పంట నిల్వ ఎలా?

ABN , First Publish Date - 2020-05-10T11:16:06+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఖరీఫ్‌, రబీసీజన్‌లలో సాగవుతున్న పంటలను నిల్వ చేయడం

పంట నిల్వ ఎలా?

అధికారులకు సవాలుగా మారుతున్న గోదాంల కొరత 

ప్రత్యామ్నాయం కానరాక గందరగోళంలో యంత్రాంగం 

గత్యంతరం లేక ధర్మాబాద్‌, మేడ్చల్‌ గోదాంలకు పంటల తరలింపు 

తడిసి మోపెడవుతున్న రవాణా నిల్వల వ్యయ భారం 

కొత్తగా మూడు గోదాంల మంజూరుతో చిగురిస్తున్న ఆశలు 


నిర్మల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి)  : నిర్మల్‌ జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఖరీఫ్‌, రబీసీజన్‌లలో సాగవుతున్న పంటలను నిల్వ చేయడం సంబంధిత యంత్రాంగానికి కత్తిమీద సాములా మారుతోంది. ప్రతియేటా దిగుబడులు ఆశించిన దాని కన్నా రెట్టింపుగా వస్తుండడంతో ఆ పంటలను నిల్వచేయడం యంత్రాంగానికి సవాలుగా మారుతోంది. ప్రభుత్వం పంటల కు మద్దతుధర ప్రకటిస్తుండడమే కాకుండా రైతుల డిమాండ్‌ మేరకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభిస్తోంది. దీంతో రైతులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పండించిన పంటలను దళారులకు విక్రయించకుండా సర్కారు కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు. అయితే వరిధాన్యం, మొక్కజొన్న పంటను నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి దిగుబడులు సాధిస్తుండడంతో కొనుగోలు ప్రక్రియరద్దీగా మారుతోంది.


సర్కారు కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ పంటలను పెద్ద మొత్తంలో తీసుకువస్తుండడంతో కొనుగోలు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. అయితే అధికారులు కొనుగోలు చేసిన పంటను సమీప గోదాముల్లో నిల్వచేయాల్సి ఉంటుంది. అయితే గోదాంలు పంటనిల్వల సామర్థ్యానికి తగ్గట్టుగా లేకపోవడం ప్రస్తుతం ప్రఽధాన సమస్యగా మారింది. గోదాంలు సరియైున సంఖ్యలో లేని కారణంగా అధికారులు ప్రైవేటు పంక్షన్‌హాల్‌లలో, అక్కడి గ్రామాల్లోని పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లోనూ భద్రపరుస్తున్నారు. దీంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్య తీవ్రమవ్వడంతో అధికారులు పొరుగు రాష్ట్రమైన మహరాష్ట్రలోని ధర్మాబాద్‌లో అలాగే మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లోని ఖాళీగోదాంలను కూడా ఇక్కడి పంటల నిల్వల కోసం అన్వేషిస్తున్నారు. ఇది చిలికి చిలికి గాలివాన లాగా గోదాంల సమస్య జిల్లాలో కీలకంగా మారింది.


ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు అన్ని రకాల ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఎట్టకేలకు సమస్య తీవ్రతను గుర్తించి జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు భారీ గోదాంలను మంజూరు చేసింది. ఒక్కో గోదాం 20 ఎకరాల స్థలంలో నిర్మించబోనున్నారు. దీనికి సంబంధించి అనుమతులు కూడా జారీ అయ్యాయి. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని అలూర్‌లోనూ, ఖానాపూర్‌ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌, భైంసా మండలంలోని మహగాంలలో ఈ భారీగోదాంలను నిర్మించబోతున్నారు. నిర్మల్‌ జిల్లా పంటల కొనుగోలు, సాగులక్ష్యం, దిగుబడులను అంచనా వేస్తున్న అధికారులు లక్ష మెట్రిక్‌ టన్నుల కేపాసిటీ గల గోదాంలు అదనంగా అవసరం అవుతాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 97,380 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గోదాంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


దీని కారణంగా మరో లక్ష మెట్రిక్‌ టన్నుల పంటలను నిల్వ చేయడం యంత్రాంగానికి ప్రధాన సమస్యగా మారింది. గోదాంల కొరత వ్యవహారం రైతుల మధ్య కూడా వివాదాలకు, విబేధాలకు కారణమవుతోంది. ఇటీవల నిర్మల్‌ ప్రాంతానికి పంటను భైంసా ప్రాంతంలోని గోదాంముల్లో నిల్వ చేస్తుండగా అక్కడి రైతులు దానిని అడ్డుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 


లక్ష మెట్రిక్‌ టన్నుల గోదాంలు అవసరం..

ప్రస్తుతం జిల్లాలో 70 మెట్రిక్‌ టన్నుల పంటలను నిల్వ చేసే సామర్థ్యం గల గోదాంలు నాబార్డు పరిధిలో ఉండగా మరో 27,380 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నాన్‌ నాబార్డు పరిధిలో ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మరో లక్ష మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గల గోదాంలు జిల్లాలో అవసరం అవుతున్నాయి. ఈ లక్ష మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంలు అందుబాటులోకి వస్తే ఇక్కడ కొనుగోలు చేసిన పంటలను నిల్వ ఉంచడం సులభమవుతోంది. అలాగే పంటల నిల్వకు సంబంధించిన సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించినట్లవుతుందంటున్నారు.


అధికారులు ప్రతియేటా పంటల కొనుగోలు ప్రారంభం కాగానే గోదాంల చుట్టే ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్దమొత్తంలో దిగుబడులు వస్తుండడం దానికి పోటీగా కొనుగోలు కూడా జరుగుతుండడంతో ఈ పంటలను నిల్వ చేయడం యంత్రాంగానికి సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధికారులు గోదాంలు అందుబాటులో లేని కారణంగా గ్రామాల్లో అందుబాటులో ఉన్న పంక్షన్‌హాల్‌లు, పట్టణాల్లోని పంక్షన్‌హాల్‌లలను సైతం వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వీటికి తోడు కొనుగోళ్లు పెరుగుతుండడంతో పొరుగు రాష్ర్టాలోని గోదాంల కోసం కూడా అన్వేషిస్తున్నారు.

 

పెద్ద ఎత్తున దిగుబడులు..

కాగా జిల్లాలో ప్రతియేటా ఖరీఫ్‌, రబీసీజన్‌లో పంటల దిగుబడి పెరుగుతోంది. ప్రస్తుత యాసంగిలో లక్ష ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం దిగుబడి లక్ష్యంగా నిర్ధారించారు. అలాగే 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలసాగును లక్ష్యంగా పెట్టుకోగా 24లక్షల క్వింటాళ్ల దిగుబడిని లక్ష్యంగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే జిల్లాలో 29,246 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసిన అధికారులు 12,260 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా వరిధాన్యం, మొక్కజొన్న పంటల దిగుబడులు పెరిగిపోతుండడం కారణంగా వాటిని నిల్వ చేయడం యంత్రాంగానికి విషమ పరీక్షగా మారుతోంది. ప్రతియేటా పంటల కొనుగోలు సమయంలో తూకం, నాణ్యతతో పాటు గన్నీ సంచుల కొరత, కూలీల కొరత, కనీస సౌకర్యాల కల్పన లాంటి సమస్యలు ఇటు రైతులను అటు సంబంధిత అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 


మూడు భారీ గోదాంల మంజూరుతో చిగురిస్తున్న ఆశలు..

కాగా గోదాంల కొరత తీవ్రతను దీని కారణంగా అటు అధికారులు, ఇటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఎట్టకేలకు సర్కారు సీరియస్‌గా పరిగణించింది. అలాగే మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సైతం గోదాంల కొరత సమస్య తీవ్రతను సర్కారుకు విన్నవించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటూ కోరారు. ఆయన ప్రయత్నాల మేరకు ప్రభుత్వం స్పందించి నిర్మల్‌ జిల్లాకు మూడు భారీ గోదాంలు మంజూరు చేసింది. ప్రస్తుతం లక్ష మెట్రిక్‌ టన్నుల పంటను నిల్వ చేసే సామర్థ్యం గల గోదాంల అవణసరం ఉండడంతో అధికారులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా భవిష్యత్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భారీ గోదాంల నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు.


ఒక్కోగోదాం 20 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని సారంగాపూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో ,ఖానాపూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో, అలాగే భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో భారీ గోదాంలను నిర్మించబోతున్నారు. దీనికి సంబందించి అధికారులు ఇప్పటికే మూడు చోట్ల 20 ఎకరాల చొప్పున స్థలాన్ని సైతం సేకరించారు. గోదాంల నిర్మాణ డిజైన్‌తో పాటు దానికి సంబందించిన అంచనాలు, టెండర్‌ ప్రక్రియ లాంటి వ్యవహారాలన్నీ పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ గోదాంల నిర్మాణం పూర్తయినట్లయితే పంటల దిగుబడుల సమస్య ఇక శాశ్వతంగా పరిష్కారం లభించబోతోందన్న ఆశాభావం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. 


Updated Date - 2020-05-10T11:16:06+05:30 IST