దసరా జోష్
ABN , First Publish Date - 2020-10-28T11:32:32+05:30 IST
జిల్లాలో దసరా కిక్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే దాదాపు మూడింతలు మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారిశాఖ అధికారులు తెలిపారు

జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు
రూ.50 కోట్లకు పైగా తాగేసిన మందుబాబులు
గతేడాదితో పోల్చితే మూడింతలు ఆదాయం
మంచిర్యాల, అక్టోబరు 27: జిల్లాలో దసరా కిక్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే దాదాపు మూడింతలు మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారిశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 26వ తేదీ వరకు రూ.50.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది నాలుగు సర్కిళ్లలో రూ.15 కోట్ల 65 లక్షల 84వేల 120 విలువగల మద్యం అమ్మకాలు జరగగా, ఈ సంవత్సరం మూడింతలు అఽధిక ఆదా యం ప్రభుత్వానికి సమకూరింది. మంచిర్యాల సర్కి ల్ పరిధిలో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది ఇక్కడ ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) 10,008 కేసుల మద్యం అమ్మకాలు జరుగగా, ఈ సంవత్సరం ఏకంగా 23,937 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి.
బెల్లంపల్లి సర్కిల్ పరిధిలో గతేడాది దసరా సీజన్‌లో 8,753 కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగగా, ఈ సంవత్సరం 19,981 కేసుల అమ్మకాలు సాగాయి. చెన్నూర్ సర్కిల్ పరిధిలో గతేడాది 4,093 కేసులు అమ్మగా ఈ సంవత్సరం 8,062 కేసులు అమ్ముడయ్యాయి. లక్షెట్టిపేట సర్కిల్ పరిధిలో గత సంవత్సరం 3,320 కేసుల మద్యం అమ్మ కాలు జరుగగా ఈ ఏడాది 8,515 కేసులు అమ్ముడయ్యాయి. అలాగే బీర్ల అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి. మంచిర్యాల సర్కిల్ పరిధిలో గతేడాది 14,072 కేసుల అమ్మకాలు నమోదుకాగా ఈ సంవత్సరం 24,571 కేసులు అమ్ముడుపోయాయి. బెల్లంపల్లి సర్కిల్ పరిధిలో 9,698 కేసుల బీర్లు అమ్మకం కాగా ఈ ఏడాది 19,755 కేసులు అమ్ముడయ్యాయి. చెన్నూర్ సర్కిల్ పరిధిలో గత సంవత్సరం 2,965 కేసుల బీర్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 5,846 కేసులు, లక్షెట్టిపేట సర్కిల్‌లో గతేడాది 6,463 కేసుల బీర్లు విక్రయించగా ఈ సంవత్సరం 10,421 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.
యువతలో జోష్....
మద్యం అమ్మకాల్లో లిక్కర్‌తో సమానంగా బీర్ల అమ్మకాలు నమోదయ్యాయి. దసరా పండుగను పురస్కరించుకొని యువత బీర్లపై మక్కువ కనబర్చడంతో గతేడాదితో పోల్చితే దాదాపు రెట్టింపు అమ్మ కాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో గతేడాది 33,198 కేసుల బీర్ల విక్రయాలు జరుగగా, ఈ ఏడాది ఏకంగా 60,593 కేసులు అమ్ముడయ్యాయి. బీర్ల కొనుగోలు దార్లలో అధిక శాతం యువతే ఉన్నట్లు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని లిక్కర్ అమ్మకాల్లో సింహభాగం బ్రాండెడ్ మద్యం కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రూ. 50కోట్ల పై చిలుకు అమ్మకాలు....
అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగను ప్రజలు ఫుల్‌జోష్‌లో జరుపుకున్నారు. గతేడాది దసరా సమయంలో రూ.15 కోట్ల పై చిలుకు మద్యం అమ్మ కాలు నమోదుకాగా ఈ సంవత్సరం అంతకు మూడు రెట్లు అధికంగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో మొత్తం రూ.50 కోట్ల 50 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆది, సోమవారం రెండు రోజుల్లో రూ.4.50 కోట్ల అమ్మకాలు జరిగాయి. దసరా సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల్లోనే 4,243 కేసుల మద్యం విక్రయం జరుగగా, 5,879 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. జిల్లాలోని మంచిర్యాల సర్కిల్ పరిధిలో రూ.20.65 కోట్ల విక్రయాలు జరుగ్గా బెల్లం పల్లిలో రూ. 16.52 కోట్లు, లక్షెట్టిపేటలో రూ.7.5 కోట్లు, చెన్నూరులో రూ. 5.87 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.