వ్యాక్సిన్‌పైనే ఆశలు

ABN , First Publish Date - 2020-12-12T05:19:40+05:30 IST

కంటికి కనిపించని కరోనా వైరస్‌ నివారణకు వస్తున్న వ్యాక్సిన్‌పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డిసెంబరులోనే కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు గాలిలో కలి శాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయి అనేక పరిశ్రమలు మూతబడ్డాయి.

వ్యాక్సిన్‌పైనే ఆశలు

జనవరి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం

తొలి విడత పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ

జిల్లాలో 6,511 మందికి కరోనా టీకా

మొత్తం 4,581 పాజిటివ్‌ కేసులు.. 40 మరణాలు

ఆదిలాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కంటికి కనిపించని కరోనా వైరస్‌ నివారణకు వస్తున్న వ్యాక్సిన్‌పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డిసెంబరులోనే కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు గాలిలో కలి శాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయి అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. మొదట విజృంభించిన వైరస్‌ తగ్గినట్లే తగ్గి మళ్లీ రెండవ దశలో వ్యాప్తి చెందుతుంది. జిల్లాలో జీరో కేసులకు చేరుకున్న తర్వాత కేసుల సంఖ్య పెరుగడంతో ఆందోళన రేపుతోంది. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడతో దాననుగుణంగానే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొదట ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో జిల్లాను తాకిన వైరస్‌ 10 కేసులతో ప్రారంభమై గడిచిన 8 మాసాల్లోనే 4,581 మందికి వ్యాప్తి చెందింది. మరణాల రేటు తక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడి 40 మంది మరణించగా మిగతా వారు కోలుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 200లకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన కొవిడ్‌ టీకా త్వరలోనే వస్తుందన్న సంకేతాలు రావడంతో హమ్మయ్యా కరోనా వ్యాక్సిన్‌ వచ్చిందంటూ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. జనవరి మొదటి వారంలోనే టీకా పంపిణీని ప్రారంభించే అవకాశం ఉందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మొదట వైద్య సిబ్బంది.. వైద్య సిబ్బందికే మొదట కొవిడ్‌ టీకాను వేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయడంతో ఆ దిశగా జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 6,511 మందికి టీకా వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో వారి ఆధార్‌కార్డు వివరాలు, సెల్‌ఫోన్‌ నెంబర్లను సేకరిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు పూర్తి వివరాలను అందజేయ నున్నారు. పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారు కాకపోయిన ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ, పారిశుధ్య కార్మికులు, పోలీసు శాఖ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేసిన తర్వాతనే రెండవ దశలో మిగతా వారికి పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది. టీకా ఫలితాల ఆధారంగానే కొన్ని మార్పులు చేర్పులు చేసి సామాన్య ప్రజలకు కొవిడ్‌ టీకాను పంపిణీ చేయనున్నారు. 

22 పీహెచ్‌సీలలో ఏర్పాట్లు..

జిల్లాలో ఉన్న 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్‌ టీకాను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ టీకాను ప్రభుత్వం పంపిణీ చేస్తే భద్ర పరిచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొవిడ్‌ టీకా పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖాధికారులకు అవగాహన కల్పించడం జరిగింది. త్వరలోనే జిల్లా స్థాయిలో వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించను న్నారు. టీకా వచ్చిన వెంటనే భద్ర పరిచేందుకు అందుబాటులో ఉన్న ఐస్‌లైన్‌ రిఫ్రిజ్‌రేటర్లు, డీ ఫ్రిజర్లను సిద్ధం చేస్తున్నారు. టీకా పంపిణీకి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటున్నారు. జిల్లాకు సంబంధించిన టీకా పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నివేదిస్తున్నట్లు జిల్ల్లా వైద్య అధికారులు పేర్కొంటున్నారు.

పది నుంచి 4,581 కేసులు..

జిల్లాలో మొదట 10 పాజిటివ్‌ కేసులు నమోదైన తర్వాత కేసుల సంఖ్య వేగంగా పెరుగుతు వచ్చింది. ప్రధానంగా జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు చివరి నుంచి అక్టోబరు, నవంబరు నెలల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మళ్లీ చలి తీవ్రత పెరుగడంతో రెండవ దశ వ్యాప్తి మొదలైంది. గ్రేటర్‌ ఎన్నికల విధులకు వెళ్లి వచ్చిన జిల్లా పోలీసు సిబ్బందికి ఒకే రోజు        65 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కలకలం రేపింది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి నిత్యం 20 కేసుల లోపే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 4581 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-12T05:19:40+05:30 IST