అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

ABN , First Publish Date - 2020-03-16T08:36:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం బెల్లంపల్లిలో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా  డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

మందుబాబులు, ఇతర కార్యకలాపాలకు నిలయం

పట్టించుకోని పాలకులు, కాంట్రాక్టర్‌ 


బెల్లంపల్లి, మార్చి 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం బెల్లంపల్లిలో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. కొన్ని నిర్మాణాలు గోడల వరకు పూర్తయ్యాయి. ఈ గదుల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణ పరిసర ప్రాంతాలతోపాటు నిర్మాణంలో ఉన్న ఇండ్లను అడ్డాగా చేసుకుని  మద్యం సేవిస్తున్నారు.  బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి పక్కన 160 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించి రూ. 9.68 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో 2017 మే 5న మంత్రి కేటీఆర్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే ఇండ్లను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ముడి సరుకుల ధరలు పెరగడంతో కాంట్రాక్టర్‌ పనులను మందకొడిగా సాగిస్తున్నాడు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పలు వాహనాల డ్రైవర్లతో ఇతర గ్రామాలకు వెళ్లే కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నారు.


కొన్ని నిర్మాణాలు చివరి దశలో ఉండడంతో ఆ రూముల్లో ఎవరికి కనబడకుండా ఉండే అవకాశం ఉంది. దీంతో మద్యంతోపాటు మహిళలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు లారీ డ్రైవర్లకు ఈ ఇండ్లు అడ్డాగా మారాయి. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు, కండోమ్‌లు దర్శనమిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లో సైతం ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లే కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్‌తోపాటు నాయకులు, పోలీసులు పట్టించుకొని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-03-16T08:36:27+05:30 IST