ఢిల్లీ టు ఆదిలాబాద్
ABN , First Publish Date - 2020-04-07T10:45:04+05:30 IST
కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీ మీదుగా జిల్లాకు చేరింది. మొదట జిల్లాలో 73 మంది అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షలకు

జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు
బాధితుల్లో ఎక్కువ మంది యువకులే
వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠినమైన ఆంక్షలు
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా
ఆదిలాబాద్, ఏప్రిల్6 (ఆంధ్రజ్యోతి): కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీ మీదుగా జిల్లాకు చేరింది. మొదట జిల్లాలో 73 మంది అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షలకు పంపగా 48 మంది పరీక్షల్లో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మిగితా 25 మంది పరీక్షల రిపోర్టులపై ఉత్కంఠ కనిపిస్తుంది. పాజిటివ్ వచ్చిన 10 మందిలో ఆరుగురు జిల్లా కేంద్రానికి చెందిన వారుగా, ముగ్గురు నేరడిగొండ మండలం, మరొకరు ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
వీరంతా మర్కజ్ మత ప్రార్థన లకు వెళ్లి వచ్చిన వారేనని సమాచారం. ఢిల్లీ అలజడికి ముందు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఢిల్లీ వెళ్లి వచ్చిన యాత్రికుల రాకతో జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే వీరందరిని గాం ధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయి తే పాజిటివ్ వస్తేనే జిల్లా అధికారులు క్వారంటైన్ నుంచి ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. అప్పటి వరకు వారితో క్వారంటైన్‌లో కలిసి తిరిగిన వారికి కరోనా సోకే ప్రమాదం కనిపిస్తుంది. అధికారులు చెప్పినట్లు గానే ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు వెళ్తున్న అంద రిని ఒకే చోటికి తరలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితుల్లో ఎక్కువ మంది యువకులే..
జిల్లాలోని కరోనా బాధితుల్లో ఎక్కువగా యువకులే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన 10 పాజిటివ్ కేసుల్లో ఆరుగురు బాధితులు 40 సంవత్సరాల లోపు ఉండగా.. ఇద్దరికి 50 సంవత్సరాలు, మరో ఇద్దరికి 70 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు. యువకుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నా ఇప్పటి వరకు ఎక్కువ మంది యువకులే కరోనా బారిన పడడంపై ఆందోళన రేపుతోంది. లాక్‌డౌన్ విధించిన ఎక్కువ మంది యువకులే రోడ్ల పైకి వస్తున్నారు. అందుకే యువత కరోనా పట్ల అప్ర మత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కఠినమైన ఆంక్షలు..
ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ వచ్చిన వారి నివాస ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. మొదట 3కి.మీల పరిధిలోని ప్రాంతాలను క్షుణంగా పరిశీలిస్తు న్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరెవరిని కలసి ఉంటాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచిస్తున్నారు.
జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలోని ఖిల్లా, ఖానాపూర్, చోటా తలాబ్, బెల్లూరి, పంజేషా మహాల్, గాంధీచౌక్, బొక్కలగూడ ప్రాంతాలతో పాటు నేరడిగొండ మండల కేంద్రంలోని మథుర కాలనీ పోస్టాఫీస్ ప్రాంతాలు, ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామాన్ని నిషేధిత ప్రాంతాలుగా గుర్తిం చి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకాధికారులతో బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ బృందాలలో రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వైద్యాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా..
కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘాను సారిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి వివరాలు, పేర్లను వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ బాధితులను హేలన చేసినట్లు అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా న్విహించేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని, ఆ తర్వాత వ్యాపార దుకా ణాలు మూసి వేయాలని సూచిస్తున్నారు. మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఎస్పీ విష్ణు వారియర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.