జిల్లాలో రైతు వేదికలు...

ABN , First Publish Date - 2020-03-19T08:45:39+05:30 IST

ఇటీవల బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్న మేరకు మంచిర్యాల జిల్లాలో రైతు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చవుతుండగా

జిల్లాలో రైతు వేదికలు...

(ఆంధ్రజ్యోతి-మంచిర్యాల): ఇటీవల బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్న మేరకు మంచిర్యాల జిల్లాలో రైతు వేదికలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చవుతుండగా దీని కోసం రూ.6.60 కోట్లు కేటాయించారు. జిల్లాలోని 368 రైతుబంధు సమితులలో 5,520 మంది సభ్యులున్నారు. జిల్లాలో 55 క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్‌లో ఒక భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు సాగుకు సంబంధించిన పూర్తి అవగాహన కలిగించే పలు విషయాలు, ప్రభుత్వ సమాచారం రైతు వేదికల ద్వారా జిల్లాలోని రైతులకు అందజేస్తారు. రైతు వేదికకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఇప్పటికే 30కి పైగా ప్రదేశాలలో భవన నిర్మాణాలకు స్థల సేకరణ కూడా పూర్తయింది. ప్రతీ క్లస్టర్‌లో ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు. ముగ్గురు లేదా నలుగురు రైతుబంధు వేదిక సభ్యులు ఉంటారు. గిట్టుబాటు ధర, పంటల సాగు, రుణాలు, రైతుబంధు తదితర సమాచారం వివరాలు వీరు రైతులకు అందజేస్తారు. అయితే సభ్యులకు కొంత పారితోషికం కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


రైతు వేదికల ఏర్పాటుకు కసరత్తు

జిల్లాలోని 18 మండలాలలో రైతుబంధు సమితులు ఏర్పాటు చేయడం కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పంట కాలనీల ఏర్పాటు, దిగుబడులు, ధాన్యానికి మార్కెట్‌ ధర ఇప్పించే విషయంలో కూడా రైతు వేదికలు పనిచేస్తాయి. మొత్తం 368 రైతుబంధు సమితులు ఉండగా, ఇందులో గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు 5,520 మంది సభ్యులు ఉన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు పంటల విషయంలో సూచనలు ఇవ్వడానికి శిక్షణలు ఏర్పాటు చేయడం, రైతులలో అన్ని రకాల పంటలను వేసే విధంగా చైతన్యవంతులను చేయడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు రైతు సమితుల ద్వారా చేపట్టడం కోసం ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 1,35,000 మంది రైతులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం యాసంగి, రబీలలో పంటలు పండిస్తున్నారు. అయితే ఒక్కోసారి ప్రకృతి సహకరించని కారణంగా పంటల నష్టం భారీగా జరిగి రైతుల అప్పుల ఊబిలో చిక్కుతున్నారు. ఇలా కొంత మంది పూర్తిగా అప్పులపాలై నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు రైతులకు చేదోడువాదోడుగా ఉండే విధంగా రైతు సమితులు పనిచేయాల్సిన అవసరం ఉందని రైతులు భావిస్తున్నారు. పంట నష్టం జరిగిన సందర్భంలోనూ వెనువెంటనే రైతు వేదికల బాధ్యులుగా ఉన్నవారు శ్రద్ధ తీసుకొని అందుకు సంబంధించిన నష్టాలను అంచనా వేసే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంగా వ్యవహరించి వెంటనే రైతును ఆదుకునే చర్యలు చేపట్టాలని కూడా రైతాంగం భావిస్తోంది. ఆ దిశన పయనించడం వల్ల జిల్లాలో సంపూర్ణంగా అప్పుల ఊబి నుంచి కాపాడటమే కాకుండా ఆత్మహత్యల నుంచి కాపాడవచ్చని రైతులు భావిస్తున్నారు.

Updated Date - 2020-03-19T08:45:39+05:30 IST