సందిగ్ధంలో దివ్యాంగుల ‘భవిత’వ్యం
ABN , First Publish Date - 2020-03-08T06:46:46+05:30 IST
అసలే దివ్యాంగులు.. సాధారణ విద్యార్థులకు వీరి పరిస్థితి పూర్తి భిన్నం.. వ్యక్తిగత శ్రద్ధ చూపితే తప్ప వీరికి విద్యాబుద్ధులు నేర్పలేని పరిస్థితులు ఉంటాయి. ఇందులో అంధులు మొదలుకుని...

- 12 పాత మండలాల్లో 9 మందే
- కొత్త మండలాలకు కేంద్రాలే లేవు
- జిల్లా వ్యాప్తంగా 15 పోస్టులు ఖాళీ
- ఆరుగురు విద్యార్థులకు ఒక టీచర్
- ఉపాధ్యాయులు లేక మూత పడ్డ బెజ్జూరు, కెరమెరి కేంద్రాలు
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): అసలే దివ్యాంగులు.. సాధారణ విద్యార్థులకు వీరి పరిస్థితి పూర్తి భిన్నం.. వ్యక్తిగత శ్రద్ధ చూపితే తప్ప వీరికి విద్యాబుద్ధులు నేర్పలేని పరిస్థితులు ఉంటాయి. ఇందులో అంధులు మొదలుకుని మానసిక జబ్బులతో బాధపడుతున్న వారుంటారు. వీరికి సుశిక్షితులైన ఉపాధ్యాయుల చేత విద్యాబుద్ధులు నేర్పిస్తే మిగతా విద్యార్థులకు దీటుగా రాణించే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అధ్యయనంలో తేలింది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాల పేరుతో శిక్షణ కేంద్రం(పాఠశాల) ఏర్పాటు చేసింది. ఆరంభం సూరత్వం అన్నట్లుగా హడావుడిగా కేంద్రాలనైతే ఏర్పాటు చేసింది కానీ పూర్తి స్థాయిలో ప్రత్యేక టీచర్లను నియమించడంలో విఫలమైంది. ఫలితంగా భవిత కేంద్రాలన్నీ నామ మాత్రంగా మారాయి.
జిల్లాలో 15 మండలాలకు గాను పాత 12 మండలాల్లో ఈ భవిత కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ కేంద్రాలన్నీ సమస్యలతో సతమతమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందకు పైగా దివ్యాంగులు ఉండగా ప్రస్తుతం వీరి విద్యాబుద్ధులు, ఆలనా పాలన చూసుకుంటున్నది కేవలం 9 మంది ప్రత్యేక టీచర్లే కావడం ఆలోచించాల్సిన విషయం. ఇటీవల భవిత కేంద్రాల పనితీరుపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో హడావుడిగా జిల్లాలోని 14 (తాజాగా మరొక్కరు రాజీనామా చేయడంతో) ఖాళీల భర్తీని చేపట్టేందుకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. కానీ ఇప్పటికీ నియమకాలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం జిల్లాలోని 12 కేంద్రాల్లోనూ కెరమెరి, బెజ్జూరు కేంద్రాలు ఉపాధ్యాయులు లేక మూతపడగా దహెగాం, తిర్యాణి, కాగజ్‌నగర్ కేంద్రాల్లో మాత్రమే ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆసిఫాబాద్, సిర్పూర్(టి), వాంకిడి, రెబ్బెన, జైనూరు కేంద్రాల్లో ఒక్కొక్కరు మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. వాస్తవానికి ప్రతి కేంద్రానికి కనీసం ఇద్దరు చొప్పున మొత్తం 12 కేంద్రాలకు 24మంది ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోంది. నిబంధనల ప్రకారమైతే ప్రతి ఆరుగురు దివ్యాంగులకు ఒక ప్రత్యేక టీచర్‌ను నియమించాల్సి ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో 10 నుంచి 15 మంది దివ్యాంగులు ఉంటే దహెగాంలో మాత్రం 16 మందికి పైనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు భవిత కేంద్రాల పని తీరు ఎలా ఉంది.. సక్రమంగా నడుస్తున్నాయా లేదా అన్న అంశంపై ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్ సమాచారాన్ని సేకరించి అందిస్తున్న ప్రత్యేక ఫోకస్ ఇదీ....
ఆసిఫాబాద్‌లో...
కలెక్టరేట్: ఆసిఫాబాద్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రం కొనసాగుతుంది. ఇందులో 12 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతి మంగళవారం ఫిజియోథెరఫీ నిర్వహిస్తున్నారు. భవిత కేంద్రంలో ఇద్దరు టీచర్లు, ఒక ఆయా పోస్టు ఉండాల్సి ఉండగా ఒక్కరే టీచర్ పని చేస్తున్నారు. ఒక టీచర్‌కు ఆరుగురు పిల్లల చొప్పున విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో భవనంతో పాటు మిగితా అన్ని వసతులు ఉన్నాయి.
కాగజ్‌నగర్‌లో...
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రంను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురువారం ప్రత్యేకంగా ఫిజియోథెరఫీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెండు టీచర్ పోస్టులు ఉండగా ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను తీసుకు వచ్చేందుకు ప్రత్యేక ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టి)లో...
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రం(భవిత కేంద్రం)లో మండలానికి చెందిన 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతి రోజు 13 మంది మాత్రమే హాజరువుతున్నారు. మరి కొంత మంది నడవ లేని పరిస్థితుల్లో ఉన్న వారు రాక పోవడంతో ప్రతి శనివారం పాఠశాలకు చెందిన ఐఈఆర్‌పీ టీచర్ స్రవంతి వారి ఇళ్లకు వెళ్లి విద్యాబోధన నేర్పిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండు టీచర్ పోస్టులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది. పాఠశాలకు వికలాంగులను తీసుకు రావడానికి ఆయా లు, సహయకులు పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రత్యేకంగా వీరికి మంచినీటి వసతి ఉన్నప్పటికీ పాఠశాల వద్ద మరుగుదొడ్డి, మూత్రశాలలు లేవు.
కౌటాలలో...
కౌటాల: కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రం కొనసాగుతుంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు ఉండగా 15 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజు ఈ పాఠశాల కొనసాగుతుండగా వారి కోసం ప్రత్యేక వ్యాయమాలు చేయిస్తూ విద్యాబోధన కొనసా గిస్తున్నారు.
బెజ్జూరులో...
బెజ్జూరు: బెజ్జూరు మండలంలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత కేంద్రం గత రెండు నెలల క్రితం మూతబడింది. ఇక్కడ కాంట్రాక్టు పద్దతిన పని చేసే ఉపాధ్యాయురాలుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో విధులకు హాజరు కావడం లేదు. ఇక్కడి భవిత కేంద్రంలో దాదాపు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. భవిత కేంద్రంలో మానసిక విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది. భవిత కేంద్రాన్ని స్థానిక ప్రాథమిక పాఠశాలలో నిర్వహించగా ప్రస్తుతం తెరుచుకోక పోవడంతో ప్రభుత్వం అందించే సౌకర్యాలు వారికి అందడం లేదు.
దహెగాంలో...
దహెగాం: అసౌకర్యాల మధ్య దహెగాం మండల కేంద్రంలోని భవిత కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. భవిత కేంద్రానికి వచ్చే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కనీస అవసరాలను తీర్చుకునే వసతి లేదు. మండలంలో బడీడు కలిగిన ప్రత్యేక అవసరాలు పిల్లలు 61 మంది ఉండగా భవిత కేంద్రానికి 16 మంది విద్యను నేర్చుకుంటున్నారు. ప్రతి మంగళవారం ఎనిమిది ఫిజియోథెరఫీ చేస్తున్నారు. ప్రతి శనివారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇంటికి వెళ్లి ఐఈఆర్టీ టీచర్ విద్యను బోధిస్తున్నారు. భవిత కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్‌పీ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మాటలు రాని వారికి విద్యను అందించేందుకు ఉపాధ్యాయుడు, అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
చింతలమానేపల్లిలో...
చింతలమానేపల్లి: చింతలమానేపల్లి మండలంలో భవిత కేంద్రం లేదు. ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోక పోవడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న చిన్నారులు ప్రత్యేక అవసరాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. సంబంధిత అధికారులు స్పంధించి భవిత కేంద్రాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
వాంకిడిలో..
వాంకిడి: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత కేంద్రం నామమాత్రంగా కొనసాగుతుంది. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో 20 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించగా ప్రతి రోజు కేవలం 7 మందికి పైగా రావడంలేదు. కేంద్రంలో సరైన వసతులు లేని కారణంగా ఇక్కడికి వచ్చే కొంత మంది చిన్నారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భవిత కేంద్రాలను ఉన్నతాధి కారులు సైతం తనిఖీలు చేయడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. భవిత కేంద్రానికి పిల్లలను పంపించాలని కోరినా వారి తల్లి తండ్రులు పట్టించుకోవడంలేదని భవిత కేంద్రం నిర్వాహకురాలు అనిత తెలిపారు.
తిర్యాణిలో...
తిర్యాణి: తిర్యాణి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని అదనపు గదుల్లో భవిత కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో 16 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి మంగళవారం వారికి ఫిజియోథెరఫిస్టులు వ్యాయమాలు చేపిస్తున్నారు.
జైనూరులో...
జైనూరు: మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ భవన సముదాయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిభ కేంద్రం నిర్వహణ నామ మాత్రంగా కొనసాగుతోంది. కేంద్రం నిర్వహణ కోసం ఇద్దరు టీచర్లు ఉన్నారు. కేంద్రంలో తగు సౌకర్యాలు లేనందున టీచర్లు వికలాంగుల ఇంటికి వెళ్లి వారికి వ్యాయమం, ఇతరాత్ర విద్యబోధన చేస్తున్నారని ఎంఈఓ సుధాకర్ తెలిపారు.
రెబ్బెనలో ...
రెబ్బెన: రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీ కేంద్రంలో భవిత కేంద్రం నడుస్తుంది. ప్రస్తుతం ఇందులో 24 మంది వికలాంగులు చదువుకుంటున్నారు. అయితే వీరికి పక్కభవనం లేకపోవడంతో తాత్కాళికంగా ప్రభుత్వ పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నరు. వీరికి ఇద్దరు ఉపాద్యాయులు ఉండావలసి ఉండగా ప్రసుత్తం ఒక్కరు మాత్రమే విధులు నిర ్వహిస్తున్నారు.
పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి
- కె.స్రవంతి, ఐఈఆర్‌పీ, సిర్పూర్(టి)
సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో పిల్లలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే విధంగా ఇంటి వద్ద నుంచి వారిని పాఠశాలకు తీసుకు రావడానికి ఆయాలు, సహయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో టీచర్ పోస్టు సైతం ఖాళీ ఉంది. గత అయిదు సంవత్సరాల క్రితం మంజూరైన ఆట బొమ్మలు, పరికరాలు సైతం చెడి పోయాయి. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి.
ఉత్తీర్వులు రాగానే పోస్టులు భర్తీ చేస్తాం
-ఎంఏ జబ్బార్, సెక్టోరియల్ ఆఫీసర్
జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు గతంలోనే పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాకు ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమకాల ఉత్తర్వులు అందగానే జిల్లాలో నియమకాలు చేపట్టి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం.