పరిహారం.. పడిగాపులు.. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపులో జాప్యం

ABN , First Publish Date - 2020-12-11T04:13:18+05:30 IST

వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో పత్తిపంట ప్రధానంగా సాగవుతోంది. ఆ తర్వాత సోయా, కంది, శనగ పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. పత్తి పంటను సాగు చేయడమంటే జిల్లా రైతులకు సాహసంతో కూడుకున్న పనిగానే మారింది.

పరిహారం.. పడిగాపులు.. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపులో జాప్యం

జిల్లా వ్యాప్తంగా 82వేల మంది రైతుల ఎదురు చూపులు

పంట నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలు

ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

రెండేళ్లు గడుస్తున్నా చేతికందని బీమా సొమ్ము



ఆదిలాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో పత్తిపంట ప్రధానంగా సాగవుతోంది. ఆ తర్వాత సోయా, కంది, శనగ పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. పత్తి పంటను సాగు చేయడమంటే జిల్లా రైతులకు సాహసంతో కూడుకున్న పనిగానే మారింది. యేటా అతివృష్టి, అనావృష్టి, గులాబీరంగు పురుగు, చీడ పీడలు ఆశించి తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌బీమా యోజన పథకం కింద పంట నష్ట పరిహారాన్ని పొందేందుకు పలు బీమా కంపెనీలకు జిల్లా రైతులు తమవాటాను చెల్లించిన ప్రయోజనమే కనిపించడం లేదు.


పంటలను నష్టపోయి రెండేళ్లు గడుస్తున్నా పరిహారం చేతికి అందడం లేదు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. 2018-19, 2019-20 ఖరీఫ్‌ కాలానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షా 60వేల మంది రైతులు పంటల బీమాను చేశారు. జిల్లాలో 82వేల మంది రైతులకు గాను రూ.234కోట్లకు పైగా నష్టపరిహారం రావాల్సి ఉంది. రెండేళ్లు గడిచి పోతున్నా రైతులకు పంట నష్టపరిహారం అందకపోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ రైతుల పక్షాన హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉన్నత న్యాయస్థానం జోక్యంతో పరిహారం చెల్లింపుల్లో కొంత కదలిక వచ్చినట్లే కనిపిస్తోంది. 


బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నా..

ఫసల్‌ బీమా పథకం కింద పంటల బీమా చేసిన రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వాటా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. 2018లో జిల్లా వ్యాప్తంగా 24వేల మంది రైతులు 73.900 ఎకరాలకు పంటల బీమా చేయగా రూ.12.93 కోట్లు తమ వాటా కింద బీమా కంపెనీలకు చెల్లించారు. మిగతా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.25.8 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే 2019లో 58వేల మంది రైతులు లక్షా 83వేల 165 ఎకరాలకు పంటల బీమాను చేసి రూ.32 కోట్లను చెల్లించారు. మిగతా రూ.54కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీమా సొమ్ము విడుదలకు డీ, ఓ నోట్‌ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తనవాటా చెల్లింపుకు ఆలస్యం చేయడంతో పరిహారం విడుదలకు జాప్యం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.


హైకోర్టులో విచారణ..

జిల్లా రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో విచారణ మొదలైంది. ఇప్పటికే హైకోర్టు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మళ్లీ తాజాగా గురువారం మరోసారి విచారణ చేపట్టి పంటల నష్ట పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరింది. అసలు జాప్యానికి కారణం ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. రెండేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నా పట్టించుకోక పోవడంపై ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించింది. 


రాష్ట్రం వాటా రూ.79.8 కోట్లు..

2018-2019 ఖరీఫ్‌ పంటల బీమా సొమ్ముకింద రాష్ట్రం చెల్లించాల్సిన వాటా రూ.79.8 కోట్లు కాగా అంతే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటికే బీమా సొమ్ము విడుదలకు కేంద్ర ప్రభుత్వం డీ,ఓ నోట్‌ను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అయినా స్పందించక పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోయారు. జిల్లాలో పత్తి, సోయా పంటలకు ఒక్కో ఎకరానికి రూ.8వేల నుంచి రూ.22వేల వరకు చెల్లించే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా బీమా కంపెనీలు చెల్లించాల్సి ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T04:13:18+05:30 IST