అంగరంగ వైభవంగా రథోత్సవం
ABN , First Publish Date - 2020-12-06T06:54:52+05:30 IST
మండల కేంద్రమైన జైనథ్‌లోని శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల చివరిరోజు శనివారం శ్రీమన్నారాయనుడు పెద్ద రథంపై మేళతాలాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.

జైనథ్‌లో ఘనంగా ముగిసిన శ్రీలక్ష్మినారాయణస్వామి బ్రహ్మోత్సవాలు
హాజరైన ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న
రాష్ట్ర నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చిన భక్తులు
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
జైనథ్, డిసెంబరు 5: మండల కేంద్రమైన జైనథ్‌లోని శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల చివరిరోజు శనివారం శ్రీమన్నారాయనుడు పెద్ద రథంపై మేళతాలాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. స్వామివారిని పట్టు వస్ర్తాలు, వెండి ఆభరణాలతో అలంకరించి ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించి పెద్దరథంపై ప్రతిష్ఠించారు. రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కుల ను తీర్చుకున్నారు. అంతకుమందు మహిళలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావుతో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీటీసీ అరుందతి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ఎం.గోవర్ధన్, ఆయా గ్రామాల భక్తులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.