కొత్త వైరస్‌పై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-12-30T03:51:17+05:30 IST

ప్రపంచ దేశాలను హడలెత్తిన కొత్త రకం కరోనా రాష్ట్రంలోకి పాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా కన్న 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో సోమవారం తొలి కేసు నమోదైంది.

కొత్త వైరస్‌పై అప్రమత్తం

యూకే నుంచి 8 మంది రాక

ప్రత్యేకంగా క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు

ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

మంచిర్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను హడలెత్తిన కొత్త రకం కరోనా రాష్ట్రంలోకి పాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా కన్న 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో సోమవారం తొలి కేసు నమోదైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) నుంచి ఈ నెల 23న మంచిర్యాలకు వచ్చిన 8 మందిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్వారైంటన్‌కు తరలించి పరీక్షలు జరిపించారు. వారిలో ఒక మహిళ అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌-19 వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల కోసం హైద్రాబాద్‌లోని సీసీఎంబీకి పంపగా ఆ నమునాల్లో కరోనా కొత్త రకం వైరస్‌ నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆమెతో కాంటాక్టులో ఉన్న ఏడుగురిని  క్వారంటైన్‌కు తరలించారు. యూకే నుంచి వారిలో ఎవరికీ కొత్త రకం వైరస్‌ నిర్ధారణ కాకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో నలుగురు జిల్లా కేంద్రానికి చెందిన వారు కాగా, ముగ్గురు మందమర్రి, ఒకరు లక్షెట్టిపేటకు చెందిన వారు ఉన్నారు.

 

ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు...

కొత్త వైరస్‌పై ముందే అప్రమత్తమైన అధికారులు జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ లోగల మంచిర్యాల క్లబ్‌లో ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు.  కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు కలెక్టర్‌ భారతి హోళికేరి నేతృత్వంలో వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసింది. తొలుత కొవిడ్‌ -19 ప్రారంభ దశలో తీసుకున్న ప్రత్యేక చర్యల అనుభవంతో అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 


అన్ని ఏర్పాట్లు చేశాం....

వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ నీరజ

ప్రస్తుతానికి జిల్లాలో కొత్త వైరస్‌ దాఖలాలు లేవు. వైరస్‌ లక్షణాలున్న మహిళకు కొవిడ్‌-19గా నిర్ధారణ అయింది. కొత్త వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. రాష్ట్రశాఖ ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 


Updated Date - 2020-12-30T03:51:17+05:30 IST