హైఅలర్ట్
ABN , First Publish Date - 2020-12-02T04:05:21+05:30 IST
మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం) వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో మారుమూల పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

నేటి నుంచి పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు
అప్రమత్తమైన పోలీసు శాఖ
కోటపల్లి, డిసెంబరు 1 : మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం) వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో మారుమూల పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పీఎల్‌జీఏ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమరులను స్మరిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించాలని సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పత్రికా కార్యాలయాలకు ప్రకటనలు పంపారు. పోలీసులు పీఎల్‌జీఏ వారోత్సవాలతో పాటు వార్షికోత్సవాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కన్నేశారు. తె లంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో రాష్ట్ర సరిహద్దుపై పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో మారుమూల ఉన్న కోటపల్లి, వేమనపల్లి మండలాల గ్రామాలకు సరిహద్దుగా ప్రాణహిత, గోదావరి నది ఉండడంతో నదుల తీరం వెంట పోలీసులు గస్తీ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ల ఆధ్వర్యంలో సివిల్, సీఆర్‌పీఎఫ్, ప్రత్యేక పోలీసు బలగాలు రెండు రోజులుగా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోంది. అలాగే 63వ నెంబరు జాతీయ రహదారిపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి ఇటు వైపు, అటు వెళ్లే వాహనాలను తనిఖీలు చేశాకే వదిలి పెడుతున్నారు. కోటపల్లి, వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది తీరం గుండా పడవలు నడిపే ఫెర్రీ పాయింట్ల వద్ద కొత్త వ్యక్తుల కదలికలపై సమాచారం తెలుసుకుంటున్నారు. చేపలు పట్టే జాలర్లకు, పడవల యజమానులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ఏరియా డామినేషన్‌తోపాటు సరిహద్దు గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.