులపైనే వల వేసేలా గొలుసుకట్టు వ్యాపారాన్ని గత జూలై నుంచి గుట్టుచప్పుడుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇచ్చేది తక్కువే అయిన ప్రతీనెల డబ్బులు వస్తున్నాయని భ్రమించిన గిరిజను లు సభ్యులుగా చేరుతుండడంతో గిరిజన ప్రాంతాలలో కోట్లాది రూపాయల వ్యాపారానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతుంది. 

అంతర్‌రాష్ట్ర వ్యాపారం 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కొల్‌కత్తా నగరానికి చెందిన ఒక సంస్థ గుట్టు చప్పుడుగా గొలుసుకట్టు వ్యాపారానికి కొందరు గిరిజన యువకులను నియమించుకుని వ్యాపారం సాగిస్తుంది. ఉట్నూర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో ఒక భవంతిలో ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయకుండానే ముగ్గురు వ్యక్తులతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోని గిరిజన గ్రామాలలో అమాయక ప్రజలను చేర్చి వారికి ప్రతీనెల డబ్బులు ఇస్తామని ఎరచూపినట్లు తెలుస్తుంది. సభ్యులకు రూ.5 వందల విలువగల సంస్థ ఉత్పత్తులు అందిస్తామని పేర్కొంటున్నారు. సభ్యత్వం తీసుకోనే వారు ప్రతీఒక్కరు రూ.2.500 చెల్లించాల్సి ఉంటుంది. సభ్యత్వం పొందిన వారు మరో ఐదుగురు కొత్త సభ్యులను నియమించడం ద్వారా గొలుసుకట్టు వ్యాపారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.  సభ్యత్వం పొం దిన వారికి ఏడు స్థాయిల వరకు వ్యాపారాన్ని కొనసాగించి.. అప్పటి వరకు సభ్యుడికి కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పడంతో గిరిజనులు వీరి వ్యాపారాన్ని నమ్మి సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సదరు కంపెనీకి చెం దిన గిరిజనులు ఆయా గ్రామాలలో పర్యటిస్తు తాము ఈ వ్యాపారం ద్వారా కేవలం గిరిజనులనే ఆర్థికంగా అభివృద్ది చేయాలని బావించామని పేర్కొంటూ ఆయా గ్రామాలలో పటేల్‌లను కలుసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఉట్నూర్‌, ఆసిపాబాద్‌, ఇంద్రవెల్లి, కెరమెరి, గుడిహత్నూర్‌, జైనూ ర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లో సుమారు మూడు వేల మందికి సభ్యత్వం కల్పించగా రూ.2.500 వంతున గిరిజనుల వద్ద సుమారు రూ.75 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. కంపెనీ సర్వర్‌ సమస్య ఉండడం వల్ల కేవలం 1700 మందికి మాత్రమే సభ్యత్వం కల్పించి రూ.42.50 లక్షలతో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు నిర్వహకులు ఇంద్రవెల్లి మార్కగూడకు చెందిన మడావి ఆనంద్‌రావు, ఆసిఫాబాద్‌ సంజీవ్‌నగర్‌కు చెందిన ప్రభాత్‌లు తెలిపారు. జూలై నుంచి వ్యాపారం ప్రారంభించి ముందుగా సభ్యత్వం తీసుకున్న వారికి రూ.వెయ్యి వంతున ప్రతి నెల అందిస్తున్నామని తెలిపారు. కొందరు గిరిజనులకు ఇంకా డబ్బులు ప్రతీనెల రాకపోతుండడంతో ఆనోట, ఈ నోట గొలుసుకట్టు వ్యాపారం రహస్యం బహిరంగమైనట్లు తెలుస్తుంది. ఉట్నూర్‌లోని నిర్వహకులను  పోలీసులు  పిలిపించుకోని వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఉట్నూర్‌ ఎస్సై సుబ్బారావును ప్రశ్నించగా ఉన్నతాధికారులకు సమాచారం అందించి పూర్తి నివేదికలు పరిశీలిస్తున్నామని వివరించారు.

సూత్రధారులను కనుగోనాలి

: పుర్క బాపురావు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి 

గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామంటూ గొలుసుకట్టు వ్యాపారాన్ని కొనసాగిస్తున్న గిరిజనుల వెనుక అసలు సూత్రధారులను ఉన్నతాధికారులు కనుగొనాలి. గిరిజనులను పావులుగా చేసుకొని వ్యాపారం ముసుగులో డబ్బులు  పోగు చేస్తున్నవారు పారిపోయే అవకాశాలు ఉంటాయి. గిరిజన అభివృద్ది పేరుతో గ్రామాలకు వచ్చే ఐటీడీఏ యేతర అధికారులు కాని వారిని గిరిజనులు గుర్తించ వద్దని అన్నారు. 

గొలుసుకట్టు వ్యాపారం విచారణలో ఉంది

: ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ, ఉట్నూర్‌

ఉట్నూర్‌ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో నిర్వహిస్తున్న గొలుసుకట్టు వ్యాపారంపై విచారణ నిర్వహిస్తున్నాం. సంబంధిత సంస్థ ఉద్యోగులను పిలిపించి మాట్లాడుతున్నాం. కేసు విచారణ తరువాత కేసులు నమోదు చేస్తాం. 

Read more