కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-09-24T06:56:06+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా

కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట

కార్యకర్తను మోకాలితో తన్నడాన్ని నిరసిస్తూపోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

ఎస్సైపై ఏసీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు

విచారణ చేపడుతామని ఏసీపీ హామీ


మంచిర్యాల, సెప్టెంబర్‌ 23: ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి మొదట ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆధ్యంతం రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ కలెక్టరేట్‌కు చేరగా పోలీసులు ప్రధాన గేటు వద్దనే నిలువరించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద బైఠాయించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని నినాదాలు చేశారు.  పెద్ద మొత్తంలో నాయకులు అందోళనకు దిగడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో పోలీసులు నాయకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు ప్రతిఘటించారు.


బందోబస్తులో పాల్గొన్న రామకృష్ణాపూర్‌ ఎస్సై రవిప్రసాద్‌ ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడం, కానిస్టేబుల్‌ మరో కార్యకర్తను మోకాలితో తన్నడం ఉద్రిక్తతకు దారితీసింది. తోపులాటలో కిందపడిపోయిన మరో కార్యకర్త చేయి విరగడంతో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుందని భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఎస్సై వైఖరిని నిరసిస్తూ నాయకులు పోలీస్‌స్టేషన్‌ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జి ఏసీపీ నరేందర్‌ కలుగజేసుకొని జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. 


ప్రజలపై భారం వేయడం సరికాదు..

ధర్నా సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, లేని పక్షంలో పార్టీ తరుపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అర్హులైన పేద ప్రజలకు ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, అర్హులైన వారికి వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గోనె శ్యాంసుంధర్‌రావు, జిల్లా మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపతి మల్లేష్‌, అందుగుల శ్రీనివాస్‌, మునిమంద రమేశ్‌, పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వ ర్‌రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పత్తి శ్రీనివాస్‌, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి రమేశ్‌తోపాటు అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-24T06:56:06+05:30 IST