మృత్యువులోనూ వీడని పేగుబంధం
ABN , First Publish Date - 2020-05-18T10:33:53+05:30 IST
కొడుకు చనిపోయాడని తల్లడిల్లిన ఓ తల్లి గుం డెపోటుతో కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో తల్లి, కొడుకులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

కొడుకు మృతితో ఆగిన తల్లిగుండె
కన్నెపల్లి/బెల్లంపల్లి మే 17: కొడుకు చనిపోయాడని తల్లడిల్లిన ఓ తల్లి గుం డెపోటుతో కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో తల్లి, కొడుకులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కన్నెపల్లి మండలం లోని మాడవెల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాదండి సత్యనారాయణ-రాజేశ్వరి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. చదువు మానివేసిన కొడుకు సంపత్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శనివారం వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన తాండూరు మండలం అచ్చలా పూర్‌కు చెందిన కుంచె రాంచరణ్, మరో ముగ్గురు బాలురతో కలిసి సంపత్ గ్రామం లోని పెద్దఒర్రెలో ఈత నేర్చుకుందామని వెళ్లాడు.
ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి సంపత్, రాంచరణ్ మృతిచెందారు. తన కొడుకు సంపత్ ఈతకు వెళ్లి మరణించాడనే వార్త తెలియగానే తల్లి రాజేశ్వరి(35) వాగు వద్దకు వెళ్లి కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా రోదించింది. సంపత్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలిం చారు. దీంతో ఇంటి వద్దనే తల్లి రాజేశ్వరి శనివారం మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా కనీసం నీళ్లు అయినా తాగకుండా రోదిస్తూ ఉండిపోయింది. దీంతో నిరసంగా ఉండి శనివారం రాత్రి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. రాత్రి 11.30 గం ట ల సమయంలో బెల్లంపల్లిలోని ఆస్పత్రికి బంధువులు తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. ఆదివారం కొడుకు సంపత్, తల్లి రాజేశ్వరి మృతదేహా లకు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తల్లీకొడుకులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే రోజు కొడుకు, భార్యను కోల్పోయిన సత్యనారాయణ, ఆయన కూతురు(10) షాక్‌లోకి వెళ్లారు.