అయోమయంలో హస్తం

ABN , First Publish Date - 2020-11-26T05:33:36+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో గతవారం రోజుల నుంచి అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ పార్టీకి చెందిన జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంతో కార్యకర్త లంతా గందరగోళానికి గురవుతున్నారు.

అయోమయంలో హస్తం
ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి

జిల్లాలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల కమలం బాట 

నేడో రేపో మహేశ్వర్‌రెడ్డితో బీజేపీ నేతల భేటీకి అవకాశం 

ఇదే బాటలో రమేష్‌రాథోడ్‌, మోహన్‌రావు పటేల్‌ 

ఊపందుకుంటున్న ఊహాగానాలు 

స్పష్టతనివ్వని నేతలు 


నిర్మల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో గతవారం రోజుల నుంచి అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ పార్టీకి చెందిన జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంతో కార్యకర్త లంతా గందరగోళానికి గురవుతున్నారు. గత రెండురోజుల నుంచి వీరి చేరికల విషయమై సోషల్‌మీడియాలో పెద్దఎత్తున కథనాలు వైరల్‌ అవు తుండడం రాజకీయ చర్చకు కారణమవుతోంది. ప్రస్తుతం జిల్లా రాజకీయ వర్గాల్లో బీజేపీలో చేరికల వ్యవహారమే హాట్‌టాఫిక్‌గా మారింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి నేడోరేపో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలున్నాయంటూ బుధవారం సోషల్‌మీడియాలో విస్తృతప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే వివిధ ఎలక్ర్టానిక్‌ మీడియాలో కూడా మహేశ్వర్‌రెడ్డి చేరిక విషయమై ప్రత్యేకకథనాలు, స్ర్కోలింగ్‌లు ప్రసారం కావడంతో అంతటా దీనిపైనే చర్చ మొదలైంది. అయితే బుధవారం నిర్మల్‌లోని మహేశ్వర్‌రెడ్డి నివాసగృహం కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆయన మద్ధతుదారుల కోలాహలంతో నిండిపోయింది. నిర్మల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మహేశ్వర్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే మహేశ్వర్‌రెడ్డి అందరి అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటూ చేరిక విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదంటున్నారు. ఇదిలా ఉండగా గురు, శుక్రవారాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు ఓం ప్రకాష్‌నడ్డా మహేశ్వర్‌రెడ్డిని స్వయంగా కలవబోతున్నారన్న ప్రచారం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. నడ్డామహేశ్వర్‌రెడ్డి ఇంట్లో తేనేటీ విందుకు హాజరుకాబోతున్నారంటూ కూడా ప్రచారం మొదలైంది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా స్పష్టతకు వస్తున్నారు. మరోవైపు బీజేపీ జిల్లాస్థాయి నాయకులు కూడా మహేశ్వర్‌రెడ్డి చేరిక విషయంలో ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు అనుచరులు పేర్కొంటున్నారు. అలాగే ఖానాపూర్‌ సెగ్మెంట్‌ నుంచి మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన అనుచరులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ముథోల్‌ నుంచి ఇటు నారాయణరావు పటేల్‌ అటు ఆయన సోదరుడైన మోహన్‌రావు పటేల్‌లు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారంటున్నారు. అయితే రమేష్‌రాథోడ్‌, నారాయణరావుపటేల్‌, మోహన్‌రావుపటేల్‌లు నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో జతకట్టి మూకుమ్మడిగా బీజేపీ లో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి, రమేష్‌ రాథోడ్‌తో ఆపార్టీ అగ్రనేత భూపేంద్రసింగ్‌ యాదవ్‌ సంప్రదింపులు కూడా జరుపుతున్నారన్న సమాచారం ఉంది. 

మహేశ్వర్‌ రెడ్డి చేరికపై జోరుగా ఊహాగానాలు

నిర్మల్‌ నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉండి దీటైననేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచా రం ప్రస్తుతం అంతటా హాట్‌టాఫిక్‌గా మారింది. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఓం ప్రకాష్‌నడ్డా మహేశ్వర్‌రెడ్డిని పార్టీలోకి స్వయం గా ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయమై బుధవారం సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, అలాగే ప్రముఖ టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రసారం కావడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చకు తావిచ్చింది. మొత్తానికి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వ్యవహారం ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండడమే కాకుండా కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపే అవకాశాలున్నాయంటున్నారు. 

ఖానాపూర్‌ , ముథోల్‌లలో కూడా..

ఖానాపూర్‌ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ భారీ కుదుపుకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌ రాథోడ్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారం అక్కడి నియోజకవర్గంలో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డితో రమేష్‌రాథోడ్‌ ఈ విషయమై సంప్రదింపులు కూడా జరిపారని ముకూమ్మడిగా చేరికల విషయంలో ఆలోచనలు జరుపుదామన్న ప్రస్థావన కూడా చేసినట్లు సమాచారం. అలాగే ఆయన ఉట్నూర్‌, ఖానాపూర్‌, జన్నారం ప్రాంతాల్లోని తన అనుచరులతో బీజేపీలో చేరే వ్యవహారంపై మంతనాలు కూడా జరుపుతున్నారంటున్నారు. బీజేపీకి చెందిన రాష్ట్రస్థాయి గిరిజన నాయకుడు రాథోడ్‌చేరికపై ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. దీంతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు రాష్ట్రస్థాయి సీనియర్‌ నాయకులు సైతం రమేష్‌ రాథోడ్‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారంటున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో బలమైన నాయకునిగా రాథోడ్‌కు పేరుంది. టీడీపీ హయాంలో ఆయన జిల్లాస్థాయి అగ్రనేతగా ఎదిగారు. జడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన కీలకపదవులను చేపట్టి ప్రత్యర్థివర్గాలకు దడ పుట్టించారు. అయి తే టీఆర్‌ఎస్‌ హవా కారణంగా తన వరుస ఓటములను చవి చూసినప్పటికీ అనుచరవర్గాన్ని మాత్రం కోల్పోలేదు. కాంగ్రెస్‌ నుంచి ఆయన పోటీ చేసి ఓటమి చెందిన పెద్దమొత్తంలోనే ఓట్లను కూడగట్టగలిగారు. ఇప్పటికే ఆయనపై సానుభూతి ఎక్కువగా ఉందంటారు. రమేష్‌రాథోడ్‌ బీజేపీలో చేరడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండడంతో ఇటు కాంగ్రెస్‌లో కలవరం మొదలవుతుండగా అటు బీజేపీలో కొత్తచర్చకు జరుగుతోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముథోల్‌ నియోజకవర్గంలో కూడా పలువురు కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ముథోల్‌ నియోజకవర్గంలో బీజేపీకి గట్టిపట్టు ఉంది. బలంగా ఉన్న ఆ పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌, ఆయన సోదరుడు మోహన్‌రావు పటేల్‌లు వేరువేరుగా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారంటున్నారు. నియోజకవర్గంలో పటేల్‌ సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉండడంతో అదే వర్గానికి చెందిన వీరిద్దరు బీజేపీలో చేరి ఈ సారి ఆ పార్టీ టికెట్‌పై ఎమ్మె ల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నారాయణరావు పటేల్‌, మోహన్‌రావు పటేల్‌లు కూడా ఇప్పటికే బీజేపీలో చేరే విషయమై మహేశ్వర్‌రెడ్డితో మంతనాలు కూడా జరిపినట్లు పేర్కొంటున్నారు. మొ త్తానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడం సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదిక కాబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-11-26T05:33:36+05:30 IST