అగమ్యగోచరం

ABN , First Publish Date - 2020-04-26T09:48:03+05:30 IST

ఉపాధి కోసం.. ఎడారిబాట పట్టిన తెలంగాణ ప్రవాసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

అగమ్యగోచరం

ఉపాధి పాయే.. ఉపవాసం మిగిలే!

కరోనాతో ఎడారి దేశాల్లో ఆగమాగం

బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న తెలంగాణ ప్రవాసులు 

ఇరుకు గదుల్లో తప్పని ఇబ్బందులు 

ఇండియాకు తీసుకెళ్లాలంటూ ఆవేదన 

గల్ఫ్‌ దేశాల్లో ఉమ్మడిజిల్లాకు చెందిన వేలాది మంది నరకయాతన


( ఆంధ్రజ్యోతి, నిర్మల్‌): ఉపాధి కోసం.. ఎడారిబాట పట్టిన తెలంగాణ ప్రవాసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఉన్నది అమ్ముకొని.. అప్పులు చేసి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళితే.. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నా రు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వేలాది మంది గల్ఫ్‌ బాట పట్టారు. సుమారు 20 సంవత్సరాలుగా వివిధ ఉద్యోగాల పేరుతో గల్ఫ్‌ దేశాల్లో స్థిరపడిన వారు ఎందరో ఉండగా.. మోజుతో వెళ్లిన వారు కొందరు, టూరిస్టు వీసాతో వెళ్లి దొంగచాటు ఉపాధి పొందుతున్న వారు ఇలా.. అనేక మంది ఉన్నారు. దుబాయ్‌, షార్జా, మస్కట్‌, బెహరాన్‌, సౌది, కువైట్‌ వంటి ఎడారి దేశాలకు వెళ్లిన వారుఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 


కరోనాతో తీవ్ర ఇబ్బందులు

గల్ఫ్‌ దేశాల్లోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం తీవ్రస్థాయికి చేరడంతో ప్రవాస తెలంగాణ వాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. నిర్మల్‌ జిల్లాకు చెందిన నవీన్‌ అనే యువకుడు ఎడారి దేశాల్లో తాము అనుభవిస్తున్న భాధలను ఫోన్‌ ద్వారా తెలిపాడు.  తమతో పాటు కేరళ రాష్ర్టానికి చెందిన అనేక మంది  ఇక్కడే ఉన్నారని చెప్పారు. తమతో పాటు ఉంటున్న వారి లో కొందరికి కరోనా సోకిందని వారు వాపోయాడు. అయినప్పటికీ వారితో కలిసి ఉండని పరిస్థితి నెలకొందని.. దీంతో తమను తాము రక్షించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తాము గత మూడు రోజులుగా ఇండియన్‌ ఎంబసీ అధికారులను కలిసి విన్నవించగా.. కరోనా సోకిన వారిని తమ నుంచి వేరుచేసి వేరే గదుల్లో ఉంచుతున్నారని తెలిపారు. 


ఇరుకు గదుల్లో తీవ్ర ఇబ్బందులు

కరోనా ప్రభావంతో గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న తమను అక్కడి యజమానులు ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆవేదన చెందుతున్నారు. 70 శాతం దాక కార్మికులను గల్ఫ్‌ యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు తమకు ఇచ్చిన నివాసాలను కూడా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అలాగే ఉద్యోగాలను తొలగించడంతో ఎక్కడో ఒకచోట తలదాచుకునే పరిస్థితి తలెత్తిందని, తాము ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క రూంలో పది నుంచి ఇరవై మంది వరకు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో తాము అనేక బాధలు పడుతున్నామన్నారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులను తాము వేడుకోగా.. అప్పుడప్పుడు భోజనం పంపుతున్నారని తెలిపారు. ఇది కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని, పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 


‘ఇండియాకు తీసుకెళ్లండి’ 

కరోనా వ్యాప్తి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను తిరిగి భారతదేశానికి తీసుకు వెళ్లాల ని పలువురు ప్రవాస తెలంగాణ వాసులు కోరుతున్నారు. ఎన్నో ఆశల తో ఉపాధి కోసం గల్ఫ్‌ దేశానికి వస్తే.. ఒక వైపు కరోనా కాటు, మరోవైపు ఉద్యోగం పోగొట్టుకొని నరక యాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో తెలంగాణ ప్రభుత్వం కలగజేసుకొని తమను తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఉపాధి పోయినా.. తమను  తమ కుటుంబాలకు అప్పగించాలంటూ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు. తెలంగా ణ ప్రవాస మంత్రిత్వ శాఖ మంత్రి కేటీఆర్‌ కలగజేసుకొని తమకు దారి చూపాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2020-04-26T09:48:03+05:30 IST