నిధులు, విధుల కోసం లడాయి
ABN , First Publish Date - 2020-12-15T06:15:31+05:30 IST
గత కొన్ని సంవత్సరాల నుంచి నిధులు, విధుల కోసం గళమెత్తుతూ ఆలిసిపోతున్న ఎంపీటీసీ సభ్యులు ఇక తమ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నారు.

హక్కులసాధనకు ఎంపీటీసీల పోరుబాట
ఉత్సవ విగ్రహాలుగా మారిపోతుండడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు
నేడు నిర్మల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశం
హాజరుకానున్న 567 మంది ఎంపీటీసీలు
ఉద్యమ కార్యాచరణకు ఇక్కడే శ్రీకారం
నిర్మల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గత కొన్ని సంవత్సరాల నుంచి నిధులు, విధుల కోసం గళమెత్తుతూ ఆలిసిపోతున్న ఎంపీటీసీ సభ్యులు ఇక తమ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నారు. ఏళ్ల నుంచి ప్రజల ఓట్లతో గెలుపొంది ఎంపీటీసీలుగా చెలామణి అవుతున్నప్పటికీ తామంతా క్రీయాశీలకపాత్ర పోషించకుండా ఉత్సవ విగ్రహాలుగా మారిపోతుండడాన్ని వీరే వ్యతిరేకిస్తున్నారు. ఏళ్ల నుంచి తమకు సరియైున విధులు అప్పగించాలని, అభివృద్ది పనులకు సంబంధించిన నిధులను సైతం కేటాయించాలంటూ ఎంపీటీసీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. రెండు, మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ప్రజాప్రతినిధుల రూపంలో తాము ఎంపీటీసీలుగా గెలుపొందుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు, విధులు, అధికారాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించకపోవడం పట్ల వీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ప్రభుత్వానికి తమ గోడును వెల్లబోసుకున్నప్పటికీ స్పందన కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనైనా తమకు క్రీయాశీలక ప్రాతినిధ్యం లభించవచ్చని వీరు ఆశించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు వారి ప్రాధాన్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. కేవలం మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికతో పాటు ఎంపీపీ సమావేశాలకు మాత్రమే వీరు పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా తమ పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఒక్క నయాపైసా కూడా తమకు కేటాయించకపోవడం ఏ మేరకు సమంజసం అంటూ ఎంపీటీసీలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘాలకు సంబంధించిన నిధులతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కింద కేటాయిస్తున్న నిధుల వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదంటూ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 567 మంది ఎంపీటీసీలు సభ్యులు తమ హక్కుల సాధన కోసం యేళ్ల నుంచి గళమెత్తుతున్నారు. ఇలా వీరంతా అనేక సమావేశాల్లో గొంతెత్తి ఆలిసి పోయారు. అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం కనికరించకుండా తన కాఠిన్యాన్ని ప్రదర్శించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు మరోసారి తమకు సంబంధించిన నిధులు, విధులతో పాటు అధికారాలపై బహిరంగంగా గళమెత్తి రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు చెందిన 567 మంది ఎంపీటీసీ సభ్యులు మంగళవారం నిర్మల్ జిల్లాకేంద్రంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తామంతా ఏకతాటిపై ఉన్నా మన్న సంకేతంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినదించబోతున్నారు. నిర్మల్‌వేదికగా భవిష్యత్ కోసం చేపట్టబోయే కార్యాచరణను రూపొందించనున్నారు. దశల వారి ఉద్యమబాటకు నిర్మల్‌లో రూపురేఖలు దిద్దనున్నారు.
ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు
కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంపీటీసీ సభ్యులు తమకు సంబంధించిన నిధులు, విధుల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ ఆధారంగా దక్కాల్సిన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణలో భాగంగా 29 అంశాలకు సంబంధించిన అధికారాలను తమకు బదలాయించాలంటూ ఎంపీటీసీ సభ్యు లు కోరుతున్నారు. ముఖ్యంగా ఎంపీటీసీ సభ్యులకు తమ ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధి పనులకు సంబందించి ప్రత్యేకంగా రూ.10లక్షలను కేటాయించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి సర్పంచ్‌లతో పాటు తమకు సంపూర్ణాధికారాలు కల్పించి నిధులు, విధుల విషయంలో ప్రాతినిధ్యం కల్పించాలని వారు నినధిస్తున్నారు. అలాగే మండల స్థాయిలో ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీల్లో, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో, జిల్లా ప్రణాళిక సంఘం కార్యవర్గంలో తమకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేట్‌ఫైనాన్స్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నట్లుగానే ఎంపీటీసీలకు కూడా కేటాయించాలంటున్నారు. అలాగే ఎంపీటీసీ గౌరవ వేతనాన్ని రూ. 5వేల నుంచి రూ. 15వేలకు పెంచాలని, తమకు ఇతర అలవెన్స్‌లు దక్కే విధంగా చూడాలంటున్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీలందరికీ క్రీయాశీలక పాత్ర కల్పించాలని వారు కోరుతున్నారు.
ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం
నిర్మల్‌లో నిర్వహించబోతున్న ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపీటీసీల చైతన్యసదస్సు ద్వారా ఉద్యమ కార్యాచరణను శ్రీకారం చుట్టబోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తమ వేదన అంతా అరణ్యరోదనగానే మారుతోందని, ఇప్పటికే ఎన్నోసార్లు తమ సమస్యలను సర్కారు దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మూడు, నాలుగు గ్రామపంచాయతీలకు కలిపి ఎంపీటీసీల ప్రాదేశిక నియోజకవర్గం ఉంటున్నప్పటికీ తమకు నిధులు, విధుల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లభించడం లేదంటూ వారు వాపోతున్నారు. గ్రామసర్పంచ్ స్థాయికి కూడా తాము పనికి రాకుండా పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి పరిపాలన వ్యవస్థలో కీలకంగా వ్యవహరించాల్సిన తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులకు గ్రామపంచాయతీల్లో కూడా గౌరవమర్యాదలు లభించడం లేదని పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఇక సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఎంపీటీసీలంతా లడాయి కట్టేందుకు సిద్ధమవుతున్నారు.
నేడు నిర్మల్‌లో చైతన్యసదస్సు..
ఇదిలాఉండగా రాజకీయ కేంద్రంగానూ, రాష్ట్ర మంత్రివర్గంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇలాకా అయిన నిర్మల్‌ను ఎంపీటీసీలు లక్ష్యంగా చేసుకొని ఇక్కడే ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంను నిర్వహించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 567 మంది ఎంపీటీసీ సభ్యులుండగా ఆదిలాబాద్ జిల్లాలో 158 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 123, నిర్మల్ జిల్లాలో 156 మంది, మంచిర్యాల జిల్లాలో 130 మంది ఎంపీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా ఓ సారి ఎంపీటీసీల సమావేశం నిర్మల్‌లోనే జరిగింది. అయితే ఈ సారి గతానికి భిన్నంగా నిర్మల్‌లో ఎంపీటీసీలు ఏర్పాటు చేస్తున్న చైతన్యసదస్సు ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వేదిక కాబోతోందంటున్నారు. ఇక్కడి సమావేశంలో తీర్మానించే అంశాలను సర్కారుకు నివేదించి ఆ తరువాత దశల వారీగా ఆందోళనలు చేపట్టేందుకు ఎంపీటీసీలు నిర్మల్ అడ్డాగా ఏకం కాబోతున్నారు.