ధరలమంట

ABN , First Publish Date - 2020-10-07T06:00:40+05:30 IST

కరోనా కష్టకాలంలో ఉపాధిలేక ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి.

ధరలమంట

నిత్యావసరాల ధరలు పైపైకి 

ఘాటెక్కిన ఉల్లి

కాగుతున్న నూనెలు 

కూరగాయలదీ అదే దారి

వినియోగదారుల బెంబేలు


ధరల మంట వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఉల్లి ధరలు మంట పుటిస్తున్నాయి. నూనెలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


మంచిర్యాల, అక్టోబరు 6: కరోనా కష్టకాలంలో ఉపాధిలేక ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. కొవిడ్‌ కారణంగా ఆరు నెలల అనంతరం ఇప్పుడిప్పుడే మార్కెట్లు ప్రజల తాకిడితో దారిన పడుతున్నాయి. ప్రజలకు ఉపాధి మెరుగున పడుతోంది. ఇన్నాళ్లు తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజానీకానికి కొంత ఊరట లభిస్తుండగా ధరల పెంపు వారిని తిరిగి అఘాతంలోకి నెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏం కొనాలో, ఏం తినాలో పాలుపోక అల్లాడుతు న్నారు. చక్కెర, ఉప్పు, చింతపండు మొదలు ప్రతి వస్తువుపై కనీసం రూ. 30 వరకు ధరలు పెరిగాయి. ధరలను అరికట్టాల్సిన కేంఽధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరిట మరింత భారం మోపుతుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి సలుపుకోలేక పోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే అమాంతం ధరలు పెరగడంతో ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వాలు స్పందించి ధరల నియంత్రణకు అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాడ్‌ చేస్తున్నారు.


ధరల పెరుగుదల ఇలా..

వస్తువు                      సెప్టెంబరులో ..  అక్టోబరులో..

సన్‌ఫ్లవర్‌ అయిల్‌           రూ. 105        రూ.  125

పెసరపప్పు 100    110

కందిపప్పు               90    125

చింతపండు 140    150

ఎండుమిర్చి           160    200

ఉల్లిగడ్డ కిలో                30    60

టమాట                      30    40

బీరకాయ             60    80

చిక్కుడుకాయ 60    125

కోడిగుడ్డు             4      6

చికెన్‌                          220           250

మటన్‌                        700           700


దరలు అమాంతం పెరిగాయి..సంతోష్‌, కురగాయల వ్యాపారి

కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై అధిక భారం పడుతోంది.  గత నెలతో పోలిస్తే ఒక్కో రకంపై కిలోకు దాదాపు రూ. 20 నుంచి రూ. 30 పెరిగింది. కొత్తిమీర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూ. 10 వెచ్చిస్తే నాలుగు రెమ్మలు కూడా రావడం లేదు. సాధారణ రోజుల్లో ఎండాకాలంలో కూడా లేని ధరలు ఇప్పుడు పలుకుతున్నాయి. కూరగాయలు కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. 


సరుకులు కొనలేకపోతున్నాం..పూరేళ్ల రజిత, గృహిణి

మార్కెట్‌కు వెళ్లి నిత్యావసర సరుకులు కొనాలంటేనే భయం వేస్తోంది. రూ. 200 తీసుకొని మార్కెట్‌కు వెళితే మూడు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. కరోనా కాలంలో ఉన్న ఉపాధి కూడా కోల్పోగా ప్రస్తుతం ధరలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పెరిగిన ధరల కారణంగా  సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.       

Updated Date - 2020-10-07T06:00:40+05:30 IST