కరోనా భయంతో తారురోడ్డును తవ్వేశారు..
ABN , First Publish Date - 2020-08-01T10:59:47+05:30 IST
కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలను నియంత్రించేందుకు ఏకంగా తారురోడ్డునే తవ్వేశారు.

అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు
రెండు నెలలుగా తీవ్ర ఇక్కట్లు పడుతున్న వాహనదారులు
కాగజ్‌నగర్, జూలై 31: కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలను నియంత్రించేందుకు ఏకంగా తారురోడ్డునే తవ్వేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై కందకం తవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండు నెలలుగా సా మాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి సిర్పూర్(టి) మండలానికి ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. రెండు నెలల క్రితం అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పదులు సంఖ్యలో నమోదు కావడంతో సిర్పూర్(టి) మండల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు సిర్పూరు (టి)- మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై కందకం తవ్వారని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు తవ్వివేయడంతో రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. రోడ్డు తవ్విన విషయం తెలియక కొందరు వాహనదారులు ఇక్కడికి వరకు వచ్చి వెనక్కి వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి సిర్పూరు(టి) మాకోడి మీదుగా మహారాష్ట్రకు వెళ్లేందుకు ఈ రోడ్డే ప్రధానమైంది. దీనిపై రాకపోకలు నిలిచి పోవడంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు..
రెబ్బెన, కాగజ్‌నగర్ సమీప గ్రామాల నుంచి నిత్యం సుమారు 1,500 వివిధ రకాల వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర నుంచి ఇనుపరాడ్లు, యూరియా, తదితర సామగ్రి తరలించే లారీలు నిత్యం వందకుపైగా వస్తుంటాయి. ఈ రహదారిని మూసివేయడంతో మహారాష్ట్ర నుంచి నేరుగా వాంకిడి, ఆసిఫాబాద్ మీదుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు రవాణా భారం పడుతోందని వ్యాపారులు వాపోతున్నారు. రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూరు(టి) మండలాల్లోని రైతులు సైతం ఈ రహదారిమీదుగానే తమ పంటలను విక్రయించడానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంతకీ తవ్విందెవరు?
సిర్పూరు(టి) అతి సవీపంలో ఉన్న మాకోడి తారు రోడ్డును ఎవరు తవ్వారన్నది అంతుబట్టడం లేదు. సరిహద్దుల్లో విధులు నిర్వహించిన అధికారులు రోడ్డు కటింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి.
రోడ్డును తాము తవ్వ లేదని మహారాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డును తవ్వింది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ రోడ్డు మీదుగా నిత్యం సబ్సిడీ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు వివిధ వాహనాల్లో తరలిస్తుంటారు. ఈ దందాను అరికట్టేందుకు కూడా అధికారులు చేశారన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా, మరో వైపు అక్రమదందా వ్యాపారం అరికట్టేందుకు తీసుకున్న చర్యలు బాగున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం అత్యవసర పనుల నిమిత్తం రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
రహదారి తవ్వకంపై విచారణ చేపడతాం..- లక్ష్మీనారాయణ, కాగజ్‌నగర్ ఆర్ అండ్ బీ డీఈ
సిర్పూరు(టి) మండలంలోని మాకోడి సమీపంలో రహదారిని తవ్విన విషయంపై విచారణ చేపడుతాం. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.