చెన్నూరుకు కాళేశ్వరం నీళ్లు
ABN , First Publish Date - 2020-07-08T10:32:46+05:30 IST
చెన్నూరు నియోజకవర్గం రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కాళేశ్వరం జలాలతో ఆ ప్రాంత ఆయక ట్టుకు రెండు పంటలకు ..

కొనసాగుతున్న సర్వే పనులు
నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగు నీరు
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల): చెన్నూరు నియోజకవర్గం రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కాళేశ్వరం జలాలతో ఆ ప్రాంత ఆయక ట్టుకు రెండు పంటలకు సాగునీరు అందనున్నది. మూడు లిఫ్టులతో చేపట్టే ఎత్తిపోతల ద్వారా 1.31 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా సర్వే పనులు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో మూడు లిఫ్టుల ఏర్పాటుకు సర్వే పనులు చురు గ్గా కొనసాగుతున్నాయి. గోదావరి జలాలు తమ పంట పొలాలకు చేరుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని అన్నదాతలు సంబరపడి పోతున్నారు.
సీఎం గ్రీన్‌సిగ్నల్‌తో..
కాళేశ్వరం ప్రాజెక్టు తదుపరి పనులపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి సాగు నీరు అందించేందుకు మూడు లిఫ్టుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సర్వే పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 1.31 లక్షల ఎకరాలకు సాగు నీరందిచే లక్ష్యంగా సర్వే చేపడు తున్నారు. పంప్‌హౌజ్‌లు, కాలవలు, డిస్టిబ్యూటరీ, 3 లిఫ్ట్‌ల నిర్మాణానికి సర్వే కోసం ఇరిగేషన్ శాఖ రూ. 6.88 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, బ్యారేజీల వద్ద మూడు లిఫ్ట్‌లు నిర్మించి నీరు తరలించే విధంగా డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభించి సత్వరం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రజాప్రతినిఽధులు, అధికారులున్నారు.
పారేది ఇలా...
చెన్నూరు నియోజకవర్గానికి కాళేశ్వరం నీటిని 3 లిఫ్ట్‌ల ద్వారా 1,31,257 ఎకరాలకు నీరందించే విధంగా సర్వే చేపట్టారు. మొదటి లిఫ్ట్‌ను సుందిళ్ల బ్యారేజీ వద్ద నిర్మిస్తారు. ఈ లిఫ్టు ద్వారా 65,895 ఎకరాలకు నీరు అం దిస్తారు. అన్నారం బ్యారేజీ వద్ద రెండో లిఫ్ట్ ద్వారా 38,175 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మూడో లిఫ్టు ద్వారా 27,187 ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
రెండు పంటలకు సాగునీరు..
గోదావరి, ప్రాణహిత నదులు చెన్నూరు నియోజక వర్గానికి ఆనుకొని ప్రవహిస్తున్నప్పటికి సరైన ప్రాజక్టులు లేక నీరంతా వృథా అవుతోంది. చుట్టు నీరు పుష్కలంగా ఉన్నప్పటికి వందల ఎకరాలు బీళ్లుగానే ఉంటున్నాయి. నీరున్న చోట ఒకే ఒక వానాకాలం పంట మాత్రమే తీస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ సాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అధి కారులతో చర్చించి బీడు భూములను సాగులోకి తేవాలని సంకల్పించారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి కాళేశ్వరం నీరు చెన్నూరు నియోజకవర్గానికి తరలింపుపై అనుమతి పొందారు.
సర్వే కోసం నిధులు కేటాయిం చడంతో పనులు వేగంగా నడుస్తున్నాయి. నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు నీరు తరలించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఐదు మండలాల్లోని 102 గ్రామ పంచాయతీల్లోని 367 చెరువులను గొలుసు కట్టుగా నింపనున్నారు. కాళేశ్వరం నీటితో 1.31 లక్షల ఆయకట్టుకు సాగు నీరందించడం లక్ష్యంగా పనులు చేస్తున్నారు. లిఫ్టులు నిరంతరం పనిచేసే విధంగా చూస్తుండటంతో చెరువుల్లో ఏడాదంతా నీరు నిల్వ ఉం డనుంది. దీంతో ఇన్నాళ్లు ఒకే పంటతో సరిపెట్టుకున్న రైతులు రెండు పంటలు పండించుకునే వీలు కలుగుతుంది.