మున్సిపల్‌ చైర్మన్‌పై అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2020-11-20T04:33:35+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌పై గురువారం కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మున్సిపల్‌ చైర్మన్‌పై అట్రాసిటీ కేసు
ఫిర్యాదు చేసేందుకు కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఏఈ సతీష్‌

కాగజ్‌నగర్‌ ఏఈపై దాడికి నిరసనగా సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన

-రంగంలోకి దిగిన దళిత సంఘాల నాయకులు

-దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఏఈ  

కాగజ్‌నగర్‌, నవంబరు19: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌పై గురువారం కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగజ్‌నగర్‌ చరిత్రలోనే మున్సిపల్‌ చైర్మన్‌పై  అట్రా సిటీ కేసు నమోదు కావటం ఇదే తొలిసారి. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఓ బిల్లు విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదంతో ఏఈ సతీష్‌పై చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ కుర్చీతో దాడి చేసి నానా దుర్భాషలాడాడు. దీంతో జరిగిన సంఘటనపై సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని ఏఈ సతీష్‌ గురువారం కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ స్వామి ప్రాథమిక విచారణ జరిపి మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఐపీసీ 353, 324 సెక్షన్లు కూడా పెట్టారు. బాధితుడు ఏఈకి అండగా  ఎస్సీ, ఎస్టీ సంఘాల జిల్లా సంఘాల నాయకులు కాగజ్‌నగర్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఏఈకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయా లని పిలుపునిచ్చారు. పరిస్థితి చేజారిపోక ముందే పోలీసులు ముందస్తుగా స్పందించి కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో డీఈ గోపాల్‌, ఏఈ సతీష్‌లు ఇంజనీరింగ్‌ పనులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ జరుపడం, బిల్లులను పాస్‌ చేసే ప్రక్రియకు ఎంబీలను రూపొందిస్తుంటారు. నిధులు విడుదల చేసినా పనులు చేయించడంలో కొన్ని రోజులుగా ఇంజనీరింగ్‌ అధికారులు జాప్యం చేస్తు న్నారని, ప్రత్యేక పర్యవేక్షణ ఏమాత్రం చేయటం లేదని పలు సర్వసభ్య సమావేశాల్లో పాలకవర్గ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. పెండింగ్‌ బిల్లు విషయంలో తలెత్తిన వివాదంతో ఏఈపై చైౖర్మన్‌ ఒక్కసారిగా కుర్చీతో దాడికి పాల్పడి దుర్భాష లాడినట్టు ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు చైర్మన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పనులు చేయించు కోకుంటే సరెండర్‌ చేయాలే తప్ప దాడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాయి. 

ఏఈకి మద్దతుగా సిబ్బంది ఆందోళన 

ఏఈ సతీష్‌పై దాడి చేసినందుకు నిరసనగా మున్సిపల్‌ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది మాట్లాడుతూ  ఏఈపై చైర్మన్‌ దాడి చేయటాన్ని తాము ఖండిస్తు న్నామన్నారు. ఈవిషయమై ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందజేసినట్టు వారు పేర్కొ న్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా మని సిబ్బంది తెలిపారు. సిర్పూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ హరీష్‌బాబు, పలువురు మాజీ కౌన్సిలర్లు ఏఈ సతీష్‌ను కలిసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనను ఖండిస్తూ ఏఈ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

అట్రాసిటీ కేసు నమోదు చేశాం

-బీఎల్‌ స్వామి, డీఎస్పీ, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. విఽధి నిర్వహణలో ఉన్న తనపై చేయి చేసుకున్నాడని, కులం పేరుతో దూషించాడని చైర్మన్‌పై ఏఈ ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాథమిక విచారణ జరిపి చైర్మన్‌పై కేసు నమోదు చేశాం.  

బినామీ బిల్లులు చేయాలని చైర్మన్‌ ఒత్తిడి

-ఏఈ సతీష్‌

బినామీ బిల్లులు చేయాలని తనను మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ ఒత్తిడి చేస్తున్నారని ఏఈ సతీష్‌ ఆరోపించారు. దీనిని వ్యతిరేకించినందుకే కుర్చీతో తనపై దాడికి పాల్పడినట్టు ఏఈ సతీష్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తనపై దాడి చేయటం అమానుషమని ఆయన పేర్కొన్నారు. తాను ఇక్కడ అవమానంతో విధులు నిర్వహిం చలేనని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నట్టు ఏఈ తెలిపారు. 

పెండింగ్‌ పనుల గురించి అడిగినందుకే కేసు

-సద్దాం హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ 

పెండింగ్‌ పనుల్లో జాప్యం చేస్తున్నారని నేను మున్సిపల్‌ ఏఈ సతీష్‌ను వాకబు చేశా. అయితే మున్సిపల్‌ ఏఈని సరెండర్‌ చేస్తామని తెలుసుకొని నాపై ఆయన పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేశాడు. అంతేతప్ప నేను ఎవరిపైనా దాడికి పాల్పడలేదు.

Updated Date - 2020-11-20T04:33:35+05:30 IST