సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-05-18T10:35:44+05:30 IST
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఆసిఫాబాద్ కలెక్టరేట్, మే17: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని వైద్య, విద్య, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, డీఆర్‌డీఏ, ట్రైబల్, మున్సిపల్, బీసీ, ఫిషరీష్ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీ మండలాలైన తిర్యాణి, సిర్పూర్(యూ), జైనూరు, లింగాపూర్, కెరమెరిలలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ రాకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో వైద్యాధికారులు ర్యాపిడ్ సర్వే, హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఇంటింటికీ ఐఆర్‌ఎస్ స్ర్పే చేయాలని, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.
పంచాయతీ అధికారులు గ్రామాల్లో శానిటేషన్‌ను నిర్వహించి గ్రామీణ ఆరోగ్య పారిశుధ్య కమిటీలను అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ మండలాల్లో నీటి నిలువ ఉన్న ప్రాంతాల్లో తాంబుషియా చేపలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే బావుల్లో క్లోరినేషన్ చేయాలని పంచాయతీ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే వారం ముందే విద్యాసంస్థల ఆవరణలో గల పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. పైపులైన్ లీకేజీ ఉంటే మరమ్మతులు చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. పారిశుధ్యంపై పాఠశాలల పిల్లలకు తగు సూచనలు చేయాలని విద్యా శాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై కళాకారులతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హేమంత్, డీఎంహెచ్‌ఓ బాలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.