వామ్మో లద్దెపురుగు
ABN , First Publish Date - 2020-10-03T10:28:10+05:30 IST
పత్తి చేలపై పొగాకు లద్దెపురుగు ముప్పేట దాడి చేస్తుంది. మాయదారి తెగులు చేలకు చేలనే మేసేసి పంటను నాశనం చేస్తుంది.
పత్తి పంటపై ముప్పేట దాడి
చేలను మేసేస్తున్న మహమ్మారి
ఆందోళనలో అన్నదాతలు
నెన్నెల, అక్టోబరు 2: పత్తి చేలపై పొగాకు లద్దెపురుగు ముప్పేట దాడి చేస్తుంది. మాయదారి తెగులు చేలకు చేలనే మేసేసి పంటను నాశనం చేస్తుంది. భారీ వర్షాలతో మొదట కాసిన కాయలన్ని నల్లబారి పోతుండగా మలిదశ పూత, కాతను దక్కించుకోవాలనుకున్న రైతన్నకు లద్దెపురుగు శాపంగా మారింది. పురుగు నివారణకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు స్ర్పే చేస్తున్నారు. లద్దెపురుగు ఉధృతితో పంట దిగుబడి, పత్తి నాణ్యతపై ప్రభావం పడుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పత్తి పంటలో పోగాకు లద్దెపురుగు ఉధృతి అధికంగా ఉందని వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చేలను పరిశీలిస్తూ రైతులకు సూచనలు చేస్తున్నారు.
జిల్లాలో 1,91,508 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు..
జిల్లాలో 1,91,508 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. పత్తి గింజలు పెట్టిన 70 నుంచి 90 రోజులకు పూత, కాత దశకు వస్తుంది. ఇలాంటి కీలక దశలో జిల్లాలోని అన్ని మండలాల్లో పొగాకు లద్దె పురుగు ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ పురుగు కనిపించిన ఒకటి రెండు రోజుల్లోనే చేనంతా వ్యాపించి పంటను నాశనం చేస్తుంది. ఆకులను మేసేసి జల్లెడలా మార్చేస్తుంది. పూతను, గూడను కొరికి పనికి రాకుండా చేస్తుంది. వారం రోజుల్లోనే చేను రూపురేఖలే మారిపోతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన చేలు కాస్తా చిల్లులు పడ్డ ఆకులు, నల్లబడ్డ కాయలు, ఎండిన చిగుళ్లతో కనబడుతున్నాయి. గతంతో ఎన్నడు లేని విధంగా పొగాకులద్దె పురుగు ఉధృతి ఈ ఏడాదే అధికంగా కనిపిస్తుందని రైతులంటున్నారు. గతంలో నవంబరు చివరి వారం, డిసెంబరులో ఈ పురుగు కనిపించేదని చెబుతున్నారు. అప్పట్లో ఒక సారి మందు పిచికారి చేస్తే సరిపోయేదని అంటున్నారు.
బీటీ పత్తిలో సాధారణంగా 90 రోజుల వరకు కాయతొలుచు పురుగును తట్టుకునే నిరోధక శక్తి ఉంటుంది. దీంతో 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత పురుగుల ఉనికి కనిపించేది. కాగా ఈ ఏడు 70-80 రోజుల వయసు పంటకే పురుగు రావడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత దశలో పురుగు సోకడంతో మరో ఒకటి, రెండు సార్లు అదనంగా మందులు స్ర్పే చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. మందులు పిచికారికి వాతావరణం అనుకూలించడం లేదు. ప్రతి రోజు వర్షాలు కురుస్తుండటంతో మందులు స్ర్పే చేసుకోలేక పోతున్నారు. మందు పిచికారి చేసిన రోజే వర్షం వస్తే ప్రభావం తగ్గి పురుగు చావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నివారణ చర్యలు ఆలస్యం కావడంతో మూడో దశకు చేరిన పురుగులు రసాయన మందులకు లొంగడం లేదు. దీంతో ఒకటికి రెండు సార్లు మందు పిచికారి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీదైన మందులను వాడడం, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
దిగుబడిపై తీవ్ర ప్రభావం
లద్దెపురుగుతో పాటు పత్తి పంటకు పచ్చదోమ, తెల్లదోమ, పండాకు తెగుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకుతుండటంతో ఈ ఏడు పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీజన్ ప్రారంభంలో వాతావరణం అనుకూలించడంతో పంట ఏపుగా పెరిగింది. తీరా పూత, కాత సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. ముందగా కాసిన కాయలన్ని నల్లబరుతున్నాయి. వాటిలో పత్తి బూజుపట్టి రంగు మారి పనికి రాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. మలి దశ వచ్చే పూత కాతపైనే ఆశలు పెట్టుకున్నారు. లద్దెపురుగు ఉధృతితో ఇవి కూడా దక్కకుండా పోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎకరానికి పది నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ఈ యేడు ప్రతికూల వాతావరణం, చీడపీడల ఉధృతితో దిగుబడి సగానికి పడిపోయేలా ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పురుగు ఉధృతి అధికంగా ఉంది..ముద్రకోల సదయ్య, రైతు, నెన్నెల
పత్తిలో పొగాకులద్దె పురుగు ఉధృతి అదికంగా ఉంది. పురుగులు ఆకులను మేసి జల్లెడలా మారుస్తున్నాయి. పూత, గూడ, కాయలను తినేస్తున్నాయి. మొదటి కాత వర్షానికి పోయింది. రెండో సారి వచ్చే పూత, కాతను దక్కించుకుందామంటే లద్దె పురుగు దాపురించింది. వారం రోజుల కిందట మందు స్ర్పే చేశాను. చిన్న పురుగులు మాత్రమే చనిపోయాయి. పెద్దవి బతికే ఉన్నాయి. మరోసారి మందు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. పురుగు మందులకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. అయినప్పటికీ పంట దిగుబడి తగ్గేలానే ఉంది.
నివారణ చర్యలు చేపట్టాలి..డాక్టర్ రాజేశ్వర్‌నాయక్, సీనియర్‌శాస్త్రవేత్త, బెల్లంపల్లి కృషి విజ్ఙానకేంద్రం కో ఆర్డినేటర్
లద్దెపురుగు ఉధృతి అధికంగా ఉన్నందున రైతులు నివారణ చర్యలు చేపట్టాలి. పోగాకు లద్దెపురుగు నివారణకు ముందుగా 5 శాతం వేపగింజల కశాయాన్ని పిచికారి చేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని పురుగు ఉధృతిని గమనించాలి. ఉధృతి అధికంగా ఉంటే రసాయణ మందులు వాడాలి. నొవాల్యూరాన్ 1 మిల్లీ లీటరు లేదా లెఫెన్యురాన్ 1.25 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజాయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగులు పొద్దంతా దాక్కొని ఉంటాయి కాబట్టి సాయంత్రం పూట స్ర్పే చేసుకుంటే మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. మూడో దశ దాటిన లద్దెపురుగును అదుపు చేసేందుకు విషపు ఎరను వాడాలి. ఎకరానికి పది కిలోల తవుడు, 2 కేజీల బెల్లంతో పాటు 1 లీటరు మోనోక్రోటోఫాస్‌లేదా 750 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 300 గ్రాముల థయోడికార్బ్ మందుకు సరిపడు నీటిని కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట చేనంతా చల్లాలి. ఆ ఉండలను పురుగులు తిని మృతి చెందుతాయి.