గుబులు పుట్టిస్తున్న మబ్బులు

ABN , First Publish Date - 2020-11-22T03:27:36+05:30 IST

రైతన్నకు వాన భయం వెంటాడుతోంది. రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమై చినుకులు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గుబులు పుట్టిస్తున్న మబ్బులు
వాన భయంతో ధాన్యం కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పిన రైతులు

పలు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి వర్షం

కళ్లాల్లోనే ధాన్యం కుప్పలు

భారీ వర్షం వస్తే అపార నష్టం

సేకరణకు సిద్ధంగా 90 శాతం పత్తి

ఆందోళనలో రైతులు

నెన్నెల, నవంబరు 21: రైతన్నకు వాన భయం వెంటాడుతోంది. రెండు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమై చినుకులు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో వాతవరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షం వస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


కళ్లాల్లోనే ధాన్యం రాశులు

 జిల్లాలో సగానికి పైగా వరి పొలాలు కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు లేక, ప్రైవేటు వ్యాపారులు ముందుకు రాక ధాన్యం కుప్పలు కళ్లాల్లోనే ఉన్నాయి. చాలా మంది రైతులు ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఽరాశులు పోసుకొని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను నామ మాత్రంగా ప్రారంభించారు. కాని ధాన్యం సేకరణ మాత్రం మొదలుపెట్టలేదు. సన్నరకం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో సన్నాలు సాగు చేసిన రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. వారు కోతలు పూర్తి చేసుకొని రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో వర్షం వస్తుందేమో అనే భయం రైతులకు పట్టుకుంది. ముందు జాగ్రత్తగా వాన నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం కుప్పలపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పి తెల్లవార్లు ఆకాశం కేసి చూస్తూ జాగారం చేస్తున్నారు. ధాన్యంలో తేమ తగ్గించేందుకు పొద్దంతా ఆరబెట్టి వాన భయంతో సాయంత్రానికి రాశిపోసుకొని కవర్లు కప్పాల్సిన పరిస్థితి ఉంది.  వర్షం వస్తే మెదలు ఎత్తని పొలాల్లో ధాన్యం మొలకెత్తి పనికిరాకుండా పోతుందని రైతులు తెలిపారు. నాణ్యమైన ధాన్యానికే కుంటిసాకులు  చెప్పే  వ్యాపారులు తడిసిన ధాన్యం వైపు కన్నెత్తి కూడా చూడరని అంటున్నారు. ఇక కోతలు పూర్తికాని పొలాల్లో వర్షం వస్తే పనులు సాగవని, హార్వెస్టర్లు దిగబడటంతో కోతలకు కష్టం అవుతుందని, కూలీలు లభించక పంట దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు.   ఽగత  యేడాది వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లోనే వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరణ ప్రారంభించాలని, సన్నరకం వడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కోతలు పూర్తి చేసుకున్న రైతులు ఎప్పటికప్పుడు ధాన్యం అమ్ముకుంటారని అంటున్నారు. 


చేలల్లోనే 90 శాతం పత్తి 

లక్షల పెట్టుబడులు పెట్టి పత్తి పంట వేసిన రైతులకు ఆది నుంచి కష్టాలు  వెంటాడుతూనే ఉన్నాయి.  కూలీల కొరత వల్ల పత్తి సేకరణ వెనుకబడింది. ఈ పాటికి మొదటి విడత పత్తి సేకరణ పూర్తి కావాల్సి ఉండగా కొన్ని చేలల్లో ఇంకా పత్తి తీత మొదలే పెట్టలేదు. యేటా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి వచ్చే వలస కూలీలు కరోనా కారణంగా రాకపోవడంతో కూలీల కొరత తీవ్రంగా వేదిస్తోంది. లోకల్‌ కూలీలకు ఎక్కువ ధర చెల్లించి పత్తి సేకరించాల్సి వస్తోంది. దీంతో 90 శాతం పత్తి చెట్లపైనే ఉంది. మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తుండటంతో చేతికొచ్చే సమయంలో పంట చేజారుతుందోమో అనే గుబులు రైతులకు పట్టుకుంది. వర్షంలో తడిసి బరువైన పత్తి పింజలు చెట్టు నుంచి జారి కింద పడతాయని చెబుతున్నారు. నేలరాలిన పత్తి పనికిరాకుండా పోతుందని రైతులు చెప్పారు. తడిసిన దూది పింజలు రంగు మారుతాయని చెబుతున్నారు. ఇప్పటికే తేమ పేరిట కొర్రీలు పెడుతూ ధరలో కోతలు విధిస్తున్న అధికారులు వర్షం వస్తే మాత్రం పత్తిని తిరస్కరిస్తారని వాపోతున్నారు. 

Read more