రైతులకు సమయానికి నీరందేలా చూడాలి
ABN , First Publish Date - 2020-06-18T10:48:05+05:30 IST
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సరైన సమయానికి నీరు అందించేందుకు అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 17 : రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సరైన సమయానికి నీరు అందించేందుకు అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్లు, డీఆర్‌డీఏలు, ఉపాధిహామీ, నీటిపారుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడు తూ గ్రామాల్లో చిన్న,పెద్ద చెరువులతో పాటు వాటి అనుబంధ కాలువలలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, పూడికతీత తొలగించి రైతులకు ఆదాయం పెంపొందించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.
ఎక్కువ మంది కూలీలకు పని లభిస్తుందని, నీటి నిల్వ పెరగడంతో పాటు పల్లెల్లో పచ్చదనం, జీవ వైవిద్యం, మెరుగు పడుతుందనీ తెలిపారు. ఇందుకు స్బందిత శాఖల అదికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించి పనులు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలోని ఏఈ, ఏఈ ఈ, డిఈ, ఈ.ఈలకు ప్రణాళికకు సంబందించిన శిక్షణా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని అధికారుల సమన్వయంతో రైతులకు సరైన సమయానికి నీరు అందించేలా కృషిచేయాలని పేర్కొన్నారు.