జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుకు మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2020-12-21T03:39:20+05:30 IST
సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ వద్ద నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు పదిహేను ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు.

-15 ఏళ్లయినా పూర్తి కాని వైనం
-నిధుల లేమితో ముందుకు సాగని పనులు
-పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
కాగజ్‌నగర్, డిసెంబరు20: సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ వద్ద నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు పదిహేను ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు. దీంతో ఈ ప్రాంత రైతులు సాగు నీటిపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలై పోతున్నాయి. వర్షం నీరును నిల్వ చేసుకోలేక వచ్చిన నీరు వచ్చినట్టే వాగులోకి పంపిం చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లోని 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిం చేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.125 కోట్ల వ్యయంతో జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు చేసి తొలుత ఈ పనులు చేప ట్టేందుకు గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్ పనులు దక్కించుకోగా పనులు నత్తనడకన సాగాయి. ఒప్పం దం ప్రకారం రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా అతీగతీ లేకపోవడంతో నిర్మాణ గడువును పెంచారు. అయితే నిధులు పూర్తి స్థాయిలో కేటాయించకపోవడంతో నాలుగేళ్ల పాటు ప్రాజెక్టు నిర్మాణం పిల్లర్ల దశ దాటలేదు. దీంతో మళ్లీ ప్రత్యా మ్నాయంగా సబ్ కాంట్రాక్టర్‌తో పనులు చేయించినా ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. పనుల తాలూకు బిల్లుల చెల్లింపు వివాదాస్పదం కావడంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది.
పెరిగిన ప్రాజెక్టు వ్యయం
అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యే కోనప్ప తీసుకెళ్లారు. వ్యయ భారం పెరగడంతో ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభుత్వం ఏకంగా రూ.246.49 కోట్లకు పెంచేసింది. ఈ పనులు చేపట్టేందుకు మళ్లీ ప్రక్రియ ప్రారంభం చేశారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు పిల్లర్ల స్థాయి దాటి గేట్ల నిర్మాణం వరకు వచ్చింది. పదిహేనేళ్లు గడిచినా ఇంతవరకు ప్రాజెక్టు నిర్మాణం, కాల్వలు పరిస్థితి పూర్తి కాక తంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది.
వృథాగా పోతున్న వరదనీరు
ఏటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షం నీరు నిల్వ చేసుకోలేని దైన్య స్థితి నెలకొంది. ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే ప్రధాన ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి అయితే తమ ప్రాంతం సస్య శ్యామలం అవుతుందని రైతులు పెట్టుకున్న ఆశలు ఎండమావిగా మారాయి. దీంతో అన్నదాతలు వరణుడిపైనే ఆధారపడాల్సిన దైన్యస్థితి ఏర్పడింది. ఏ ప్రాజెక్టు నిర్మాణం అయినా ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు మారడం, ఈ ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులు సరిగ్గా కేటాయింపులు చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
-అంబాల ఓదెలు, కాగజ్‌నగర్
సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాజెక్టుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కుమరం భీం ప్రాజెక్టు కాల్వ పనులు చేస్తూనే ఉన్నారు. ఇక జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు కాల్వల పరిస్థితి అంతే ఉంది. ఏటా సాగుకు దేవుడిపై భారం వేసి కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పనులు వేగవంతం చేస్తేనే రైతులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలి.
ఎదురుచూపులు తప్పడం లేదు
-రమణారావు, కాగజ్‌నగర్
నియోజకవర్గంలో సాగుకు పూర్తిగా వర్షాధార పంటలపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా ఐదేళ్ల గడువు చాలు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి ఏకంగా 15 సంవత్సరాలు దాటింది. ఇంకా నిర్మాణం పూర్తి కావడం లేదు. అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.