జీవో నం.59 అమలయ్యేనా..?

ABN , First Publish Date - 2020-12-16T04:19:50+05:30 IST

అర్బన్‌ సీలింగ్‌ యాక్ట్‌ నిబంధనలకు లోబడి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి వెసులు బాటు కల్పించేలా తెచ్చిన జీవో నం.59 అమల్లో ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటోంది.

జీవో నం.59 అమలయ్యేనా..?
క్రమబద్ధీకరణకు నోచుకోని భూమి

-2014లోనే భూముల క్రమబద్ధీకరణకు ఆదేశాలు 

-జిల్లాలో 80మంది దరఖాస్తు

-డీడీలు చెల్లించి ఐదేళ్లుగా ఎదురుచూపులు

-ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

అర్బన్‌ సీలింగ్‌ యాక్ట్‌ నిబంధనలకు లోబడి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి వెసులు బాటు కల్పించేలా తెచ్చిన జీవో నం.59 అమల్లో ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రభుత్వం భూముల క్రమ బద్ధీకరణ కోసం వివిధ పార్టీల నేతలతో చర్చించి ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనల మేరకు దశాబ్ధాలుగా భూగరిష్ట పరిమితి చట్టంలో భాగంగా కోల్పోయిన భూముల్లో నిర్మాణాలు జరిపి ఉన్న వారిని క్రమబద్ధీకరించడం ద్వారా చట్ట పరిధిలోకి తెచ్చి హక్కులు కల్పించాలని నిర్ణయిం చింది. ఈక్రమంలోనే 2014 చివరలో జీవో నం.59ను విడుదల చేసి 2015లో సెప్టెంబరు వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 80 మంది వరకు ఉన్నారు. 

నిబంధనల ప్రకారం దరఖాస్తులు చేసుకున్న ప్రాంతాల్లోని భూముల విలువ ఆధారంగా మూల ధరపై విస్తీర్ణాన్ని బట్టి ధర నిర్ణయించి డీడీలు సేకరించారు. ఇలా 2015 నాటికి జిల్లాలో రూ.90లక్షల నుంచి కోటి రూపాయిల వరకు డీడీల రూపంలో రెవెన్యూ సమకూరింది. ఆ తదుపరి దశలో వాటిని క్రమబద్ధీకరించి సంబంధించిన వ్యక్తులకు హక్కులు కల్పించాల్సి ఉంది. అయితే గడిచిన ఐదేళ్లుగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు ఈ సైటుకు సంబంధించి లాగిన్‌ చేసే అధికారం సీసీఎల్‌ఏకు ఉంది. రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని పదే పదే సీసీఎల్‌ఎకు లేఖలు రాసినా స్పందన రావడం లేదు. అంతేకాదు కలెక్టర్లు కూడా ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డీడీలు చెల్లించిన దరఖాస్తు దారులు అసలు ప్రభుత్వం ఈ భూములను క్రమబద్ధీకరిస్తుందా, లేదా అని ప్రశ్నిస్తున్నారు. లేక పోతే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులైనా తిరిగి ఇప్పించాలనే వాదన దరఖాస్తుదారుల నుంచి బలంగా విన్పిస్తోంది. అయితే ప్రభుత్వం ఇటీవల మరోసారి జీవోనం.59 ప్రస్తావన తేవటంతో ఇంకొంత కాలం వేచి చూడాలని రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారులను కోరుతున్నట్టు తెలిసింది.


క్రమబద్ధీకరణకు ఇవీ నిబంధనలు 

వివిధ వృత్తిదారులు, కుటీర పరిశ్రమల యాజమానులకు ఆయా యూనిట్లు నిర్మించి ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలను జారీ చేసింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో, భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం మినహాయించిన ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన కుటీర పరిశ్రమలు, నివాస స్థలాలను క్రమబద్ధీకరించడం కోసం 2014 జూన్‌ 2 జీవో నం.59 విడుదల చేసింది. 250 చదరపు గజాల్లోపు స్వాధీనతలో ఉన్న స్థలాలకు మూల విలువపై 50 శాతం ఫీజుతో క్రమబద్ధీకరిస్తారు. అలాగే 500 గజాల వరకు ఆక్రమణలు ఉంటే 75 శాతం, 500 గజాలు ఆపై ఉంటే భూమి మూల విలువకు వంద శాతం మొత్తం రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. ఇందుకు గాను సంబంధిత రిజిస్ట్రార్లు భూముల విలువను నిర్ధారించారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు మూల విలువలో 25 శాతం నిర్ధేశిత గడువులోపు డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే దరఖాస్తు దారులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు (స్వాధీనతకు సంబంధించి ఆధారాలుంటే) రిజిస్టర్‌ డాక్యుమెంటు, ఆస్తి పన్ను, నిర్మాణాలు ఉన్నట్టుగా చూయించే ఆధారాలు, విద్యుత్‌ బిల్లు, నీటి బిల్లుల వంటివి జతచేయాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే జిల్లాలో 80 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది

-సిడాం దత్తు, ఆర్డీవో, ఆసిఫాబాద్‌

జీవోనం.59 ద్వారా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు జరుపుకున్న కుటీర పరిశ్రమలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే గతంలో డీడీలు సేకరించాం. ఇందుకు సంబంఽధించి క్షేత్ర స్థాయిలో విచారణ కూడా పూర్తి చేసి నివేదికలను అందజేశాం. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టతను ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ప్రక్రియను పూర్తి చేస్తాం.


Updated Date - 2020-12-16T04:19:50+05:30 IST