భార్యాపిల్లలను కళ్లారా చూసి ఆస్పత్రికి వెళ్లా
ABN , First Publish Date - 2020-07-08T09:15:25+05:30 IST
‘‘కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి ఆస్పత్రికి వెళ్లాను. బతుకుతానో లేదో అనే అనుమానంతో మానసికంగా కుంగిపోయాను.

బ్యాంకు అకౌంట్.. బాకీల వివరాలు భార్యకు వివరించా
కరోనాను జయించి తిరిగొచ్చా..
స్థానికుల తీరు కలచివేసింది
హైదరాబాద్ సిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి ఆస్పత్రికి వెళ్లాను. బతుకుతానో లేదో అనే అనుమానంతో మానసికంగా కుంగిపోయాను. అయినా ధైర్యం తెచ్చుకుని అడుగులు వేశాను. ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో తల్లిని, భార్యను, ఆరేళ్ల పాపను, 15నెలల బాబును కళ్లారా చూసుకున్నాను. మళ్లీ వారిని చూస్తానో లేదో భగవంతుడికే తెలియాలని మనస్సులో ప్రార్థించుకున్నాను. ఎంతో బాధగా ఇంటి నుంచి వెళ్తున్న ఇలాంటి సందర్భం పగవాడికి కూడా రాకూడదని కోరుకున్నాను. నా బ్యాంకు ఖాతా వివరాలు... ఉద్యోగం చేస్తున్న సంస్థ పీఎఫ్ వివరాలు... రావాల్సిన బాకీలు... నేను బాకీ ఉన్న వ్యక్తుల వివరాలు... ఏటీఎం పిన్ నెంబర్, సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ అన్నీ నా భార్యకు ఇస్తున్నప్పుడు ఆమె కన్నీరు కార్చడం చూసి తట్టుకోలేకపోయాను. అయినా తప్పదని ఆస్పత్రిలో చేరాను. కానీ దేవుడు నాపై, నా కుటుంబంపై కరుణించాడు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చాను.
క్వారంటైన్ పూర్తి చేసి గత ఐదు రోజులుగా విధులకు హాజరవుతున్నాను. భౌతిక దూరం పాటిస్తూ కుటుంబీకులు, స్థానికులతో జాగ్రత్తగా ఉంటున్నాను.అయినా బస్తీ వాసులు మాత్రం మానసికంగా హింసించడం నన్ను ఎంతో కుంగదీసింది. ప్రపంచంలో కరోనా నుంచి కోలుకుంటున్న వ్యక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్న సమాజంలో మా బస్తీవాసులు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం జీర్ణించుకోలేక పోయాను.’’
అంబర్‌పేట ప్రాంతానికి చెందిన ప్రైవేటు సంస్థ ఉద్యోగి పరశురాం (పేరు మార్చాం) పాజిటివ్ నుంచి కోలుకున్న తర్వాత చెప్పిన మాటలు ఇవి.
ఆవహించిన భయం
కరోనా వ్యాప్తి గురించి నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట నిర్లక్ష్యం జరిగింది. గత నెల 6న డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి జ్వరంగా అనిపించింది. జ్వరమే కదా అని కాస్త నిర్లక్ష్యంగా ఓ మెడికల్ షాపునకు వెళ్లి పారాసిటమాల్ తెచ్చుకున్నాను. రాత్రయ్యేసరికి కాస్త తగ్గింది. మరుసటి రోజు డ్యూటీకి వెళ్లాను. సాయంత్రం ఆఫీసులో ఉన్నప్పుడే అలసట వచ్చి... ఒళ్లు వేడెక్కింది. అనుమానంతో ఇంటికి వచ్చాను. భార్యకు చెప్పి పక్క గదిలో బస ఏర్పాట్లు చేసుకున్నాను. ఇంట్లో వారందరితో భౌతిక దూరం పాటించాను.
ఉదయం కాస్త తగ్గినట్లు అనిపించి, అనుమానంతోనే మరుసటి రోజు ఆఫీసులో పరిస్థితిని వివరించగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని మా విభాగం హెడ్ సూచించారు. దాంతో జూన్ 8న ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాను. వివరాలు తీసుకుని టెస్టు నిర్వహించారు. ఒక్క రోజు చాలా టెన్షన్‌తో గడిపాను. మరుసటి రోజు పాజిటివ్ అనే సమాచారం అందింది. భయాందోళనలతో పాటు మరింత టెన్షన్‌కు లోనయ్యాను. ఇంట్లో చిన్న పిల్లలున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదమేనని భావించి ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
భారమైన గుండెతో...
ఇంటికి వెళ్లి కొంత సామాను సర్దుకున్నాను. నేను ఆస్పత్రికి వెళ్తూ గేటు వరకు వచ్చిన తల్లి, భార్యాపిల్లలను చూసుకుంటూ కన్నీరు ఆపుకుంటూ ఆటో డ్రైవర్‌కు కూడా వివరాలు చెప్పి.. ఎక్కడా ఆటోను టచ్ చేయకుండా ఫీవర్ ఆస్పత్రికి చేరుకున్నాను. మూడు నాలుగు గంటల పాటు ఫీవర్ ఆస్పత్రిలో వెయిట్ చేసిన తర్వాత నాతో పాటు మరో ఇద్దరు జూన్ 9న అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాము. ఆ రాత్రి ఫీవర్‌లోనూ... గాంధీలోనూ ఎక్కడా భోజనం ఇవ్వక పోవడంతో ఆకలితోనే నిద్రకు ఉపక్రమించాల్సి వచ్చింది.
మూడు రోజులు గాంధీలో
ఉదయం ఇడ్లీ, ఉప్మా లాంటి టిఫిన్.. మధ్యాహ్నం రైస్, కర్రీ, దాల్చాతో లంచ్. రాత్రికి రైస్, కర్రీ, దాల్చాతో కూడిన భోజనం ఇచ్చారు. మధ్యలో టీ, బిస్కెట్స్‌తో పాటు సాయంత్రం డ్రైఫ్రూట్స్ ప్యాకెట్స్‌తో పాటు రోజుకు మూడు మాత్రలు మూడు సార్లు వేసుకునేలా ఇచ్చారు. టిఫిన్, ఆహారంలో ఎక్కడా సమస్య లేదు. తొలి రోజు (జూన్ 10న) ఉదయం ఓ నర్సు వచ్చి రక్త నమూనా సేకరించారు. ఆ తర్వాత మూడు రోజులు (జూన్ 10, 11, 12) గాంధీలో ఉన్నాను. ఎప్పటికప్పుడు వైద్యులు వచ్చి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జూన్ 11న నా భార్యకు తీవ్ర జ్వరం వచ్చిందని తెలియడంతో భయపడ్డాను.
బావమరిదికి కాల్ చేసి వెంటనే మందులు చేరేలా ఏర్పాట్లు చేసి భార్యకు, పాపకు టెస్టులు చేయించుకోమన్నాను. వారికి నెగెటివ్ రావడంతో మనసు కాస్త కుదుట పడింది. జూన్ 11న ఓ వైద్యుడు వచ్చి ఇంటికి వెళ్తారా అని ప్రశ్నిస్తే.. చిన్నపిల్లలున్నారు సార్ అని సమాధానమిచ్చా. ఎట్టకేలకు జూన్ 12న డిశ్చార్జి చేయమని కోరగానే డిశ్చార్జి లెటర్ ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం బయటకు వచ్చి వైద్యులు రాసిచ్చిన మాత్రలు కొనుక్కుని 12గంటలకు బయలుదేరి ఆటోలో (భౌతిక దూరం పాటిస్తూనే) అంబర్‌పేటలో ఇంటికి చేరుకున్నాను.
స్థానికంగా నిరాశ
డిశ్చార్జి అయి వస్తుంటే ఇరుగు పొరుగు వారు ఆనందంగా పలకరిస్తారని భావించాను. కానీ నేను వస్తున్నట్టు సమాచారం అందగానే ఇరుగు పొరుగు వారు ఇంటి లోపలి నుంచి కొక్కెం పెట్టుకున్నారు. మరి కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అది చూసి చాలా బాధ అనిపించింది. భౌతిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ నన్ను చూడటానికే భయపడుతున్న వైనంతో మరింత కుంగిపోయాను. వైద్యుల సూచనల మేరకు జూన్ 25వరకు ఇంట్లోనే క్వారంటైన్ చేయాల్సి ఉన్నందున ఓ గదిని పరిమితం చేసుకున్నాను.
అదే రూంలో టీవీ, వ్యాయామ సామగ్రి తెచ్చుకున్నాను. గదికి ఉన్న ఓ కిటికీ తెరుచుకుని ఉంచుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు దాన్ని కూడా బంద్ చేయాలని డిమాండ్ చేయడం మరింత బాధ కలిగించింది. చివరకు ఓ స్థానిక గల్లీ నాయకుడు ఫోన్ చేసి కిటికీ బంద్ చేయాలని కోరడం గమనార్హం. నాకు పాజిటివ్ వచ్చినందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా నా ఆరోగ్యం గురించి కనీసం పలకరించని స్థానికులు, మరో రకంగా ప్రవర్తించిన వైనం కలచివేసింది.
డ్యూటీలో జాయిన్ అయ్యా
జూన్ 25 వరకు క్వారంటైన్ చేయమని వైద్యులు చెప్పినప్పటికీ... జూన్ 30 వరకు గది నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ నెల 1న విధుల్లో జాయిన్ అయ్యాను. అయినా ఇప్పటికీ ఇంట్లోనూ.. పని చేసే చోటా భౌతికదూరంతో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఫీల్డ్ వర్క్ ఉన్నందున ఆఫీసులో అడుగు పెట్టకుండా బయట నుంచే డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వచ్చి టీవీ.. వ్యాయామంతో కాలక్షేపం చేస్తున్నాను.
ఇప్పటి వరకు ప్రతిరోజూ ఆరోగ్య శాఖ వారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎంతో భయపడినప్పటికీ... కోలుకుని బయటకు రావడం.. నా కుటుంబీకులతో కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నేను అందరికీ సూచిస్తున్నదేమిటంటే కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఒకవేళ కరోనా సోకితే ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దు. ఇతర రోగాలు ఏమీ లేకుంటే సొంతంగా క్వారంటైన్ పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే కరోనాను జయించవచ్చు.