రాజధానిలో జిల్లా నేతలు

ABN , First Publish Date - 2020-11-27T04:01:06+05:30 IST

జిల్లా నేతలంతా గ్రేటర్‌ బాట పట్టడంతో జిల్లా రాజకీయ వాతావరణం గప్‌చుప్‌గా మారింది. నేతల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంతో అధికార వర్గాల్లో హడావిడి కనిపించడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత అందరి దృష్టి గ్రేటర్‌ ఎన్నికల పైనే పడింది. బీజేపీ గెలుపుతో ఆ పార్టీ నేతలు మరింత జోష్‌గా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేపడుతున్నారు.

రాజధానిలో జిల్లా నేతలు

అధికార, ప్రతిపక్ష నేతలంతా రాజధానిలోనే మకాం

అభివృద్ధి కార్యక్రమాల్లో ద్వితీయ స్థాయి నేతల బిజీ

అంతటా గ్రేటర్‌ ఎన్నికల పైనే విస్తృత చర్చ

జిల్లాలో రాజకీయ హడావిడికి తాత్కాలిక బ్రేక్‌

ఆదిలాబాద్‌, నవంబరు26 (ఆంధ్రజ్యోతి): జిల్లా నేతలంతా గ్రేటర్‌ బాట పట్టడంతో జిల్లా రాజకీయ వాతావరణం గప్‌చుప్‌గా మారింది. నేతల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంతో అధికార వర్గాల్లో హడావిడి కనిపించడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత అందరి దృష్టి గ్రేటర్‌ ఎన్నికల పైనే పడింది. బీజేపీ గెలుపుతో ఆ పార్టీ నేతలు మరింత జోష్‌గా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేపడుతున్నారు. అధికార పార్టీ నేతల్లో కొంత నిరుత్సాహమే కనిపిస్తున్నా గ్రేటర్‌ గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారానికి మరో రెండు మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా మారి పోయారు. జిల్లా నుంచి దాదాపుగా వెయ్యి మందికి పైగానే అధికార ప్రతిపక్ష నేతలు హైదరాబాద్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. ఎలాగైనా జీహెచ్‌ఎంసీపై తమ పార్టీ జెండా ఎగురవేయాలన్న పట్టుతో నేతలంతా పనిచేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, మాజీ ఎంపీ గోడం నగేష్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, పలువురు కార్యకర్తలు తరలి వెళ్లగా బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపూరావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, సుహాసినిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గండ్రత్‌ సుజాత, సాజిద్‌ఖాన్‌, పలువురు ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్లారు. అధిష్ఠానం పెద్దల ఆదేశాలతో డివిజన్ల ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న నేతలంతా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఎన్నికల్లో జిల్లా నేతలు ఏ మేరకు రాణిస్తారోనన్న టాక్‌ వినిపిస్తోంది.

గ్రామ స్థాయి నేతలే వీఐపీలు..

జిల్లాకు చెందిన బడా నేతలంతా గ్రేటర్‌ బాట పట్టడంతో ద్వితీయ స్థాయి నేతలు బిజీబిజీగా మారిపోయారు. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో మన్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌లు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నారు. గ్రామ స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తు న్నారు. ముఖ్యంగా అంగన్‌ వాడీ భవనాల నిర్మాణానికి భూమిపూజ, రోడ్డు, డ్రైనేజి, పల్లె ప్రకృతి వనాలు లాంటి పనులను చేపడుతున్నారు. బోథ్‌ నియోజక వర్గంలో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలే ప్రస్తుతం వీఐపీలుగా మారిపో యారు. ఏదైనా కార్యక్రమానికి వారే హాజరవుతున్నారు. నిత్యం ఎమ్మెల్యేలతో ఫోన్‌లో టచ్‌లో ఉంటూ అవసరమైన పనులను చేపడుతున్నారు.

గ్రేటర్‌ వైపే అందరి చూపు..

దుబ్బాక ఉప ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఆ వెంటనే గ్రేటర్‌ ఎన్నికలు రావడంతో అందరి చూపు అటువైపే అన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని పార్టీలలో గ్రేటర్‌ ఎన్నికల ముచ్చటనే ప్రధానంగా వినిపిస్తుంది. తమ తమ నేతలకు తరచూ ఫోన్‌లు చేస్తూ గ్రేటర్‌ ఎన్నికల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. పార్టీల వారీగా పరిస్థితి ఎలా ఉందంటూ గెలుపు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి నుంచే జిల్లాలో గ్రేటర్‌ పీఠం ఎవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. దుబ్బాక ప్రభావంతో గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ గెలువక పోయిన బలపడే అవకాశాలు ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సోషల్‌ మీడియా, ఎలక్ర్టానిక్‌ మీడియా, వార్త పత్రికల్లో ప్రచురిత మవుతున్న వార్త కథనాలను ఆసక్తిగా పరిశీలిస్తూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు.   

తగ్గిన తాకిడి..

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా నేతల ఇళ్లకు జనం తాకిడి పూర్తిగా తగ్గింది. వచ్చే నెల 1వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌తో నేతలంతా బిజీబిజీగా మారిపోయారు. కనీసం ఫోన్‌లోనైనా మాట్లాడేందుకు సమయం కేటాయించడం లేదని అన్ని పార్టీల కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, మరి కొంత మంది ముఖ్య నేతలు స్థానికంగా లేక పోవడంతో కార్యకర్తలకు ఎదురు చూపులు తప్పడం లేదు. అధికారిక కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగడంతో రాజకీయ హంగామా కనిపించడం లేదు. పెళ్లిళ్లు, పరామర్శలు, ప్రెస్‌మీట్లకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఇన్నాళ్లు కల్యాణలక్ష్మి అక్రమాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలంతా గ్రేటర్‌ బాట పట్టడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా సైలెంటై పోయాయి.

Updated Date - 2020-11-27T04:01:06+05:30 IST