అభివృద్ధి పనులకు అటవీ అనుమతుల కొర్రీ

ABN , First Publish Date - 2020-10-03T10:29:55+05:30 IST

ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు రాక ముందుకు సాగడం లేదు.

అభివృద్ధి పనులకు అటవీ అనుమతుల కొర్రీ

ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేక ఏజెన్సీ వాసుల ఇక్కట్లు

జిల్లాలో తాజాగా రూ.100కోట్లతో ఎల్‌డబ్ల్యూఈ పనులకు టెండర్‌

ఇందులో 80శాతం పనులు అటవీ ప్రాంతంలోనే 

అనుమతులు వచ్చేది అనుమానమే అంటున్న అధికారులు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు రాక ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే జిల్లాలోని 90 శాతం భూభాగం అటవీ ప్రాంతంతోనే కూడుకొని ఉండడంతో మౌలిక వసతుల కల్పనకు అటవీ, పర్యావరణ అనుమతులు గుదిబండలా మారాయి. దాంతో మారుమూల గ్రామాలకు రహదారుల సౌకర్యం అందని ద్రాక్షగా మారుతోంది. అటు మైదాన ప్రాంతమైనప్పటికీ అటవీ భూభాగం పరిధిలోకి వస్తుందన్న సాకుతో ఆ శాఖ అధికారులు అభివృద్ధి పనులకు బ్రేకులు వేస్తుండడంతో జిల్లాలో ప్రభుత్వ విభాగాల మధ్య ఘర్షణ పూరిత వాతవారణం ఉత్పన్నమైంది. అంతేకాదు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపానికి తోడు జిల్లా ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి.


జిల్లాలో ఇప్పటికీ 450కి పైగా ఆవాసాలకు కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. 2016-17 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు జిల్లాలో కనీస మౌలిక సదుపాయాల కోసం అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రాధాన్యతాపరంగా గుర్తించిన దాదాపు 100 పనులకు అధికారులు డీపీఆర్‌లను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు లేని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని గ్రామాలకు ప్రభుత్వం రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇందులో పీఎంజీఎస్‌వై, డీఎంఎఫ్‌టీ, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద పనులు మంజూరయ్యాయి. అయితే జిల్లాకు మంజూరైన ఈ పనుల్లో 80 శాతం అటవీ ప్రాంతంలోనే ఉండడంతో ఆ శాఖ అధికారులు నిర్మాణ పనులకు మోకాలడ్డారు. 


పెండింగ్‌ పనులకు మోక్షమెప్పుడో?

తాజాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.90కోట్లతో 30 పనులకు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఈ టెండర్లు ఒప్పంద దశలో ఉన్నాయి. అయితే అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ పనుల నిర్వహణకు అటవీశాఖ అనుమతులు వస్తే తప్ప కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించే అవకాశం లేదు. ఇటీవల ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్‌ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. దాంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉండగానే కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అటవీశాఖ అధికారుల మధ్య వివాదం తలెత్తింది. ఫలితంగా ఎల్‌డబ్ల్యూఈ నిధులు కూడా కొరగాకుండా పోయే ప్రమాదం ఉన్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఉన్న బీటీ రోడ్లను కూడా పునర్‌ నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను అటవీశాఖ అధికారులు అడ్దుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కాగజ్‌నగర్‌ నుంచి పెంచికల్‌పేట వరకు ఉన్న బీటీ రోడ్డును జిల్లా కేంద్రానికి అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా డబుల్‌ రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. కానీ అటవీశాఖ అనుమతులు కావాలంటూ సంబంధిత అధికారులు పనులను అడ్దుకున్నారు.  మూడేళ్లుగా కనీస మరమ్మతులు లేక ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అటవీశాఖ కారణంగా పాత, కొత్త పనులన్నీ కలిపి దాదాపు 100కు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 


అనుమతులు రాక ఆగిన పనులు

అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబం ధించిన పలు పనులు ఆగిపోయాయి. ఇందులో ముఖ్యంగా పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి 17 పనులకు బ్రేక్‌ పడింది. దీంతో సుమారు 76.6 కిలోమీటర్ల నిడివి గల రూ.25 కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించి మొత్తం 52.77 కి.మీల ఎల్‌డబ్ల్యూఈ పనులకు అటవీ అనుమతులు రావాల్సి ఉంది. వీటితో పాటు చింతలమానేపల్లి మండలంలోని దిందా, బెజ్జూరు, సోమిని వంటి వాగులపై మొత్తం నాలుగు హైలెవల్‌ వంతెనల పనులు కూడా అటవీ అనుమతులు రాక ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2020-10-03T10:29:55+05:30 IST