ప్రమాద ఘంటికలు..

ABN , First Publish Date - 2020-03-16T08:39:26+05:30 IST

వేసవిలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. 2018లో పట్టణంలోని 30 వార్డుల్లో తాగునీటిని సరఫరా చేసేందుకు స్థానిక పెద్దవాగు వద్ద కొత్త ఊట బావి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు.

ప్రమాద ఘంటికలు..

కాగజ్‌నగర్‌కు పొంచి ఉన్న తాగునీటి ముప్పు

కొత్త ఇంటేక్‌వెల్‌ నిర్మాణ ఆశలు ఆవిరి

పెద్దవాగు ఊట బావిలో పేరుకుపోయిన సిల్టు

ఎండల తీవ్రత పెరిగితే నీటికి తప్పని తిప్పలు


కాగజ్‌నగర్‌, మార్చి 15: వేసవిలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం   ఉంది. 2018లో పట్టణంలోని 30 వార్డుల్లో తాగునీటిని సరఫరా చేసేందుకు స్థానిక పెద్దవాగు వద్ద కొత్త ఊట బావి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అధికారులు సర్వే చేసి ఈప్రతిపాదనకు రూ.30 కోట్లు అవసరమవుతాయని  తేల్చారు. ఈ పనులకు టెండర్లు పిలిచినప్పటికీ సాంకేతిక కారణాలతో వీటిని రద్దు చేశారు. కొత్త ఊట బావి నిర్మిస్తే  కాగజ్‌నగర్‌లోని అన్ని వార్డులకు సరిపడా నీటిని అందిం చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కొత్త ఊట బావికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కొత్త ఊట బావి నిర్మాణంపై ఆశలు ఆవిరైనట్టు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.


కాగజ్‌నగర్‌ పట్టణానికి నీటి సరఫరా కోసం స్థానిక పెద్దవాగులోని ఊట బావి నుంచి కొన్ని సంవత్సరాలుగా పైపులైన్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. అతి పురాతన పైపులైన్‌ వ్యవస్థ ఉండడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతుండటంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 2015లో నేరుగా సీఎంను కలిసి సమస్యను వివరించారు. దీంతో ప్రత్యేక ప్యాకేజీ కింద సీఎం రూ.8.50 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులు కూడా పబ్లిక్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో పనులు పూర్తి అయ్యాయి. మోటార్ల బిగింపులోనే 60 హెచ్‌పీ మోటారు వ్యవస్థకు బదులు ఏకంగా 180హెచ్‌పీ మోటారును బిగించారు. ఈ మోటారు సామర్థ్యం 100 కిలోమీటర్ల మేర నీటిని సరఫరా చేసేంతా వీలు ఉంటుంది. కాగజ్‌నగర్‌ పెద్దవాగు నుంచి పట్టణం ఆరు కిలోమీటర్లు ఉంటుంది. 60 హెచ్‌పీ మోటార్లుతో చక్కటి వినియోగం ఉండే అవకాశాలుండగా 180 హెచ్‌పీ మోటారు పెట్టడంతో ఎక్కడ లేని సమస్యలు వచ్చాయి. ప్రధానంగా ఊట బావిలో చేరిన నీరంతా కేవలం అర గంటలోనే 180 హెచ్‌పీ మోటారు ద్వారా ఖాళీ అవుతోంది. మళ్లీ నీరు ఊటలోకి రావడానికి ఒక్క రోజు పట్టే అవకాశాలున్నాయి. దీంతో కొత్త మోటారు బిగించినా కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. 


ప్రస్తుతం తాగేందుకు కాగజ్‌నగర్‌ పెద్దవాగు నుంచి నీటిని కేవలం పట్టణంలోని బాలాజీనగర్‌, మార్కెట్‌ఏరియాలో పలు కాలనీకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ కుమరం భీం అడ ప్రాజెక్టు నుంచి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నేరుగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌ పహాడ్‌, స్థానిక ఈస్‌ఐ ఆసుపత్రి వద్ద ఉన్న ట్యాంకుల్లో నీటిని తెచ్చి సరఫరా చేయిస్తున్నారు. ఈ రెండు ట్యాంకుల ద్వారా కాగజ్‌నగర్‌ పట్టణంలోని వార్డునం.1, 2, 3, 4, 5, 6, 7తో పాటు ఈఎస్‌ఐ కాలనీ, శ్రీనగర్‌ కాలనీలకు నీరు సరఫరా అందుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 


ఊట బావిలో పేరుకుపోయిన సిల్టు

ప్రస్తుతం సరఫరా చేస్తున్న వాటర్‌గ్రిడ్‌లో తాగునీటి సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెద్దవాగు ట్యాంకు పట్టణానికి పూర్తి స్థాయిలో సరఫరా చేసే అవకాశాలు ఏ కోశాన లేవు. ప్రస్తుతం పెద్దవాగు పూర్తిగా ఇసుకతో నిండిపోయింది. సిల్టు, ఇసుకను తొలగించాలంటే కనీసం రూ.50 లక్షలు మేర అవసరం ఉంటుంది. ఇందుకు అయ్యే నిధులు, తదితర అంశాలపై మున్సిపల్‌ అధికారులు నివేదికలను రూపొందించారు. కొత్త ఊట బావికి నిధులు రాక పోవటంతో, పెద్దవాగులో ఉన్న ఊట బావికి ఇసుక, సిల్టు తొలగించేందుకు ప్రత్యేక నిధుల కోసం అంతా వేచి చూస్తున్నారు.


ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి... అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌ 

ఎండకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అడ ప్రాజెక్టు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా పట్టణానికి నీరు సరఫరా అవుతోంది. ఒకవేళ సాంకేతిక సమస్యలు ఏర్పడితే తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయి. అధికారులు ముందస్తుగా స్పందించి త్వరితగతిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. 


తాగు నీటి సమస్య లేకుండా చూడాలి... సిడాం గణపతి, మాజీ జడ్పీ ఛైర్మన్‌, కాగజ్‌నగర్‌ 

ఎండలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధికారులు ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్‌, మే మాసాల్లో పరిస్థితి ఊహించుకుంటే భయంగా ఉంది. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.


నిధుల కోసం నిరీక్షణ... తిరుపతి, కమిషనర్‌, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌లో కొత్త ఊట బావి కోసం సర్వేలు చేపట్టాం. ప్రస్తుతం ఉన్న బావిలో ఇసుక, సిల్టు పేరుకు పోయింది. దీంతో పంపింగ్‌లో చిన్నపాటి సమస్యలు వస్తున్నాయి. ఇసుక, సిల్టు తొలగించేందుకు ప్రత్యేక నిపుణులు రావాల్సి ఉంటుంది. ఇందుకు ఖర్చు రూ.50 లక్షలు అవుతుంది. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. 

Updated Date - 2020-03-16T08:39:26+05:30 IST