పశువులకు ఐడీ ట్యాగ్‌

ABN , First Publish Date - 2020-03-02T12:33:20+05:30 IST

పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పలు సందర్భాల్లో నష్టపోతున్నారు. వ్యాధులు సోకి పశువులు మృత్యువాత పడుతుండడంతో పశు సంపద తగ్గి పోతోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పశువులకు ఐడీ ట్యాగ్‌

  • ఆన్‌లైన్‌లో సమగ్ర సమాచారం
  • యజమాని వివరాలు, ఆధార్‌ నమోదు
  • జిల్లాలో గత నెల 1నుంచి ప్రారంభమైన ప్రక్రియ 

కలెక్టరేట్‌: పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పలు సందర్భాల్లో నష్టపోతున్నారు. వ్యాధులు సోకి పశువులు మృత్యువాత పడుతుండడంతో పశు సంపద తగ్గి పోతోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాటికి ఆరోగ్య భద్రత కల్పించి, గాలికుంటు రహిత దేశంగా చేసి పశు సంపద పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో   జిల్లాలో పశువుల చెవికి ట్యాగ్‌ చేసి వాటి సమస్త సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈప్రక్రియ గత నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో ప్రారంభమైంది. దీనితో పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. ఈకార్యక్రమం మార్చి 6 వరకు కొనసాగనుంది. 


చిన్నారులకు, గర్భిణులకు ఇచ్చే ఆరోగ్య కార్డుల మాదిరి ప్రతి పశువుకు ఆరోగ్య కార్డులను జారీ చేస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువు చెవికి ట్యాగ్‌ వేస్తారు. ట్యాగ్‌ నెంబరును యజమాని ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తారు. ప్రతి మూడు నెలలు నిండిన పశువులకు ట్యాగ్‌ సంఖ్యపై ఆరోగ్య కార్డు జారీ చేస్తున్నారు. జీవాల వయస్సు, వ్యాధులు, చికిత్సల వివరాలను వెను వెంటనే కార్డులలో నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని ట్యాగ్‌ నెంబరుతో ఐఎస్‌ఏపీహెచ్‌ పోర్టల్‌లో పొందుపరుస్తారు. దీంతో యజమానుల వివరాలు సైతం ఆన్‌లైన్‌లో నమోద వుతాయి. ఈ పద్ధతిలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం ఆవులు, గేదెలు, ఎద్దులకు మాత్రమే ఆరోగ్య కార్డులు జారీ చేసి టీకాలు వేస్తున్నారు. 


జిల్లాలోని పశుసంపద


జిల్లాలో పశుగణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం ఆవులు 2,93,845, గేదెలు 46,374, గొర్రెలు 1,59,349, మేకలు 2,56,854, పందులు 507, కుక్కలు 907, బాతులు 412, కోళ్లు ఇతరాత్ర పక్షులు 4,40,257 ఉన్నట్లు తేల్చారు. అయితే వీటిలో ఆవులు గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు ప్రభుత్వం ట్యాగ్‌లు వేయనుంది.


ట్యాగింగ్‌ ఇలా..


సిబ్బంది నేరుగా రైతు ఇంటికే వెళ్లి వివరాలను సేకరిస్తారు.  ముందుగా ట్యాగ్‌పైన ఉన్న బార్‌కోడ్‌ను ట్యాబ్‌లో స్కాన్‌ చేస్తారు. ట్యాగ్‌ను పశువు చెవికి తగిలిస్తారు. ఆ తరువాత పశువు వివరాలను ప్రత్యేకమైన యాప్‌లో నమోదు చేస్తారు. యజమాని వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. గ్రామం, యజమాని పేరు, అతడి ఆధార్‌ నంబరు, మొబైల్‌ నంబర్లను నమోదు చేస్తారు. ఆ తరువాత పశువుల ఆరోగ్య వివరాలను కూడా ఆప్‌లోడ్‌ చేస్తారు. 


పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత


జిల్లాలో మొత్తం 19 పశువుల  ఆసుపత్రులు, ఏడు సబ్‌ సెంటర్లు, రెండు ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు ఉన్నాయి. మండల స్థాయిలో ఉండే 19 ఆసుపత్రులలో 9 ఆసుపత్రుల్లో మాత్రమే పశువైద్యాధికారులు అందుబాటులో ఉన్నారు. మిగతా 10 ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా  అలాగే ఏడు సబ్‌ సెంటర్లలో మూడింటిలో మాత్రమే కంపౌండర్‌లు ఉన్నారు. ఇక్కడ అటెండర్లే వైద్య సేవలందిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో రెండు సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక టైపిస్టు, రెండు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా డీవీహెచ్‌ఓ( జిల్లా వెటర్నరీ హెల్త్‌ ఆఫీసర్‌) పోస్టు మంజూరు కాక పోవడంతో ఏఓతోనే ఆ పోస్టును నిర్వహిస్తున్నారు. 


జిల్లాలో ఇప్పటి వరకు పది వేల పశువులకు ట్యాగ్‌లు వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 36 వేల ట్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని విడతల వారీగా పశువులకు వేయనున్నట్లు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరత కారణంగానే సకాలంలో ట్యాగ్‌లు వేయలేక ఆలస్యం జరుగుతోందని వారు చెబుతున్నారు. జిల్లాలో మొత్త పశువులకు ట్యాగ్‌లు వేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగు తుందన్నారు. 


పశువులకు వచ్చే పలు రోగాలను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీటిలో జిల్లా రాష్ట్రంలో 70 శాతంతో అగ్రస్థానంలో నిలిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి 24 వరకు 70 శాతం పశువులకు టీకాలు పూర్తి చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అధికారులు చెబుతున్నారు. 


ట్యాగ్‌ తప్పకుండా వేయించాలి 


-రమేష్‌, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి


ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మంలో పశు పోషకులకు ప్రయో జనం చేకూరనుంది. ప్రతి ఒక్కరు సహకరించి తమ పశువుల వివ రాలు అందించి ట్యాగ్‌ తప్పకుండా వేయించుకోవాలి. నిర్లక్ష్యం చేయ కుండా ఆవులు, గేదెలు, ఎద్దులకు గాలికుంటు నివారణ మందులు వేయించాలి. నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా పశువులను పశు వైద్య కేంద్రాలకు తీసుకువచ్చి చికిత్సలు చేయించాలి. 

Updated Date - 2020-03-02T12:33:20+05:30 IST