చి’వరి’కి సిరి

ABN , First Publish Date - 2020-02-12T12:17:10+05:30 IST

ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు ఈ యేడు నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. రైతుల వద్ద ఉన్న ఽధాన్యం మిల్లుల్లోకి చేరిన 20 రోజులకే

చి’వరి’కి సిరి

  • రైతులు అమ్ముకున్నాక పెరిగిన  ధాన్యం ధరలు
  • వ్యాపారులు...మిల్లర్లకు కాసుల వర్షం
  • దొడ్డు రకాలకే ప్రభుత్వ మద్దతు ధర
  • సన్నాలకు అందని గిట్టుబాటు
  • క్వింటాలుకు రూ. 400లు నష్టపోయిన రైతులు
  • నిల్వ చేసుకొని రుణం పొందడంపై అవగాహన కరువు


నెన్నెల, ఫిబ్రవరి 11: ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు ఈ యేడు నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. రైతుల వద్ద ఉన్న ఽధాన్యం మిల్లుల్లోకి చేరిన 20 రోజులకే ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల వ్యవధిలో వరి ధాన్యం ధర క్వింటాలుకు రూ.400 వరకు పెరిగింది. దీంతో వ్యాపారులు, మిల్లర్ల ’పంట’ పండింది. దొడ్డు రకాలను సాగు చేసిన  రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందారు. కాని 70 శాతం మంది సాగు చేసిన సన్నాలకే గిట్టుబాటు లభించలేదు.  కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను తిరస్కరించడంతో వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోయారు. ఇప్పుడు పెరుగుతున్న ధాన్యం ధరలు చూసి నిరాశ చెందుతున్నారు. ధర లేనప్పుడు ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకొని ప్రభుత్వం నుంచి రుణం పొందే అవకాశం ఉన్నప్పటికి అవగాహన లోపంతో రైతులు గిడ్డంగులను వాడుకోక నష్టపోతున్నారు. 


మార్కెట్‌ మాయ..

ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి, అష్టకష్టాలు పడి పంట పండించిన రైతులకు మేలు జరగాలంటే పండించిన ప్రతి గింజకు గిట్టబాటు ధర లభించాలి. కాని మార్కెట్‌ మాయాజాలంలో రైతన్న దగా పడుతున్నాడు. యేటా ధాన్యం రైతు గడప  దాటినాక సీజన్‌ ముగింపులో ధరలకు రెక్కలొస్తున్నాయి. వరి పండించిన రైతులు 90 శాతం అమ్ముకున్నాక ధరలు పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో ధాన్యం ధర క్వింటాలుకు రూ.400 వరకు పెరిగింది. మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నెల రోజులకు డబ్బుల చెల్లింపు ఒప్పందంతో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయగా పంట పైసలు రైతన్న చేతిలో పడక ముందే ధరలు పెరగడంతో రైతులు బాధపడిపోతున్నారు. వ్యాపారులకు ఉద్దెర ఇవ్వడం కంటే ఇళ్లల్లో ఓ పక్షం రోజులు నిల్వచేసుకుంటే మంచి ధర వచ్చేదని మదనపడుతున్నారు. వరి కోతల సమయంలో మబ్బులు కమ్ముకొని వర్షాలు కురియడంతో వేచి చూసే పరిస్థితి లేక వచ్చిన ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది.  వాన భయాన్ని అడ్డుగా పెట్టుకొని వ్యాపారులు ధరలను భారీగా తగ్గించారు.  నెల రోజుల కిందట సూపర్‌ ఫైన్‌ రకాలైన జైశ్రీరాం, హెచ్‌ఎంటీలు క్వింటాలుకు రూ. 1700 మాత్రమే పలుకగా ప్రస్తుతం వాటి ధర రూ.2100 పలుకుతోంది. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని ముందుగానే పసిగట్టిన వ్యాపారులు, మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. రైసుమిల్లులు ధాన్యం బస్తాలతో నింపుకోవడంతోపాటు ఆరుబయట వేల సంఖ్యలో బస్తాలను నిల్వ చేసుకున్నారు. ఇప్పడు ధరలు పెరగడంతో వ్యాపారులు, మిల్లర్లు లక్షల రూపాయలు లాభపడ్డారు.


1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు

మంచిర్యాల జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో 70 శాతం సన్న రకాలనే సాగు చేశారు. పెట్టుబడి,  పంటకాలం ఎక్కువే అయినప్పటికి  డిమాండ్‌ దృష్ట్యా రైతులు సన్న రకాలను పండించేందుకు మొగ్గు చూపిస్తారు. బీపీటీ, హెచ్‌ఎంటీ, జగిత్యాల కల్చర్‌, తెలంగాణ సోన, లాంటి సన్నరకాలతోపాటు జైశ్రీరాం, శ్వేత, నర్మద, శ్రీరామ, కావేరిచింటు, శ్రీ101లాంటి సూపర్‌ఫైన్‌ రకాలను ఎక్కువగా సాగుచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాల ధాన్యం మాత్రమే తీసుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 126 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.17 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1835, బి గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1816 చెల్లించి కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఏడు ఖరీఫ్‌లో దాదాపు 4 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా అందులో నుంచి దొడ్డురకం ధాన్యం 1.17 లక్షల టన్నులకు మాత్రమే గిట్టుబాటు ధర లభించింది. మిగతా మొత్తం సన్నరకం ధాన్యాన్ని  ప్రభుత్వ గిట్టుబాటు ధర కంటే తక్కువకు అమ్ముకొని రైతులు నష్టపోయారు. సన్నాలు సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ. 300ల నుంచి 400ల వరకు నష్టపోయారు. 


నిల్వలపై రుణం పొందే అవకాశం

పంట చేతికొచ్చిన సమయంలో ధర లేనప్పుడు గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని రుణం పొందే సౌలభ్యం ఉంది. కాని అవగాహన లేమి, అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చిన సమయంలో వ్యాపారులు, మిల్లర్లు కుమ్ముక్కై ధరలు తగ్గించేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు నష్టపోకుండా మంచి ధర వచ్చే వరకు పంటను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. అవసరాల నిమిత్తం రైతులకు నిల్వ ఉంచిన ధాన్యంపై రూ. లక్ష వరకు గిడ్డంగుల సంస్థ నుంచి రుణం పొందేవీలుంది. దీనికి మూడు నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ తర్వాత నామమాత్రంగా పావలా వడ్డి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం పొందేందుకు రైతులు తమ భూ వివరాలు, పట్టాదారు పాసుపుస్తకం, తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రం దరాఖాస్తుతో జత చేయాల్సి ఉంటుంది. రైతు తన పేరును ఒకసారి నమోదు చేసుకుంటే మూడు సంవత్సరాల వరకు తమ ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. ధర వచ్చినప్పుడు ఽధాన్యాన్ని అమ్ముకోవచ్చు. రైతు నిల్వ ఉంచిన పంట విలువలో 75 శాతం రుణం (ఒక్కో రైతుకు రూ.లక్షకు మించకుండా) ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదిగేందుకు ఈ సౌలభ్యాన్ని కల్పించినప్పటికి అవగాహన లేక రైతులు ఉపయోగించుకోవడం లేదు. ధర లేనప్పుడు గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకోవడంపై ఽఅధికారులు అవగాహన కల్పిస్తే రైతులకు మంచి ధర లభిస్తుంది. 


అమ్ముకున్నాక ధర పెరిగింది

మంచార్ల పోశం, రైతు నెన్నెల

ఖరీఫ్‌లో యశోద రకం సన్నాలను సాగు చేశాను. అతి వృష్టి, కలుపు బెడద, చీడపీడల దాడి లాంటి ప్రతిబంధకాలు దాటుకొని 70 క్వింటాళ్ల దిగుబడి సాధించాను. తీరా అమ్ముదామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో తిరస్కరించారు. దొడ్డు రకాలను మాత్రమే తీసుకుంటామని చెప్పారు. క్వింటాలుకు రూ.1700లకు అమ్ముకున్నాను. నేను ధాన్యం అమ్ముకున్న 20 రోజులకే క్వింటాలుకు ధర రూ. 400లు పెరిగింది. 


రూ. 30 వేలు నష్టపోయాను 

దుర్గం లింగయ్య, చామనపల్లి, వేమనపల్లి మండలం

నాలుగు ఎకరాల్లో హెచ్‌ఎంటీ రకం వరి సాగు చేశారు. వరి కోతలయ్యాక ఽకోనే వారి కోసం 15 రోజులు ఎదురు చూశాను. ధాన్యం నాణ్యంగా ఉన్నప్పటికి వ్యాపారులు ధరను పూర్తిగా తగ్గించి అడిగారు. మిల్లుకు తీసుకెళితే ధర వస్తుందని భావించి బస్తాలను ట్రాక్టర్‌లో చెన్నూరుకు తీసుకెళ్లాను. అక్కడ క్వింటాలుకు రూ. 1750 చెల్లించారు. అదే ధాన్యాన్ని ఇప్పుడు అమ్ముకుంటే నాకు మరో   రూ. 30 వేలు అదనంగా వచ్చేవి. 


ధాన్యం నిల్వలపై రుణం ఇస్తారని తెలియదు

-పురంశెట్టి శ్రీనివాస్‌, నెన్నెల

పంటకు ధర లేనప్పుడు గోదాముల్లో నిల్వ చేసుకుని ధర పెరిగిన తరువాత అమ్ముకోవచ్చనే విషయం తెలియదు. ఆ నిల్వలపై రుణం తీసుకుంటే అవసరాలు తీరుతాయి. ధర పెరిగినప్పుడు అమ్ముకుంటే నష్టాల నుంచి గట్టెక్కవచ్చు.  గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు దక్కుతుంది.  

Updated Date - 2020-02-12T12:17:10+05:30 IST