రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2020-11-26T04:19:37+05:30 IST
ప్రభుత్వం సూచించిన పంటలు వేసినందుకు రైతులు నష్టపోయారని, వారిని నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్‌కుమార్ డిమాండ్ చేశారు.

బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు
- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్‌కుమార్
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 25: ప్రభుత్వం సూచించిన పంటలు వేసినందుకు రైతులు నష్టపోయారని, వారిని నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం రైతులకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని మార్క్స్‌భవన్ నుంచి ఐబీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రైతుకు మద్దతు ధర గ్యారంటీకి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి అందిస్తున్న రైతన్నకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కష్టకాలంలో అన్ని ఉత్పత్తులకు ధరలు పెంచి రైతుకు మాత్రం మొండి చేయి చూపించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తూ కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర ఆర్డినెన్స్ బిల్లులను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రైతులంతా ఐక్యంగా గురువారం నిర్వహించే గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు దొండ ప్రభాకర్, దేవవరం, బాపురావు, టి. శ్రీనివాస్, తోకల తిరుపతి, ఏఐకేఎస్‌సీసీ నాయకులు దేవవరం రమారెడ్డి, మేకల రాములు, సురేందర్, భీంరావు, సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.