హై అలర్ట్‌

ABN , First Publish Date - 2020-04-08T10:54:13+05:30 IST

జిల్లా అంతటా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి అధికార యంత్రాంగం కట్టు దిట్టమైన చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే జిల్లాలో 10 పాజిటివ్‌ కేసులు

హై  అలర్ట్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో 19 వార్డులు, పలు గ్రామాల దిగ్బంధం

పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారులు

రిమ్స్‌ వైద్యుడిపై కేసు నమోదు

లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మరికొంత కాలం ఇంటికే పరిమితం

1128 మంది పారిశుధ్య కార్మికులకు నగదు ప్రోత్సాహకం


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి అధికార యంత్రాంగం కట్టు దిట్టమైన చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే జిల్లాలో 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మరో 25 మంది అనుమానిత వ్యక్తుల మెడికల్‌ రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో పరిస్థితి ఎలా ఉంటుం దోనని జిల్లా అంతటా ఆందోళన రేపుతోంది. పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో ఆదిలాబాద్‌ అర్బన్‌ ప్రాంతంలో 19 వార్డుల్లో 17,083 నివాసాలను గుర్తించి కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 63వేల 587 మంది నివసిస్తున్నట్లు గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. అలాగే నేరడిగొండ మండలం పరిధిలోని నేరడిగొండ, సావర్గాం, లకంపూర్‌ గ్రామాల పరిధిలో 1303 గృహాలను గుర్తించి 4384 మందిపై నిఘా సారించారు.


ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌ గ్రామ పరిధిలో మార్కుగూడ, దేవుగూడ, శంకర్‌తాండ, కోలాంగూడ గ్రామాల్లో 1155 గృహాలను గుర్తించి 4695 మంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను నిర్వహిస్తూ ఆంక్షలు విధించారు. కరోనా వైరస్‌ సోకిన వారితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 148 అధికార బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో కరోనా కట్టడికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు మరికొంత కాలం ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. 


జిల్లాలో 1,128 మందికి నగదు ప్రోత్సాహకం..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రాణాలకు తెగించి విధులు నిర్వహి స్తున్న పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. దీంతో జిల్లాలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 239 మందితో పాటు గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న 889 మంది మొత్తం 1128 మంది పారిశుధ్య కార్మికులకు పూర్తి వేతనంతో పాటు అదనంగా నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న ఒక్కొక్కరికి రూ.7,500ల చొప్పున మొత్తం రూ.17లక్షల 92వేల 500ల నిధులు, అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న 889 మంది కార్మికులకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.14లక్షల 45వేల నిధులు జిల్లాకు మంజూరుకాను న్నాయి. కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.


ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ..

జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు న్నారు. కరోనా వైరస్‌ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తు న్నారు. నియంత్రణ చర్యలు చేపడుతునే పారిశుధ్య పనులతో పాటు సోడియం హైడోక్రోరైడ్‌ ద్రవణాన్ని పిచి కారీ చేయిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వైరస్‌ విస్తరించకుండా ఎఫెక్ట్‌ ప్రాంతాలను దిగ్బంధం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్స్‌గా ప్రకటించిన ప్రాంతాల నుంచి ఎవరు బయటకు రాకుండా భారీ కెడ్లను ఏర్పాటు చేస్తూ లైనింగ్‌లు వేస్తు న్నారు. ప్రత్యేకాధి కారుల సహాయంతో కలెక్టర్‌ శ్రీదేవసేన పరిస్థితిని పరిశీలిస్తూ తీసుకో వాల్సిన జాగ్రత్తలపై అధికారులను ఆదేశిస్తున్నారు. 


రిమ్స్‌ వైద్యుడిపై కేసు..

కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పనిచేస్తున్న కంటి వైద్యుడిపై రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాంనాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు ఆయనపై సెక్షన్‌ 176, 188, 270, 271 కింద కేసులు నమోదు చేశారు. ఈ వైద్యుడు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుతు రిమ్స్‌లో వైద్య సేవలు అందించడంపై అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. గత నెల మార్చి 18న జిల్లాకు వచ్చిన వైద్యుడు మార్చి 20 నుంచి 31 వరకు ఆయన విధులు నిర్వహించి రోజుకు దాదాపు 50 మంది వరకు రోగులకు వైద్య సేవలు అందించినట్లు సమాచారం. అలాగే ఒక సారి జిల్లా అధికారుల సమీక్ష సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అయితే మంగళవారం వెల్లడించిన కరోనా పరీక్షల రిపోర్టులో ఆయనకు నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-04-08T10:54:13+05:30 IST