మళ్లీ ఫ్రీజింగ్
ABN , First Publish Date - 2020-11-26T05:51:23+05:30 IST
రాష్ట్రంలో ఖజానా చెల్లింపులకు మళ్లీ ఫ్రీజింగ్ మొదలైంది. అభివృద్ధి పనుల ప్రాధాన్యత క్రమంలోనే బిల్లుల చెల్లింపులను చేస్తున్నారు.

బడ్జెట్ విడుదలకు అనుగుణంగానే కొనసాగుతున్న చెల్లింపులు
ఆలస్యంగా ఉద్యోగుల బిల్లుల చెల్లింపులు
నిజామాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఖజానా చెల్లింపులకు మళ్లీ ఫ్రీజింగ్ మొదలైంది. అభివృద్ధి పనుల ప్రాధాన్యత క్రమంలోనే బిల్లుల చెల్లింపులను చేస్తున్నారు. రొటేషన్ పద్ధతుల్లో పద్దులను క్లియర్ చేస్తున్నారు. ఉద్యోగులకు అవసరమైన చెల్లింపుల్లోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం ఆలస్యమవుతున్నాయి. గతంతో పోలిస్తే కొన్ని బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అత్యవసర బిల్లులకు కూడా వారం నుంచి 15 రోజుల వరకు సమయం పడుతోంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తున్న విధంగానే ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేస్తున్నారు. గతంలో జిల్లా స్థాయిలోనే అన్ని బిల్లులను చెల్లింపులు చేయగా ప్రస్తుతం నేరుగా ఆర్థిక శాఖ నుంచే బిల్లులను ఉద్యోగుల అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపులపై గత కొన్ని నెలలుగా ఫ్రీజింగ్ కొనసాగుతోంది. గతంలో ప్రతీ బిల్లు ట్రెజరీకి వెళ్లగానే వారం నుంచి పది రోజుల్లో క్లియర్ అయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రతీ బిల్లు 15 నుంచి నెల రోజుల వరకు సమయం పడుతోంది. కొన్ని బిల్లులు అంతకు మించి ఎక్కువ సమయం పడుతున్నాయి. గతంలో ఉద్యోగుల అత్యవసరమైన ఆరోగ్య బిల్లులు త్వరగా చెల్లించేవారు. ఇప్పుడు ఆ బిల్లులకు కూడా సమయం పడుతోంది. ఈ ఆరోగ్య బిల్లులకు 15 నుంచి 20 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారు. కొన్ని బిల్లులకు ఇంకా ఎక్కువ సమయం పడుతోంది. ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు గానీ, ఇతర బిల్లులు చెల్లింపుల్లో కూడా ఆలస్యమవుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్ ట్రెజరీ, జిల్లాల ట్రెజరీ కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు వచ్చిన బిల్లులను జనరేట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అదేరోజు అప్‌లోడ్ చేస్తున్నారు. బిల్లుల స్టేటస్‌ను ఉద్యోగులకు పంపిస్తున్నారు. ఈ బిల్లులను ఆర్థిక శాఖ అధికారులు ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేస్తున్నారు. గతంలో ఎమర్జెన్సీ బిల్లులన్నీ జిల్లా స్థాయిలోనే ట్రెజరీ అధికారులు చేసేవారు. వెంటవెంటనే చెక్కులను క్లియర్ చేసేవారు. ప్రస్తుతం వీరు ఆ పనులు చేయడం లేదు. ఆర్థికశాఖ ఆదేశాలతో బిల్లులను ఆన్‌లైన్‌లో జనరేట్ చేసి పంపిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన టీ.ఏ, ఇతర బిల్లులు కూడా ఆలస్యంగానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగులకు సంబంధించి ఆన్‌లైన్‌లో జనరేట్ కాగానే ఆ బిల్లు ఎక్కడెక్కడ ఉందో ఎప్పుడు చెల్లిస్తారో వారి మొబైల్‌కు సమాచారాన్ని పంపిస్తున్నారు. ఆయా శాఖలకు బడ్జెట్ రిలీజ్ కాగానే చెల్లింపులను చేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య బిల్లులు కూడా గతంతో పోలిస్తే కొంత ఆలస్యమైనా త్వరగానే చెల్లింపులు జరిగే విధంగా చూస్తున్నారు. జిల్లా ట్రెజరీ అధికారులకు కూడా ఏయే బిల్లులను ఏరోజు చెల్లిస్తున్నారో ఆర్థిక శాఖ నుంచి సమాచారాన్ని అందిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా ఈ చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. కరోనా ప్రభావం వల్ల లాక్‌డౌన్ విధించడంతో ఆదాయం గణనీయంగా పడిపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురయిందని అధికారులు తెలిపారు. కొద్దిగా ఆలస్యమైనా అన్ని బిల్లులను చెల్లింపులను చేస్తున్నారని వారు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో అన్ని శాఖల ఉద్యోగుల బిల్లులను కూడా త్వరగానే అయ్యే విధంగా చూస్తున్నామని వారు తెలిపారు. పే అండ్ అకౌంట్స్ శాఖ ద్వారా కూడా వివిధ అభివృద్ధి పనులకు చెల్లింపులు కూడా ఇదే రీతిలో కొనసాగుతున్నాయి. ఏయే శాఖలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఆ శాఖలకు ముందుగా చెల్లింపులను చేస్తున్నారు. ఆ శాఖలకు విడుదలయ్యే బడ్జెట్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. పలు శాఖల్లో చేపడుతున్న అభివద్ధి పనులకు, కాంట్రాక్టర్‌లకు రొటేషన్ పద్ధతిలో ఈ బిల్లులను చెల్లింపులు చేస్తున్నారు. గతంలో ఈ బిల్లుల చెల్లింపునకు పనులు పూర్తి కాగానే 15 నుంచి నెల రోజుల్లో చెల్లింపులు జరుగగా ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పడుతోంది. తమకు వచ్చిన బిల్లులను పే అండ్ అకౌంట్స్ శాఖ అధికారులు వెంటనే ఆన్‌లైన్‌లో జనరేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన స్టేటస్‌ను కూడా ఆ శాఖ అధికారులకు అందిస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలోనే ఈ బిల్లుల చెల్లింపు జరుగుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో బిల్లుల చెల్లింపు మాత్రం గతంతో పోలిస్తే ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగితే చెల్లింపులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఉద్యోగులు మాత్రం తమకు త్వరగా చెల్లింపులు చేస్తే అవసరాలకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆరోగ్య బిల్లులను మాత్రం ఆపకుండా త్వరగా చెల్లించాలని కోరారు.