పాతాళగంగ పైపైకి
ABN , First Publish Date - 2020-05-09T11:08:19+05:30 IST
ఈ యేడు జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. వేసవిలో ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు
జిల్లాలో సగటు భూగర్భజల మట్టం 8.83 మీటర్లు
గతేడు కంటే 9.32 మీటర్ల పెరుగుదల
మిషన్ భగీరథతో దూరమవుతున్న నీటి సమస్యలు
అధిక వర్షపాతమే అసలు కారణమంటున్న అధికారులు
ఇబ్బందికర పరిస్థితుల్లో గుడిహత్నూర్, జైనథ్ మండలాలు
ఆదిలాబాద్, మే8 (ఆంధ్రజ్యోతి): ఈ యేడు జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. వేసవిలో ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటుక పోతున్నా అంత ఆందోళనకర పరిస్థి తులు కనిపించడం లేదు. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలో సాధారణ వర్ష పాతం 1157 మి.మీలు కాగా, ఈ యేడు 1100 మి.మీల వర్షపాతం నమోదైంది. గతేడుతో పోల్చు కుంటే ఈ యేడు అధికంగానే వర్షపాతం కురిసిన ట్లు భూగర్భ జలశాఖ అధికారులు పేర్కొం టున్నారు. ఈ యేడు ఏప్రిల్ చివరి నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 8.83 మీటర్లుగా నమోదైంది. ఇదే గతేడు 18.15 మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. మేలో 45 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండ డంతో భూగర్భ జలాలు మరింత పడిపోయినా పెద్దగా ప్రమాదం ఉండదంటున్నారు. జూన్ మొదటి వారం లేక రెండో వారంలో వర్షాలు కురిస్తే ఈ యేడు గండం గట్టెక్కినట్లేనని అధికా రులు భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు అడుగంటుకపోతున్నా భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది.
పెరిగిన భూగర్భ జలమట్టం..
జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టం అమాంతంగా పెరిగింది. ఈ యేడు మార్చిలో 8.83 మీటర్లుగా నమోదు కాగా, నెల రోజుల తర్వాత ఏప్రిల్ చివరి నాటికి 8.83 మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. అంటే నెల రోజుల్లో స్వల్పంగా మైనస్ 0.56మీటర్ల నీటి మట్టం తగ్గింది. గతేడు ఏప్రిల్‌లో 18.15 మీటర్లు నమోదు కాగా, అదే ఈ యేడు 8.83మీటర్ల లోతులోకి మాత్రమే నీటిధారలు పడిపోయాయి. దీంతో గతేడుతో పోల్చుకుంటే 9.32 మీటర్ల పెరుగుదల కనిపించింది. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తక పోవడం, బోరు బావులు అడుగంటుక పోయిన దాఖలాలు కనిపించడం లేదు.
భగీరథతో బాధలు దూరం..
మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్న మిషన్ భగీరథతో జిల్లా ప్రజల నీటి బాధలు దూరమవు తున్నాయి. గతేడాదే జిల్లాకు మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా అయినా.. ఈ యేడు పూర్తి స్థాయిలో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపుగా 90శాతం గ్రామాలకు మిషన్ భగీరథ నీరు చేరుతోంది. అక్కడక్కడా గుట్ట ప్రాంతాల్లోని గ్రామాలకు మినహా అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో యేటా వేసవిలో మంచి నీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు.
రెండు మండలాలు మినహా..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో రెండు మండలాలు మినహా మిగితా మండలాల్లో భూగర్భ జల మట్టం మెరుగైన పరిస్థితుల్లోనే ఉంది. అత్యధికంగా గుడిహత్నూర్ మండలంలో 16.60 మీటర్లు కాగా, జైనథ్ మండలంలో 16.00 మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. ఏటా ఈ మండలాల్లోనే వేగంగా నీటిమట్టం అడుగంటుక పోవడం కనిపిస్తోంది. జైనథ్ మండలం పెన్‌గంగా నది తీరాన ఉన్న రాతిపొరలతో కూడిన భూగర్భ శిలలు అధికంగా ఉండడం, గుడిహత్నూర్ మండలంలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండి ఎక్కువ భూ ఉపరితలం ఎత్తు పల్లాలతో కూడి ఉండడం కారణంగా ఈ రెండు మండలాల్లో ఏటా కొంత ఇబ్బందికర పరిస్థితులే నెలకొంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు
భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు..: శ్రీవల్లి, జిల్లా భూగర్భ శాఖ అధికారి
జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఇప్పటి వరకు మెరుగ్గానే ఉంది. ఒకటి రెండు మండలా ల్లో మినహా అన్ని మం డలాల్లో పరిస్థితి మెరు గ్గానే ఉంది. అయినా నీటిని పొదుపుగా వాడుకుంటే మంచిది. ఈ సారి నైరుతి రుతుపవనాల రాక కొంత ఆలస్యమైనా ఇబ్బందిగా ఉండదు. గతేడు తో పోల్చుకుంటే ఈ సారి 9.32 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగింది.