రోడ్లు రక్తసిక్తం

ABN , First Publish Date - 2020-12-06T06:44:02+05:30 IST

జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళనకు చేస్తోంది.

రోడ్లు రక్తసిక్తం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ

కుటుంబాలను కూలుస్తున్న రోడ్డు ప్రమాదాలు 

నెల రోజుల్లోనే 16 మంది మృతి  28 మందికి తీవ్ర గాయాలు 

ప్రమాదాలపై పట్టించుకోని రవాణాశాఖ 

జరిమానాలకే పరిమితమవుతున్న పోలీసుశాఖ 

ప్రధానరోడ్లపై ఇప్పటి వరకు గుర్తించని డేంజర్‌ జోన్స్‌ 

నిర్మల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళనకు చేస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో కుటుం బ పెద్దదిక్కులు మరణిస్తుండడం ఆ కుటుంబాలను కుంగదీస్తోంది. అక్టో బరు, నవంబర్‌ మాసాల్లో అనూహ్యంగా రోడ్డు ప్రమాదాలసంఖ్య పెరిగిపోవడం చర్చకు తావిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాలకు అతివేగంతో డ్రైవింగ్‌ చేయడం ఓ కారణం అవుతుండగా, రోడ్లపై భారీగుంతలు, మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం,  డేంజర్‌జోన్‌లను గుర్తించకపోవడం లాంటి అంశాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రతీ యేటా రోడ్డు భద్రత వారోత్సవాల పేరిట అట్టహాసంగా నిర్వహిస్తున్న అవ గాహన కార్యక్రమాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదంటున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్‌లైసెన్సు లేని మైనర్‌ యువకులు బైక్‌లను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి తోడుగా ఇలాంటి వారి కారణంగా జాగ్రత్తతో డ్రైవింగ్‌ చేస్తున్న వారు కూడా ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరిగిపోతున్నా యంటున్నారు. కొద్దిరోజుల క్రితం నిర్మల్‌ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ బోథ్‌ క్రాస్‌ రోడ్డు వద్ద మరణించారు. ఆ తరువాత మరికొన్ని సంఘటనల్లో దాదాపు పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితం ఓ న్యాయవాది వద్ద గుమాస్తాగా పనిచేసే రాజేందర్‌ అనే వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతం ప్రమాదాల తీవ్రతను వెల్లడిస్తోంది. రాజేంధర్‌ తన కూతురి పెండ్లిపత్రికలను బంధువులకు ఇచ్చేందు కోసం గాను భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఎదురుగా మోటార్‌బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌తో వచ్చిన ముగ్గురు యువకులు ఆయన వాహనాన్ని బలంగా ఢీ కొన్నారు. దీంతో రాజేందర్‌ తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఉదంతం యువకుల ఫాస్ట్‌డ్రైవింగ్‌కు అద్దం పడుతోంది. నిబంధనలకు కాలరాస్తూ డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండానే వేగంతో డ్రైవింగ్‌ చేసి ఎదుటి వారిని ప్రమాదాలకు గురయ్యేట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణంలోని ప్రధాన మార్గంపై ప్రతి రోజూ కొంతమంది యువకులు జట్లుగా ఏర్పడి అతివేగంగా బైక్‌రైడింగ్‌ చేస్తుండడం ఆ రోడ్డు గుండా ప్రయాణించే వారందరినీ హడలెత్తిస్తోంది. ఇలా ప్రతీరోజూ ఈ యువకుల బృందాలు సాయంత్రం వేళ బెట్టింగులతో మోటార్‌ బైక్‌ రైడింగ్‌లు చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతిరోజూ పోలీసులు ప్రధానచౌరస్తాలు, బస్టాండ్‌ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేయడం, జరిమానాల విధించడానికే పరిమితమవుతున్నారే తప్ప ఇలా ఫాస్ట్‌ బైక్‌డ్రైవింగ్‌ చేస్తూ 


ప్రమాదాలకు కారకులవుతున్న వారిని పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పోలీసుల లెక్క ల ప్రకారం ఒక్క నవంబర్‌ నెలలోనే 28 యాక్సిడెంట్‌లు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ యాక్సిండెంట్‌లో 16 మందికి పైగా ప్రాణా లు కోల్పోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పించి అతివేగంతో డ్రైవింగ్‌ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయోనన్న అంశంపై అవగాహన కల్పించడంలో సంబంధిత రవాణాశాఖ విఫలమవుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత యంత్రాంగం కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతూ క్షేత్రస్థాయిలో నియంత్రణ కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆ బాధ్యతనంతా కిందిస్థాయి సిబ్బందికి అప్పగిస్తుండడం ప్రమాదాలు పెరిగేందుకు దోహదపడుతోందంటున్నారు. 

ఒక్క నెలలో 16 మంది మృతి

కాగా రోడ్డు ప్రమాదాల కారణంగా కేవలం నవంబర్‌ మొదటి తారీఖు నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు దాదాపు 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే ఈ ప్రమాదాల తీవ్రతకు ఏ మేరకు ఉందో అర్థమవుతోందంటున్నారు. మొత్తం ఒక నెలలోనే పోలీసు కేసులైనా యాక్సిండెంట్‌ల సంఖ్య 30కి పైగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒక నెలలోనే ఇంత భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగడం అలాగే ప్రమాదాల్లో 16 మందికి పైగా మరణించిన సంఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోందంటున్నారు. జిల్లా గుండా జాతీయ రహదారులు వెళుతుండడం అలాగే నిర్మల్‌ పట్టణంతో పాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, వాహనాల సంఖ్య సైతం పెరిగిపోతుండడం ప్రమాదాలకు ఊతమిస్తోందంటున్నారు. 

అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం 

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడానికి రవాణాశాఖ, పోలీసుశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రవాణాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సరియైున తనిఖీలు నిర్వహించకపోతుండడం, అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించకపోతుండడం సమస్య తీవ్రతకు కారణమవుతోందన్న విమర్శలున్నాయి. రవాణాశాఖ అధికారులు కేవలం తమ కార్యాలయాలకే పరిమితమై వాహనాల రిజిస్ర్టేషన్‌లు, డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అసలు సమస్యను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణాశాఖ ఉన్నతాఽధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలకు వస్తూ ఆ తరువాత ఈ సమస్యను విస్మరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే పోలీసులు కేవలం జరిమానాలు విధించడానికి మాత్రమే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. పట్టణ ప్రధానరోడ్లలో యువకులు జట్లుగా ఏర్పడి ట్రిపుల్‌ రైడింగ్‌ను చేస్తూ సాహసకృత్యాలను మరిపిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అయి తే నిర్మల్‌ పట్టణంతో పాటు ఖానాపూర్‌, భైంసా పట్టణాల్లో యువకులు స్పీడ్‌డ్రైవింగ్‌ చేస్తూ సాధారణ జనాన్ని బెంబేలేత్తిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ క్యాంపు కార్యాలయాల ముందు నుంచే యూత్‌బైక్‌లపై స్పీడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నప్పటికీ రవాణా శాఖ అధికారులు, పోలీసుశాఖ అధికారులు స్పీడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుండడం ప్రమాదాలు పెరిగేందుకు దోహదపడుతోందంటున్నారు. 

డేంజర్‌జోన్‌లపై పట్టింపు కరువు

కాగా నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోనే కాకుండా నాలుగు వైపుల గల ప్రధాన జాతీయ రహదారులు అలాగే నేషనల్‌ హైవే నంబర్‌ 44, 63, 61 రోడ్లపై కూడా ఇప్పటి వరకు అధికారులు అధికారికంగా డేంజర్‌జోన్‌లను గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతీయేటా ప్రస్తుతం ఉన్న రోడ్లు, అలాగే ప్రమాదకరమైన మూల మలుపులను రవాణాశాఖ, పోలీసుశాఖలు సంయుక్తంగా తనిఖీ చేసి డేంజర్‌జోన్‌లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఆర్‌ అండ్‌ బీ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖలతో కలిసి రవాణా, పోలీసుశాఖలు డేంజర్‌జోన్‌లతో పాటు అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌ జోన్స్‌ను కూడా గుర్తించాలి. అయితే యేళ్లు గడుస్తున్న ఈ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విమర్శలున్నాయి. అధికారుల సమన్వయలోపం శాఖలవారీగా పెరుగుతున్న పనిభారం కారణంగా ఈ డేంజర్‌జోన్స్‌ గుర్తింపు వ్యవహారం నిర్లక్ష్యానికి గురవుతోందంటున్నారు. ఇకనైనా అధికారులు సమిష్టిగా డేంజర్‌జోన్‌లను గుర్తించి అక్కడ ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరం ప్రమాదాలు, అతి వేగం లాంటి వ్యవహారాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. 

Updated Date - 2020-12-06T06:44:02+05:30 IST