వ్యాధి నిర్ధారణ ఎలా?

ABN , First Publish Date - 2020-07-19T06:51:31+05:30 IST

ఒకవైపు కొవిడ్‌-19, మరో వైపు అంటువ్యాధులు జిల్లాను చుట్టుముడుతున్నాయి. దీంతో ఏది..

వ్యాధి నిర్ధారణ ఎలా?

  • సీజనల్‌ రోగాలు ప్రబలే వేళ కరోనాను గుర్తించడం సవాలే 
  • ఒకేరకంగా రెండింటి ప్రాథమిక లక్షణాలు
  • వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసిన డీఎం  హెచ్‌ఓ
  • జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్‌ కేసులు
  • అనుమానిత కేసులపై నిరంతర నిఘా 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఒకవైపు కొవిడ్‌-19, మరో వైపు అంటువ్యాధులు    జిల్లాను చుట్టుముడుతున్నాయి. దీంతో ఏది  కరోనా, ఏది సీజనల్‌ వ్యాధి అని అర్థ్థం కాని పరిస్థితుల్లో జనం హైరానా పడుతున్నారు. జిల్లాలో జూన్‌ మొదటి వారం నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో క్రమంగా విష జ్వరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీ గూడాల్లో సీజనల్‌ వ్యాధుల విజృంభన మొదలైంది. కరోనా, విష జ్వరాల ప్రాథమిక లక్షణాలు ఒకేరకంగా కన్పిస్తుండడంతో  ఏవ్యాధో గుర్తించటం కష్టంగా ఉందని  పలువురు చెబుతున్నారు. అయితే రెండింటి ప్రాథమిక లక్ష ణాలు ఒకే మాదిరిగా ఉన్నా జిల్లాలో మొదలైన కరోనా కేసుల ట్రేండ్‌ను అనుసరించి అనుమానిత కేసులను నిరంతరం పరిశీలిస్తున్నామని జిల్లా వైద్యా ధికారి చెబుతున్నారు. సాధారణ జ్వరాల నుంచి  కరోనా లక్షణాలను ప్రత్యేకంగా గుర్తించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఇప్పటికే అవగాహన కార్యక్ర మాలు నిర్వహించామని డీఎంహెచ్‌ఓ పేర్కొ న్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వర్షాల కారణంగా చలితో కూడిన విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. కొవిడ్‌-19కు సమాంతరంగా సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ అమలు చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నా కరోనా కేసులు పెరుగు తుండడంతో జలుబు చేసి వ్యక్తులకు చూసి కూడా జనం భయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల సీజన్‌ కావటంతో రైతులు వివిధ పనుల కోసం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల వంటి పట్టణాలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో అలాంటి వారికి   చిన్నపాటి జ్వరం సోకిన కూడా  భయంతో  వణికిపోతున్నారు. 


విజృంభిస్తున్న కరోనా

జిల్లాలో ఏప్రిల్‌ 11న మొదలైన కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర రోజురోజుకూ విస్తరిస్తోంది. మొదటి దశలో కేవలం మర్కజ్‌ వెళ్లి వచ్చిన బాధితుల కారణంగానే ఏడు కేసులు నమోదు కాగా వారు చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ సడలించడంతో ముంబై, ఢిల్లీ, పుణే, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి వలస కార్మికులు స్వస్థలాలకు రావటంతో రెండో విడత కేసులు నమోదయ్యాయి. తాజాగా  ప్రతి రెండ్రోజులకు  ఒక పాజిటివ్‌ ఒక పాజిటివ్‌ కేసు చొప్పున నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.


అసింప్టమాటిక్‌ కేసులతో ఆందోళన

అయితే కరోనా కేసులన్నీ అసింప్టమాటిక్‌ కేసులుగానే నిర్ధారించారు. కేవలం రెండు కేసులు మాత్రమే స్వల్ప లక్షణాలు కలిగినవిగా గుర్తించారు. గత మూడు నెలల కాలంలో మొత్తం 52 పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటి వరకు 25 మంది బాధితులు కోలు కోగా ప్రస్తుతం 27 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మూడు చోట్ల క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా పాజిటివ్‌ బాధితులను మాత్రం వాంకిడిలోని ఐసోలేషన్‌లోనే ఉంచు తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఆసిఫాబాద్‌, గోలేటి కేంద్రాల్లో క్వారంటైన్‌ చేయగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గరిష్ఠంగా శుక్ర వారం మాత్రమే 21 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కూడా మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా అసింప్టమాటిక్‌గా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 


రోగులను గుర్తించడం ఎలా?

ప్రస్తుతం అంటువ్యాధుల సీజన్‌ ప్రారంభం కావడంతో సీజనల్‌ జ్వరాలకు, కొవిడ్‌-19 లక్షణాల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనటం కొంత వరకు ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ సాధారణంగా వర్షంలో తడిసిన తర్వాత జలుబుతో కూడిన జ్వరం వస్తే భయపడకుండా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా చలితో కూడిన జ్వరం వస్తే దానిని సాధారణ విష జ్వరంగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌-19 లక్షణాల్లో ఇదే తరహా పరిస్థితులు కన్పిస్తున్నా జ్వరం తీవ్రతలో కొంత వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలో కరోనా సోకిన వ్యక్తులకు ఇప్పటి వరకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వ్యక్తుల్లోనూ జ్వరం, తలనొప్పి, జలుబు, ఛాతిలో నిప్పి, విరేచనాలు వంటి లక్షణాలుంటాయి. ముఖ్యంగా పాజిటివ్‌ సోకిన వ్యక్తులతో సాంఘికంగా మెలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. స్వీయ నిర్బంధంలో ఉండి వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని నిపుణులు చెబుతున్నారు. 


జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు 

జిల్లాలో శనివారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. దహెగాం మండల ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న  ఇద్దరు కార్యదర్శులకు పాజిటివ్‌ వచ్చింది. దహెగాం ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఇదివరకే కరోనా పాజిటివ్‌ రాగా ప్రైమరీ కాంటాక్ట్‌ కింద వీరిద్దరికి సోకినట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-07-19T06:51:31+05:30 IST