ఆసిఫాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2020-12-12T04:32:39+05:30 IST
ఆసిఫాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.
- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, డిసెంబరు 11: ఆసిఫాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఇందులో ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కో కమిటీకి ఏడుగురు పారిశుధ్య కార్మికులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 23 కిలో మీటర్ల మేర సీసీ, బీటీ, కంకర రోడ్లు ఉన్నాయని అన్నారు. ఒక్కో కమిటీ మూడు కిలో మీటర్ల మేర పారిశుధ్య పనులు చేపట్టాలని, వారికి ప్రాంతాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. ప్రతి ఇంటికి సరఫరా చేసిన తడిపొడి చెత్త బుట్టల్లో చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. రోజు వారిగా ఆటో ట్రాలీల ద్వారా చెత్తను సేకరించి షెగ్రీషన్ షెడ్డుకు తరలించనున్నారని అన్నారు. ప్రజలు ఎవరు రోడ్లపై చెత్త వేయొద్దని సూచించారు. జనవరి 1 నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే చెత్తాచెదారం తొలగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీవో రమేశ్, జడ్పీ సీఈవో సాయగౌడ్, డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్, ఎంపీవో ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రాజబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదవేణి మల్లేష్, టీఆర్‌ఎస్ నాయకుడు సాలాం, పంచా యతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.