అడవిపందుల బీభత్సం

ABN , First Publish Date - 2020-11-26T05:08:10+05:30 IST

ఆరుకాలం కష్టించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో రైతులను ప్రకృతితో పాటు అడవి జంతువులు వెంటాడుతూనే ఉన్నాయి. కొండంత ఆశతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలను సాగు చేసుకునప్పటికీ రైతన్న దరిచేరడం లేదు. ఏ పంట చేనులో చూసినా అడవి పందుల బీభత్సమే కనబడుతోంది.

అడవిపందుల బీభత్సం
కొత్తూరు గ్రామంలో ధ్వంసమైన పంట

వందల ఎకరాల్లో పత్తి పంట నష్టం 

అధికారులకు విన్నవించినా పట్టింపు కరువు

తలమడుగు, నవంబరు 25: ఆరుకాలం కష్టించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో రైతులను ప్రకృతితో పాటు అడవి జంతువులు వెంటాడుతూనే ఉన్నాయి. కొండంత ఆశతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలను సాగు చేసుకునప్పటికీ రైతన్న దరిచేరడం లేదు. ఏ పంట చేనులో చూసినా అడవి పందుల బీభత్సమే కనబడుతోంది. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల పంట సాగు చేస్తే అందులో మూడు ఎకరాల పంటలను పందులు ధ్వంసం చేసిన పంటలే కనబడుతున్నాయి. మండ లంలోని ఆయా గ్రామాల్లో ప్రతి రోజూ వందలాది పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తునప్పటికీ సంబంధిత అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినా చేసినా స్పందన లేదు. అడవి పందుల దాడి వల్ల నష్టపోయిన పంటలకు అటవీ శాఖ ద్వారా నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా పరిహారం అందించిన దాఖలాలు కనబడడం లేదని బాధితులు వాపోతున్నారు. వానాకాలం ప్రారంభం నుంచి రైతుల కు అడవి పందుల బెడద, ఎలుగుబంటుల దాడులు తప్పడం లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడవి పందుల దాడుల వల్ల పంటలు నష్టపోయిన రైతులు గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ధ్రువపత్రాలతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. మండలంలోని డోర్లి శివారం, తలమడుగు శివారం, బరంపూర్‌, కొత్తూరు, ఝరి, చర్లపల్లి, కుచ్లాపూర్‌, లింగి, సుంకిడి, ఉమ్రి తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో పత్తి పంటతో పాటు కంది పంట, జొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేయడంతో రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయ పంటలుసాగు చేసేందుకు ఒక్కో రైతు ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు చేసినప్పటికీ చేసిన ఖర్చులు మిగిలేటట్లు లేవంటున్నారు. దీనికితోడు నెల రోజులుగా పత్తి పంటను గులాబీ రంగు పురుగు వ్యాపించడంతో రైతులు మరింత ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని తలమడుగు మండల కేంద్రం గుట్టపై ఉన్న 500 ఎకరాల్లో 300 ఎకరాల్లోనూ పత్తి పంటను పందులు ధ్వంసం చేశాయని రైతులు అధికారులకు విన్నవించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అడవి పందుల దాడులతో నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 

Read more