బడా లాస్‌

ABN , First Publish Date - 2020-04-28T05:55:50+05:30 IST

‘ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయంటారు..’ అని కష్టం వచ్చినప్పుడల్లా ప్రతీఒక్కరూ ఈ నానుడిని తలచుకోవడం

బడా లాస్‌

వ్యాపారాలపై కరోనా ఎఫెక్ట్‌

లాక్‌డౌన్‌తో మూతపడ్డ షోరూంలు 

వ్యాపారులకు రూ.లక్షల్లో నష్టం


( ఆంధ్రజ్యోతి, నిర్మల్‌): ‘ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయంటారు..’ అని కష్టం వచ్చినప్పుడల్లా ప్రతీఒక్కరూ ఈ నానుడిని తలచుకోవడం పరిపాటి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే అంతటా నెలకొన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఒక్కసారి అందరి అంచ నాలు తలకిందులయ్యాయి. భవిష్యత్‌పై పెట్టుకు న్న ఆశలు సైతం ఆవిరైపోయే ప్రమాదం నెలకొంది. రాజకీయంగా, వాణిజ్య, వ్యాపారపరంగా ముందుకు దూసుకుపోతున్న ఈ జిల్లాలో కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు స్థిరాస్తి వ్యాపారం ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. రూ.కోట్లాది ఆర్థిక లావాదేవిలన్నీ స్థంభించిపోయాయి.


ప్రతియేటా ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్‌, మే వరకు ఓవైపు పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పంటలన్నీ చేతికి వచ్చే సమయం కావడంతో వ్యాపారాలు పెద్దఎత్తున సాగుతుంటాయి. దీనికి తోడు ఈనెలల్లోనే రియల్‌ వ్యాపారం కూడా గణనీయంగా సాగుతోంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ఎలక్ర్టానిక్‌ వ్యాపారులు రూ.కోట్లా విలువైన ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు, కూలర్‌లు లాంటివి ఫిబ్రవరిలోనే కొనుగోలు చేసి సీజన్‌ కోసం గోదాంలలో భద్రపరుస్తారు. వీటన్నింటికీ జూన్‌ వరకు భారీగా గిరాకీలు ఉండడంతో ఎలక్ర్టానిక్‌ వ్యాపారులు పెద్దఎత్తున డిస్కౌంట్‌ ఆఫర్‌లు కూడా ఇస్తుంటారు. నిర్మల్‌లో బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు సంబంధించి చాలా షోరూంలు ఉన్నాయి. వీటిల్లో వందల మంది పని చేస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతున్నందున ఆ షోరూంలన్నీ మూతపడ్డాయి.


దీంతో ఆ వస్తుసామగ్రి అంతా గోదాంల్లోనే ములిగిపోతోంది. అలాగే షోరూంలు, గోదాంల కిరాయిలతో పాటు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాల చెల్లింపు భారంగా మారుతోంది. అంతేకాకుండా ఇక్కడి బట్టల షోరూంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్‌, మేనెల వరకు పెళ్లిళ్ల సీజన్‌ ప్రతియేటా ఉంటుంది. ఇందు కోసం నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌లలో బట్టల వ్యాపారులు పెద్దఎత్తున స్టాక్‌ను నిల్వ ఉంచుతారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో రూ.కోట్లలో బట్టల వ్యాపారం సాగుతుంది. స్థానిక మంచిర్యాల చౌరస్తాలోని ఓ మెగా బట్టల దుకాణంలో నిత్యం రూ.లక్షల  వ్యాపారం సాగుతుంది. ఈ ఒక్క దుకాణంలోనే దాదాపు వంద మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుంటారు. అలాగే పాతబస్టాండ్‌, కొత్తబస్టాండ్‌తో ఏరియాల్లోనూ పెద్దసంఖ్యలో బట్టల దుకాణాలున్నాయి. కరోనా ప్రభావంతో ఇవన్నీ మూతపడడం, వ్యాపారం స్థంభించిపోవడంతో యజమానులు తల్లడిల్లిపోతున్నారు. స్థానిక ఫంక్షన్‌ హాల్‌లు సైతం మూతపడ్డాయి. వీటిపై వందల సంఖ్యలో ఆధారపడ్డ ఎంతో మంది లేబర్లు, పూలవ్యాపారులు, ఎలక్ర్టానిక్‌ వ్యాపారులు సైతం ఉపాధిని కోల్పోయారు. 


ఏడాది వరకు కోలుకోవడం కష్టమే..

కరోనా ప్రభావంతో అన్నిరకాల దుకాణాలు, వ్యాపారాలు మూతపడడంతో రూ.కోట్ల లావాదేవీలు పతనమైపోయాయి. దీంతో జిల్లాలోని వ్యాపార, వాణిజ్య రంగాలు మరో ఏడాది వరకు కోలుకోవడం కష్టమేనంటున్నారు. చాలామంది వ్యాపారులు సీజన్‌ దందా కోసం బ్యాంకుల్లోనూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం అప్పుల చెల్లింపు, సిబ్బందికి వేతనాల చెల్లింపుతో పాటు షోరూంలు, గోదాంల కిరాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే మరో రెండు, మూడేళ్ల వరకు ఇక్కడి వ్యాపార వాణిజ్య రంగాలు కుదుటపడేలా లేవు. 


పూర్తిగా పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ దందా

మొదటి నుంచి నిర్మల్‌ కమర్షియల్‌ ప్రాంతంగా పేరు గడించింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ రియల్‌ వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. నిర్మల్‌ చుట్టూ పక్కల ప్రాంతంలో ఎకరం భూమి రూ.2 కోట్ల ధర పలుకుతుండగా.. ఒక ప్లాటు రూ.20 లక్షలకు తగ్గకుండా ఉందంటే ఇక్కడి భూములకు డిమాండ్‌ ఎంతగా ఉందో తెలిసిపోతుంది. రియల్‌ వ్యాపారం పెద్దఎత్తున జరుగుతుందని భావించిన వ్యాపారులు, తమ పెట్టుబడులు ఎలా తిరిగి వస్తాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.


నెలరోజుల్లోనే అంతా తలకిందులు

మార్చి నుంచి తమ తలరాత మారిపోతుందనుకున్న వ్యాపారులు కరోనా ఎఫెక్ట్‌కు గురయ్యారు. నెల వ్యవధిలోనే వారి ఆశలన్నీ తలకిందులయ్యాయి.  కరోనా విస్తరించడం, లాక్‌డౌన్‌ విధించడంతో కోలుకోని పరిస్థితికి చేరుకున్నారు. ఓవైపు నిర్వేదం, మరోవైపు కాలజ్ఞనం లాంటి వేదాంతం గురించి మాట్లాడుకుంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2020-04-28T05:55:50+05:30 IST