మురికి నీరు తాగేదెలా...!

ABN , First Publish Date - 2020-06-21T10:34:26+05:30 IST

మంచిర్యాల మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు బురదమయంగా ఉంటోంది.

మురికి నీరు తాగేదెలా...!

మున్సిపాలిటీ నల్లాల ద్వారా బురద నీరు సరఫరా

తాగేందుకు జంకుతున్న ప్రజలు

మినరల్‌ వాటర్‌ వైపు పరుగులు

శుద్ది చేయకుండానే సరఫరా


మంచిర్యాల టౌన్‌, జూన్‌ 20: మంచిర్యాల మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు బురదమయంగా ఉంటోంది. నీరు మురికిగా ఉండటంతోపాటు దుర్వాసన వస్తుండటంతో ప్రజలు మినరల్‌ వాటర్‌ ప్లాం ట్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. గోదావరి నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆరో పిస్తున్నారు.  రెండు రోజులకు ఒకసారి సరఫరా అయ్యే నీరు బురదగా ఉండడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండగా, మున్సిపాలిటీ నీరు తాగితే వ్యాధుల బారినపడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.


నీటి శుద్ధికి మంగళం...

హాజీపూర్‌ మండలంలోని గుడిపేట వద్ద ఉన్న ఎల్లం పల్లి ప్రాజెక్టు నుంచి ముల్కల్ల గ్రామ సమీపంలోగల పంప్‌ హౌస్‌ ద్వారా నీటిని శుద్ధి చేసి పట్టణ ప్రజలకు అందిస్తారు. అయితే ముల్కల్లలోని పంప్‌హౌస్‌ వద్ద నీటిశుద్ధి ప్రక్రియ సరిగ్గా జరుగక నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరే ట్యాంకుల ద్వారా సరఫరా అవుతున్నట్లు ప్రజ లు భావిస్తున్నారు.


నీరు దుర్వాసన రాకుండా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలి పి సరఫరా చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. తాగేందుకు కాదుకదా కనీస అవసరాలకు కూడా నీరు పనికి రాకుండా పోతోందని వాపోతున్నారు. బిందెల్లో పట్టిన నీరు మురికిగా వస్తుండటంతో పారబోస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. అసలే రెండు రోజులకు ఒకసారి సరఫరా అయ్యే మంచినీరు ఇలా మురికి ఉండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.


మినరల్‌ వాటర్‌ వైపు పరుగులు....

నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని వినియోగించేందుకు ఇష్టపడని ప్రజలు మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. రూ. 20లు వెచ్చించి రోజూ ఒక  క్యాన్‌ కొనుగోలు చేస్తున్నారు. మున్సిపాలిటీకి నెలసరి బిల్లు రూ.150 చెల్లిస్తుండగా, మినరల్‌ వాటర్‌ బిల్లు అదనంగా భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. కొద్ది రోజులుగా నల్లాల నుంచి మురికి నీరు వస్తున్నా పాలకవర్గం, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అవసరాన్ని బలహీనంగా తీసుకుంటున్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  


మంచినీరు కొనాల్సి వస్తోంది....ఆది భాగ్యలక్ష్మి, హనుమాన్‌ నగర్‌

తాగు నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్లంపల్లి నుంచి నేరుగా ట్యాంకులకు నీరు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. నీటి నుంచి దుర్వాసన వస్తుండటంతో మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేస్తున్నాం. 


తాగునీటికి ఇబ్బందులు....శ్యామల, హనుమాన్‌ నగర్‌

తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపాలిటీ నల్లాల నుంచి బురద నీరే సరఫరా అవుతోంది. వేడి చేసి, చల్లార్చినా రంగు మారిన నీటిని తాగలేక పోతున్నాం.  


శుద్ధి చేస్తున్నాం.....ఎస్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌

నీటిని శుద్ధి చేశాకనే ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తు న్నాం. పగిలిన పైపులైన్లకు చేపడుతున్న మరమ్మతుల కారణంగా తొలుత కొంత మురికి నీరు వస్తోంది. కొద్ది సేపటి తరువాత మంచినీరే సరఫరా అవుతోంది. సమస్య ఉన్నచోట ప్రజలు దృష్టికి తీసుకు వస్తే తక్షణమే అవసరమైన చర్యలు చేపడతాం. 

Updated Date - 2020-06-21T10:34:26+05:30 IST