అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?

ABN , First Publish Date - 2020-12-14T04:04:58+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ప్రహరీ చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
మున్సిపాలిటీ ప్రహరీ పక్కన చేపడుతున్న గదుల నిర్మాణం

-మున్సిపల్‌ కార్యాలయం ప్రహరీని ఆనుకొని నిర్మాణాలు

-హరితహారం కోసం ఏర్పాటు చేసిన కంచె తొలగింపు 

-కాగజ్‌నగర్‌లో చోద్యం చూస్తున్న అధికారులు

కాగజ్‌నగర్‌, డిసెంబరు13: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ప్రహరీ చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. గతంలో ఇక్కడ చేపట్టిన అక్రమ నిర్మాణాలను మూడు నెలల క్రితం అధికారులు   కూల్చేసి హరితహారం కింద మొక్కలు నాటారు. అయితే ప్రస్తుతం మళ్లీ అదే ప్రాంతంలో  అక్రమ నిర్మాణాలు వెలియడం చర్చనీయాంశంగా మారింది. ఈప్రాంతంలోనే రూ.4కోట్లతో మడిగెల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. నిధులు వస్తే త్వరితగతిన 120 మడిగెలు నిర్మించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ కొంత మంది చిరు వ్యాపారులు గతంలో కూల్చిన స్థలంలోనే మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాలు మేరకు మున్సిపల్‌ అధికారులు బోర్డు పెట్టారు. మున్సిపల్‌ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. 


అంతా అనాలోచితమే

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ప్రహరీ చుట్టూ చిరు వ్యాపారులు యఽథేచ్ఛగా దుకాణాలు నిర్మిస్తున్నారు. 2014లో మున్సిపల్‌ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోనే మడిగెలు నిర్మించేందుకు ప్రతిపా దనలు పూర్తి చేశారు. వరంగల్‌ నుంచి ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ అధికారులతో డిజైన్‌ కూడా చేయిం చారు. నూతనంగా ఏర్పడిన పాలక వర్గం కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. మున్సిపల్‌ ప్రహరీ చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను మూడు నెలల క్రితం తొలగించారు. మళ్లీ ఆక్రమణలు జరుగుతాయన్న ఉద్దేశ్యంతో ఏకంగా మొక్కలను నాటి జాలీలు కూడా చుట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ బస్టాండు సమీపంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయనుండడంతో ఆర్టీసీ గోడకు ఆనుకొని ఉన్న చిరు దుకాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మున్సిపల్‌ కార్యాలయ ప్రహరీ చుట్టూ తాత్కా లికంగా పలువురు చిరు వ్యాపారులు నిర్మాణాలు చేపట్టారు. మున్సిపాలిటీ ఏరియాలో బస్టాండు ప్రాంతంలోని దుకాణాల కంటే అదనంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడం పట్టణంలో చర్చనీయాం శమైంది. ఈ ప్రాంతంలో మడిగిల నిర్మాణం చేపడితే మళ్లీ తాత్కాలిక దుకాణాలను తొలగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అక్రమ నిర్మాణాల విష యంలో అధికారులు ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు పట్టణవాసులు ప్రశ్ని స్తున్నారు. 


ఆక్రమణల స్థలంలో మడిగెల నిర్మాణానికి ప్రతిపాదన

పక్షం రోజుల క్రితం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించడంతో అక్రమ నిర్మాణాల విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ చౌరస్తా సమీపంలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది. ఈస్థలంలోనే అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో మళ్లీ ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి ఈవిషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. అయితే రానున్న రోజుల్లో మడిగిలు నిర్మిస్తే చిరువ్యాపారులు ఖర్చు చేసి చేపడుతున్న నిర్మాణాలు పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.  ఇప్పటికైనా అధికారులు స్పందించాలని పలువురు పట్టణవాసులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోర్డు ఏర్పాటు

-శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయ ప్రహరీ  చుట్టూ చిరు వ్యాపారులు నిర్మాణాలు చేపడు తున్నారు. మడిగెల నిర్మాణం కోసం రూ.4 కోట్లతో 120 గదుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఈ గదులు నిర్మాణం తాత్కాలికమే. ఈ విషయాన్ని   చిరు వ్యాపారులకు  తెలిపాం. ఇందుకు సంబంధించిన బోర్డును కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశాం.

Updated Date - 2020-12-14T04:04:58+05:30 IST