కంది పైసలేవీ?

ABN , First Publish Date - 2020-04-14T12:26:46+05:30 IST

ఆరు గాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినా పైసలందక పోవ డంతో

కంది పైసలేవీ?

నెలలు గడుస్తున్నా చేతికందని కంది పంట డబ్బులు

జిల్లాలో రూ. వంద కోట్లకు పైనే బకాయిలు

లాక్‌డౌన్‌ ఆంక్షలతో అల్లాడుతున్న అన్నదాతలు

ముంచుకొస్తున్న ఖరీఫ్‌ సమయం

పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఆరు గాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినా పైసలందక పోవ డంతో రైతులు పస్తులుండే పరిస్థితులు ఏర్పడు తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిపడిన కరోనా దెబ్బ కు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదిగో.. అదిగో అంటూ నెలలు గడుపుతున్న అధికారులు రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేయడం లేదు. జిల్లాలో ఈ యేడు 28వేల హెక్టార్లలో కంది పంట సాగయ్యింది. దీంతో 2లక్షల 10వేల క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ 2లక్షల 16వేల 655 క్వింటాళ్ల కందు లను మార్క్‌ఫెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 19వేల 145 మంది రైతుల నుంచి  కంది పంటను సేకరించారు. దీనికి గాను రూ.125కోట్ల 65లక్షల 99వేలను జిల్లా రైతు లకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు  రూ.25కోట్లను మాత్రమే చెల్లించిన మార్క్‌ఫెడ్‌ అధికారులు రూ.100కోట్లకు పైగానే కంది డబ్బుల ను  చెల్లించాల్సి ఉంది.


ఖరీఫ్‌ సీజన్‌లో పండించే పంటల్లో పత్తి, కంది పంటలే ప్రధానమైనవి. ప్రస్తుతం శనగ కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో నెలల తరబడి మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ రైతులు చక్కర్లు కొడుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారికి ఫోన్‌ చేస్తే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై ‘ఆంధ్ర జ్యోతి’ మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారి పుల్లయ్యను సంప్రదించగా ఆయన స్పందించ లేదు.


లాక్‌డౌన్‌ కష్టాలు..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో రైతులు అల్లాడుతున్నారు. పంట అమ్మినా పైసలు రాక పోవడంతో దిక్కులు చూస్తు న్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నిత్యావసర సరుకులను కొనుగోలు చేద్దా మన్న చేతిలో చిల్లిగవ్వ లేదని ఆందోళనకు గురవు తున్నారు. జిల్లాలో ఉగాది పండుగకు కొత్త కౌలు ప్రారంభమవుతుంది. అలాగే తీసుకున్న కౌలు డబ్బులు భూయజమానికి చెల్లిం చాల్సి ఉంటుంది. అయితే కుటుంబమంతా ఇంటికే పరిమి తం కావడంతో అత్యావసర పనులను వాయిదా వేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 


ముంచుకొస్తున్న ఖరీఫ్‌..

ఖరీఫ్‌ కాలం ముంచుకొస్తున్నా పంట డబ్బులు అందక పోవడంతో రైతులు ఆగమవుతున్నారు. వచ్చే ఖరీఫ్‌కు పంట భూములను చదును చేసుకోవడం, ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయడం లాంటి పనులు సమీపిస్తున్నాయి. ఇంత వరకు కౌలు డబ్బులు చెల్లించక పోవడంతో భూ యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పంట కోత, నూర్పిడి, మార్కె ట్‌కు తరలించిన యంత్రాల అద్దెలు చెల్లించలేని పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఖరీఫ్‌లో ఉద్దెరపై తీసుకున్న రసాయన ఎరువుల బాకీలు సకాలంలో చెల్లిస్తేనే తిరిగి ఫర్టిలైజర్‌ యజమానులు ఖరీఫ్‌కు అవసరమైన మందులను సరఫరా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్‌ సంబంధించిన పంట డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసే పరిస్థి తులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.


ఎప్పుడొస్తాయో చెప్పడం లేదు : జమీరుల్లా, రైతు, పిప్పల్‌కోటి

నాకున్న రెండు ఎకరాల భూమిలో కందులను పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మి రెండు నెలలు అయితంది. ఇప్పటి వరకు పంట డబ్బులు జమ కావడం లేదు. అధికారులను అడిగితే పైసలు ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు. అసలే కరోనాతో అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ భారమవుతోంది. ఏమి తినాలో అర్థం కావడం లేదు.  కొంత తక్కువైనా దళారులకు అమ్ముకొని ఉంటేనే ఇప్పటి వరకు నగదు చేతికి వచ్చేది.

Updated Date - 2020-04-14T12:26:46+05:30 IST