రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-12-11T05:30:00+05:30 IST

రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం

రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌

అధికార, ప్రతిపక్ష జడ్పీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పీఆర్‌ నిధులు మళ్లింపుపై దుమారం

ఆలస్యంగా హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 11: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలు చర్చించడంతో పాటు ప్రజలకు అందుతున్న విధా నం, అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్చించి అర్హులైన వారికి అందించేలా చర్యలు తీసుకునే విధంగా నిర్వహించాల్సిన  జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ముందుగా జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలపై ఆరా తీశారు. అయితే ఎప్పటిలాగే సమావేశం సాఫీగా జరుగుతుందనుకున్న క్రమంలో కొందరు సభ్యులు అధికార పార్టీ చేస్తున్న పనులతో పాటు అధికారుల తీరును సభాదృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే నిధుల మళ్లింపుపై ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అభివృద్ధికి రూ.20లక్షలు పంచాయతీరాజ్‌ నిధులు ఏ విధంగా కేటాయిస్తారని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి జడ్పీ చైర్మన్‌ను ప్రశ్నించారు. దీంతో సర్వసభ్య సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. సభ్యులు అధికారులను పలు ప్రశ్నలను అడుగుతూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతునే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ క్రమంలోనే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం రాక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి మరోసారి పంచాయతీరాజ్‌పై అధికారులు ప్రగతి నివేదికలు చదువుతున్న సమయంలో జడ్పీ నిధులు ఎమ్మెల్యే క్వార్టర్‌కు కేటాయించే విషయమై లేవనెత్తారు. నియమ నిబంధనలకు లోబడి నిధులను ఎమ్మెల్యే క్వార్టర్‌ పనులకు కేటాయించారన్నారు. అందుకు ఆ నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు సైతం ఉందని జడ్పీ చైర్మన్‌ సమాధానమిచ్చారు. ఈ సమయంలో జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డికి, మిగిలిన అధికార పార్టీ సభ్యులతో పాటు జడ్పీ చైర్మన్‌కు మధ్య మాటల యుద్ధం పెరిగింది. దీంతో ఒకరినొకరు సభలో పోటాపోటీగా దూషణలు చేసుకున్నారు. గోకగణేష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ల మధ్య తీవ్ర తిట్ల పురాణం మొదలైంది. దీంతో నిధుల మళ్లింపుపై ఆవేశానికి లోనైనా జడ్పీటీసీ ఆగ్రహంతో జడ్పీ చైర్మన్‌తో పాటు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ల అంతు చూస్తానని ఘాటుగా వ్యాఖ్యా నించారు. దీంతో సభలో ఒక్క సారిగా గందరగోళం నెలకొంది. అధికార పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆగ్రహానికి లోనై అమర్యాదగా ప్రవర్తిస్తూ జడ్పీ చైర్మన్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించిన జడ్పీటీసీ గణేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

జడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్‌ చేసిన చైర్మన్‌..

ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణానికి పంచాయతీరాజ్‌ నిధులు రూ.20 లక్షలు మళ్లింపుపై ప్రశ్నించడంతో పాటు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ల తీరును ఖండిస్తూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్‌ తెలిపారు. అయితే నిధుల మళ్లింపుపై జడ్పీ చైర్మన్‌ ఇష్టారీతిన వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని జడ్పీటీసీ గణేష్‌రెడ్డి ప్రశ్నించారు. అర్బన్‌లో పంచాయతీరాజ్‌ నిధులు ఖర్చు పెట్టడం పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు.  

సమావేశం వాకౌట్‌..

పంచాయతీరాజ్‌ నిధులు గ్రామాల అభివృద్ధికి, రోడ్డు, మంచినీరు, ఇతరాత్ర అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులను పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా అర్బన్‌ ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు కేటాయించడంపై ప్రశ్నించిన జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు ఖండించారు.

సమావేశం వాయిదా..

 జడ్పీ చైర్మన్‌, తలమడుగు జడ్పీటీసీల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అప్పటికే పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, మిషన్‌ భగీరథ పనులపై చర్చించిన సభలో జడ్పీ నిధులు ఎమ్మెల్యే క్వార్టర్‌ అభివృద్ధికి మళ్లిం చడంపై ఆందోళనకు దారి తీయడంతో అధికార పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేల కోరిక మేరకు మిగతా అంశాలపై చర్చించకుండానే సభను వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ ప్రకటించారు.

Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST