ఎల్‌ఆర్‌ఎస్‌కు దళారుల బెడద

ABN , First Publish Date - 2020-09-17T10:27:50+05:30 IST

అనధికార లే అవుట్లు, వ్యక్తిగత పాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్

ఎల్‌ఆర్‌ఎస్‌కు దళారుల బెడద

దరఖాస్తు చేసేందుకు అదనంగా వసూళ్లు

ఆన్‌లైన్‌ సెంటర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పేరుతో ప్రచారం

ఫీజు కింద రూ. 6 వేల దాక వసూలు


మంచిర్యాల, సెప్టెంబరు 16: అనధికార లే అవుట్లు, వ్యక్తిగత పాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)ను ప్రవేశపెట్టింది. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం యజమానులు ఆన్‌లైన్‌ విధానంలో నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్లాటుకు రూ. 1000, వెంచర్‌ అయితే రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా జూటట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి. జీుఽ  అనే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 26 ఆగస్టు 2020 లోపు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ అయిన భూముల యజమానులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా అక్టోబర్‌ 15 లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానం తెరపైకి వచ్చే సరికి దళారి వ్యవస్థ రూపుదిద్దుకుంది. దీనిపై అవగాహనలేని వారిని టార్గెట్‌ చేస్తూ అందిన కాడికి దండుకొనేందుకు ప్రత్యేక వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఆన్‌లైన్‌ సెంటర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పేరుతో వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకొనేప్రయత్నం చేస్తున్నారు. తమను ఆశ్రయించిన వారి నుంచి ఫీజుల పేరుతో వేలకు వేలు గుంజుతూ అమాయకులను దోపిడీ చేస్తున్నారు. 


అడ్డగోలు వసూళ్లు..

ఆన్‌లైన్‌లో భూముల క్రమబద్ధీకరణ కోసం తమ వద్దకు వచ్చే వారి నుంచి దళారులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత ప్లాటు ఉన్న యజమానులు ధరఖాస్తు సమయంలో కేవలం రూ. 1000 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఆన్‌లైన్‌లో యజమాని వివరాలు నమోదు చేసే పేరుతో అదనంగా మరో రూ. 6 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే వెంచర్ల యజమానులైతే నిర్ణీత రుసుం రూ. 10వేలతో పాటు మరో రూ. 10వేల వరకు ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపుతుండగా, మరోవైపు దళారులు అందిన కాడికి దండుకుంటూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తు ఇలా..

భూముల క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా సులువు. స్మార్ట్‌ ఫోన్‌పై అవగాహన కలిగి ఉన్నవారు ఇంట్లో కూర్చొని 15 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూముల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమో లేదా నేరుగా గూగుల్‌ల్లోకి వెళ్లి వెబ్‌సైట్‌ అడ్రస్‌ టైప్‌ చేస్తే దరఖాస్తు ఫాం ఓపెన్‌ అవుతుంది. వెబ్‌సైట్‌ టైప్‌ చేయగానే ముందుగా అప్ల ఫర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ 2020 అని అడుగుతుంది. ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌ టైప్‌ చేయగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే దరఖాస్తు ఫాం ఓపెన్‌ అవుతుంది. అందులో వ్యక్తిగత ప్లాట్‌, లే అవుట్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో సరిపోయే దానిపై క్లిక్‌ చేయాలి. అప్పుడు ప్లాటు ఉన్న ఏరియా మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, గ్రామ పంచాయితీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకదానిని ఎంచుకోవాలి. తరువాత జిల్లా పేరు, మున్సిపాలిటీ పేరు, మండలం పేరు, వార్డు నెంబర్‌లు వరుసగా ఒకదాని తరువాత ఒకటి అడుగుతుంది.


సరియైన దానిపై క్లిక్‌  చేయాలి. అనంతరం ప్లాట్‌ డిటెయిల్స్‌ అడుగుతుంది. లొకాలిటీ, ప్లాట్‌ నెంబర్‌, సర్వే నెంబర్‌, విలేజ్‌ పేరు, ప్లాటు విస్తీర్ణం, సేల్‌ డీడ్‌ నంబర్‌, సంవత్సరం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ప్రాంతం వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్లాట్‌ డాక్యుమెంట్‌ అప్లోడ్‌ చేయాలి (ఇందు కోసం సేల్‌డీడ్‌ యొక్క మొదటి పేజీని 1ఎండీ సైజు మించకుండా సిద్దంగా ఉంచుకోవాలి).ఆ తరువాత దరఖాస్తుదారుని వివరాలు అడుగుతుంది. దరఖాస్తుదారుని పేరు, తండ్రి లేక జీవిత భాగస్వామి పేరు, ఆధార్‌నంబర్‌, జెండర్‌ (ఆడ, మగ), ఇంటి నెంబర్‌, వీధి పేరు, ప్రాంతం పేరు, గ్రామం, పట్టణం, నగరం వివరాలు, జిల్లా పేరు, పిన్‌కోడ్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ, దరఖాస్తుదారుని మరో సెల్‌నంబర్‌ వరుసగా నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తు ఫీజు కోసం ఫాం కింది భాగంలో ఉన్న ఆప్షన్లను ఎంచుకోవాలి. అకౌంట్‌ ఉన్న బ్యాంకు నుంచి దరఖాస్తు ఫీజు నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించే విధానంపై ప్రభుత్వం ఇంకా విధివిధానాలు రూపొందించనందున మొదట దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. 


దళారులను ఆశ్రయించ వద్దు..స్వరూపారాణి, మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ప్రజలు దళారులను ఆశ్రయించి మోసాలకు గురి కావద్దు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా దరఖాస్తు చేయడం అత్యంత సులువైన పని. మొబైల్‌ వినియోగం తెలియని వారు దానిపై అవగాహన ఉన్న వారిని సంప్రదింంచి దరఖాస్తు చేసుకుంటే సరిపో తుంది. మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించినా సహకారం అందిస్తాం. ఆన్‌లైన్‌ దరఖాస్తుల పేరుతో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.  

Updated Date - 2020-09-17T10:27:50+05:30 IST