పంట.. పరేషాన్‌!

ABN , First Publish Date - 2020-12-31T05:14:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే వానాకాలం సీజన్‌ నుంచి పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయబోతున్నట్లు, ఇక రైతులు తమ ఇష్టానుసారంగా పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ చేసిన ప్రకటన జిల్లా రైతాంగాన్ని ఆందోళన కు గురిచేస్తోంది.

పంట.. పరేషాన్‌!
సారంగాపూర్‌ మండలం ధని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన రైతులు

ధాన్యం అమ్మకం ఇక కత్తిమీద సామే.. 

సర్కారు నిర్ణయంతో ఆందోళనలో అన్నదాత 

రాబోయే వానాకాలం సీజన్‌ నుంచి చేతులెత్తేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం 

ఆధిపత్యం చెలాయించనున్న దళారీ వ్యవస్థ 

అడ కత్తెరలో జిల్లా అన్నదాతలు

నిర్మల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే వానాకాలం సీజన్‌ నుంచి పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయబోతున్నట్లు, ఇక రైతులు తమ ఇష్టానుసారంగా పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ చేసిన ప్రకటన జిల్లా రైతాంగాన్ని ఆందోళన కు గురిచేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం మద్దతుధరతో పంట కొనుగోళ్లను పౌర సరఫరాల శాఖ, సీసీఐ, మార్క్‌ఫెడ్‌, రైతు సహకార సంఘాల ఆఽధ్వర్యంలో కొనుగోలు చేసింది. గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలు ఈ కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో వారికి పెద్దఎత్తున ఉపాధి లభిస్తోంది.. అలాగే, రైతులు సర్కారు కేంద్రాల ద్వారా మోసాలకు గురి కాకుండా కాపాడబడుతున్నారు. ధర, తూకం విషయంలలోనూ పెద్దగా మోసాలకు తావు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గత వానాకాలం నుంచి ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేయాలని హుకూం జారీ చేసింది. మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని, దిగుబడులను కొనుగోలు చేయమని ప్రకటించింది. అయితే రైతుల ఒత్తిడి మేరకు తిరిగి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ, కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు ప్రైవేటు బారీన పడకతప్పలేదు. కాగా, గత కొంతకా లం నుంచి మద్దతుధర ప్రకటిస్తూ ప్రభు త్వం స్వయంగా పంటలను కొనుగోలు చేస్తుండడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారుల మోసాలు తగ్గడమే కాకుండా వారి కార్యకలాపాలు పూర్తి గా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆకస్మాత్తుగా పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తూ ఇక నుంచి కొనుగోళ్ల జరపబోమని   రైతుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతు లు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సర్కారు  నిర్ణయంలో జిల్లా రైతాంగానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయా, పప్పు దినుసు ల పంటలు పెద్దఎత్తున సాగవుతుంటాయి. ఇక్కడ మెజార్టీ రైతులు చిన్న, సన్నకారు వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. అలాగే  స్థానిక గ్రామైఖ్య సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు రవాణా భారం తప్పింది. ప్రస్తుతం రైతులు తాము ఆరుగాలం శ్రమిచి పండించిన పంటలను అమ్ముకోవడం కత్తిమీద సాములా మారే ప్రమాదం ఉందంటున్నారు.

వానాకాలం, యాసంగిలలో భారీ దిగుబడులు

మొన్నటి వానాకాలంలో పంటల దిగుబడులు పెద్దఎత్తున వచ్చా యి. ప్రభుత్వం చివరి వరకు పంటనంతా కొనుగోలు చేసింది. వరి 32,343 హెక్టార్లలో సాగు చేయగా.. 1.31 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. అలాగే పత్తి పంట 57,314 హెక్టార్లలో సాగు చేయ గా.. 6,95,762 మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధ్యమైంది. అలాగే ఇతర పంటలు దాదాపు 50వేల క్వింటాళ్లలో సాగు కాగా, ఈ దిగుబడి వచ్చిన పంటలన్నింటికీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అయితే, 2019-2020 యాసంగి సీజన్‌లో 40వేల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా.. 1,47,824 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అలాగే 32,750 హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేయగా.. 12,77,220 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేశారు. ఈసారి వానాకాలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను 70వేల మంది రైతులు..  తొమ్మిది లక్షల క్వింటాళ్ల వరకు పంట దిగుబడిని సాధించారు.

కనుమరుగవనున్న కొనుగోలు కేంద్రాలు

ఇదిలాబా ఉండగా, జిల్లాలో రైతుల డిమాండ్‌ మేరకు వారు కోరి న చోటల్లా ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం ది. గత 2019-2020 వానాకాలం సీజన్‌కు గాను నిర్మల్‌లో 42 కొ నుగోలు కేంద్రాలను మంజూరు చేశారు. అలాగే యాసంగి సీజన్‌ లో మొత్తం 50కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు మహిళా సంఘాలకు 2019-2020 యాసంగి సీజన్‌లో రూ.కోటి  వర కు కమీషన్‌ రూపంలో ఆదాయం సమకూరింది. ప్రస్తుత యాసంగి సీజన్‌ కోసం కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యడం గమనార్హం. ఇలా గ్రామాల్లో వానాకాలం, యాసంగి సీజన్‌ల సందర్భంగా కొనుగోలు కేంద్రాలతో ఊరంతా సందడిగా కనిపించేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇక నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు కనుమరుగు కానున్నాయి. ఇదే జరిగితే ఇక నుంచి రైతులు వ్యాపారులకు గాని, మార్కెట్‌ కమిటీలకు గాని తాము పండించిన పంటలను అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు. 

విస్తరించనున్న ప్రైవేటు వ్యాపారుల ఆధిపత్యం

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రైవేటు వ్యాపారుల ఆధిపత్యం విస్తరించనుంది. ఇప్పటి వరకు కొనసాగిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కింది. ధరతో పాటు నాణ్యత విషయంలో వేధింపులు తప్పాయి. అలాగే రైతులు తమ గ్రామంలోనే పంటలను అమ్ముకునే వెసులుబాటు లభించింది. ఇక నుంచి అలాంటి  సదుపాయం ఉండబోదంటున్నారు. వ్యాపారు లు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన ధరతో పంటలను కొనుగోలు చే యనున్నారు. వ్యాపారుల వద్దకే పంటలను తీసుకువెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడతోంది. దీంతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా పెద్దమొత్తంలో కమీషన్‌లు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇక వారికి ఉపాధి కరువు కాబోతోందంటున్నారు. వారికి కమీషన్‌లు కూడా దక్కని పరిస్థితి తలెత్తనుంది. దళారీ వ్యవస్థ ఆధిపత్యం కారణంగా ఇటు రైతులు అటు పొదుపు సంఘాల మహిళలు నష్టాల పాలు కాబోతున్నారంటున్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు, ప్రతిపక్షాలు, మహిళ పొదుపు సంఘా లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు పోరుబాట మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయం వ్యవసాయ రంగంలో దుమారం రేపే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2020-12-31T05:14:48+05:30 IST